సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలి
అడ్డగూడూరు 30 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల కేంద్రంలోని 58వ పోలింగ్ బూత్ బిఎల్ఓతో కలిసి ఇంటింటికి తిరిగి ఓటర్ల సమగ్ర సవరణ సర్వేలో పాల్గొని ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను ఎలాగ నింపాలనో చూపించటం జరిగినది. ఈ సందర్భంగా (బిఎల్ఏ2) తుంగతుర్తి అసంబ్లీ (Thungathurthi Assembly constituency ) కోకన్వీనర్, అడ్డగూడూర్ శక్తి కేంద్రం ఇంచార్జి కూరాకుల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ అనే ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతుందని దీని ద్వారా ఓటరు జాబితా ప్రక్షాళన జరుగుతుందని అందులో ఉన్నటువంటి చనిపోయిన మరియు రెండు ఓట్లు ఉన్నటువంటి వాళ్ళవి తీసివేసి పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితాను తయారు చేయడమే ఈ సర్ కార్యక్రమం యొక్క లక్ష్యమని తెలిపారు. ఓటర్లు ఎవరు కూడా గందరగోళానికి గురి కావద్దని అలాగే ఈ యొక్క ప్రక్రియలో ఓటర్ మహాశయులందరూ కూడా పూర్తిస్థాయిలో పాల్గొని మీ ఇంటి వద్దకు వచ్చినటువంటి బిఎల్ఓ కు సహకరించి వారు అడిగిన పత్రాలను అందించి మీ యొక్క ఓటుని సరి చేసుకోవాలి అని కోరారు.