అక్షరాస్యత పెంచేందుకు అమ్మకు అక్షరమాల

Sep 28, 2026 - 19:55
 0  0
అక్షరాస్యత పెంచేందుకు అమ్మకు అక్షరమాల

మహిళా సంఘాల సభ్యులందరూ చదువుకునేలా ప్రోత్సాహం. 

జిల్లాలో ఉల్లాస్ పరీక్షలు విజయవంతం.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. జిల్లాలో అక్షరాస్యతను పెంచే దిశగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చదువుకున్న సభ్యుల సహకారంతో నిరక్షరాస్యులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక మహిళ అక్షరాస్యురాలు కావడం అంటే ఒక కుటుంబంలో కొత్త వెలుగు తీసుకురావడమేనని పేర్కొన్నారు. ఇంటి ఇల్లాలు చదువుకుంటే తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడమే కాక విద్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉందన్నారు. వయోజనులు కేవలం రాయడం, చదవడం మాత్రమే నేర్చుకోకుండా సారత్విక విద్యాపీఠం ద్వారా దూర విద్యలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర స్థాయి వరకు కూడా చదువుకునేందుకు మంచి అవకాశంగా తెలిపారు. అక్షరాస్యత పెరిగింది అంటే ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ఆస్కారము ఉందన్నారు. చదువు మధ్యలో ఆపేసిన, నిరక్షరాస్యులు ప్రత్యేక వయోజన విద్యా కేంద్రాల ద్వారా చదువుకొని జీవితంలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఇలా చదువుకున్న మహిళలకు ఈనెల 27న జిల్లా వ్యాప్తంగా ఉల్లాస్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు. అన్ని మండలాల్లో 33,783 మంది అభ్యర్థులకు గాను 24,832 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. నాలుగు మునిసిపాలిటీలకు సంబంధించి 3077 మంది అభ్యర్థులకు గాను 2564 మంది పరీక్ష రాసినట్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333