మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోల కలకలం
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ శైలజా రామయ్యర్ దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర కంటెంట్‌తో కూడిన తప్పుడు వీడియోలను పోస్టు చేసి, వారి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు న్యాయవాది శశిభూషణ్ కాశే ఫిర్యాదు చేశారు.
ఏఐ సాయంతో నకిలీ వీడియోలను రూపొందించి సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నగదు అక్రమాలకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబును తప్పుడు రీతిలో చూపించేలా వీడియోలు క్రియేట్ చేసి ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ మంథని పేరుతో నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఈ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. న్యాయవాది ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..