వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తున్నారా? జాగ్రత్త!
జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు కీలక సూచనలు
జోగులాంబ గద్వాల 24 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,,,,,విలువైన వస్తువులపై నిఘా ఇళ్లలో భారీగా నగదు, బంగారు ఆభరణాలను ఉంచడం ఏమాత్రం క్షేమకరం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, ఒకవేళ ఇంట్లోనే ఉంచాల్సి వస్తే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో భద్రత కోసం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇవి దొంగతనాల నివారణకు మరియు నిందితులను పట్టుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
పొరుగువారికి సమాచారం ప్రయాణానికి ముందు తమ నమ్మకమైన పొరుగువారికి సమాచారం అందించాలని, ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేలా వారితో సమన్వయం చేసుకోవాలని ఆయన అన్నారు,"చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా నేరాలను అరికట్టవచ్చు. సుదీర్ఘ కాలం పాటు ఊరికి వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇస్తే, ఆయా ప్రాంతాల్లో గస్తీని పెంచుతాము," అని ఎస్పీ వివరించారు. దొంగతనాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, అనుమానితులు కనిపిస్తే వెంటనే డైల్ 100 లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.