విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి
ప్రణాళికతో చదివితే మెరుగైన ఫలితాలు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి.
చదువుతోపాటు క్రీడలు, కళా రంగాల్లోనూ రాణించాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
బీచుపల్లి గురుకుల, ఎర్రవల్లి కేజీబీవీ సందర్శించిన కలెక్టర్.
జోగులాంబ గద్వాల 19 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి మండలం. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని ఫలితంగా తాము అనుకున్న రంగాల్లో రాణించేందుకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి బాలుర గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలు తరగతుల విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. గణితంలో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూనే ఖాన్ అకాడమీ డిజిటల్ లెర్నింగ్ తరగతులు కూడా సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఎఫ్ఏ1 లో వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను తెలుసుకొని మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడా, కళా రంగాల్లోనూ రాణించేందుకు ఎక్స్ట్రా కరిక్యులం ఆక్టివిటీస్ లో కూడా పాలుపంచుకునేలా చూడాలన్నారు. పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, ఎక్కువమంది 550కు పైగా మార్కులు పొందేలా చదవాలని ఆకాంక్షించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు వడ్డించాలని, ఫుడ్ కమిటీ సభ్యులు ప్రతి రోజు ఆహారాన్ని తనిఖీ చేయాలన్నారు. వంటగదిని పరిశీలించి అక్కడి స్టోర్ రూమ్ లో వంట సరుకుల నిల్వలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులను సరైన కొలతలతో కుట్టించాలని ఆదేశించారు. కంప్యూటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి తగు సూచనలు చేశారు.
అనంతరం ఎర్రవల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రతిరోజు వడ్డిస్తున్న ఆహారం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కేజీబీవీ కు సంబంధించిన పలు రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యాలయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులై ఉన్నత చదువులను అభ్యసించి గొప్ప స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు రెగ్యులర్ గా తరగతులకు హాజరై బాగా చదువుకోవాలని సూచించారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడి ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఈ పర్యటనలో గురుకుల ప్రిన్సిపల్ శ్రీనివాస్, కేజీబీవీ ప్రత్యేక అధికారి స్వర్ణలత, తదితరులున్నారు.