విత్తన పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కంపెనీలు సహకరించాలి .

జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్.

Oct 29, 2025 - 18:22
Oct 29, 2025 - 18:24
 0  0
విత్తన పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కంపెనీలు సహకరించాలి .
విత్తన పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కంపెనీలు సహకరించాలి .

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- విత్తన పత్తి పంటకు ధరలు, చెల్లింపు విషయంలో కంపెనీలు ఒప్పందం చేసుకున్న ప్రకారం వ్యవహరించి, రైతులకు ఇబ్బందులు లేకుండా సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం.సంతోష్ అన్నారు.

బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లాలో విత్తన పత్తి సాగు చేస్తున్న రైతులకు ఆయా కంపెనీల పెండింగ్ చెల్లింపులు, ఒప్పందం విషయంలో ఉన్న సమస్యలపై కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో సుమారు 46 వేల ఎకరాల్లో 36,430 మంది రైతులు విత్తన పత్తి సాగు చేసినట్లు చెప్పారు. వీరికి దాదాపు రూ.261 కోట్ల బకాయిలు ఉన్నందున సాధ్యమైనంత తొందరగా చెల్లించేలా కంపెనీల ప్రతినిధులు తమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి అన్నారు. విత్తనపత్తి సాగు విషయంలో 2025 - 26 సంవత్సరానికి ఇంకా ఒప్పందం చేసుకోని కంపెనీలు నవంబర్ 10 లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. గత 30 ఏళ్లుగా విత్తన పత్తి పంటకు ప్రఖ్యాతిగాంచిన జోగులాంబ గద్వాల జిల్లాలో కొంతకాలంగా ఒప్పందం, చెల్లింపుల విషయంలో సమస్యలు వస్తుండడం సరికాదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కంపెనీలు సహకరించకుంటే వారి లైసెన్స్ రద్దు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా పలువురు ఆర్గనైజర్లు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చెల్లింపులు, ఒప్పందం విషయంలో ఉన్న సమస్యలను ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొన్ని కంపెనీలు ఏళ్ల తరబడిగా బకాయిలు చెల్లించడం లేదని, ఫలితంగా చిన్న ఆర్గనైజర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. నాలుగైదు కంపెనీలు చేసుకున్న ఒప్పందం కంటే తక్కువ ధరలు చెల్లిస్తున్నాయని, సకాలంలో చెల్లింపులు చేయడం లేదని విమర్శించారు. 

అనంతరం ఆయా కంపెనీల వారీగా గత సీజన్లో ఉన్న బకాయిలు, సాగు చేసిన విస్తీర్ణం వివరాలు, ఒప్పందం చేసుకోవడంలో ఉన్న సమస్యల గురించి క్షుణ్ణంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 

ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి జగ్గు నాయక్, ఏడిఏ సంగీతలక్ష్మి, సీడ్ ఆర్గనైజర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు, సీడ్ ఆర్గనైజర్లు, పలువులు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State