రైతుల గోడు పట్టదా... రేవంత్ రెడ్డి ?

రైతుల గోడు పట్టదా... రేవంత్ రెడ్డి
సాగుకు నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి
కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుంది
తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలి
ప్రభుత్వానికి జల విధానం లేదా ?
మహిళల ఏమీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
గందరగోళం.. కాకిలెక్కలతో కాలం వెల్లదీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి*
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజం
పెద్దగట్టు 18 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వక రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని, అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల గోడు పట్టడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండి రైతులు ఆందోళన చెందుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంకా మాటలు చెబుతూ మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తలుగుతుందని శపించారు. తెలంగాణకు నీళ్లు మలపాలన్న సోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని, రాజకీయ కక్షతో మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారని మండిపడ్డారు.
మంగళవారం నాడు పెద్దగట్టు లింగమంతుల స్వామివారి జాతరలో ఎమ్మల్సీ కవిత పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. లింగమంతుల స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బనకచర్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని, అనుమతుల కోసం ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ మన ముఖ్యమంత్రి మాత్రం కనీసం నాగార్జున సాగర్ ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ గోదావరి జలాలను పారించారని, కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ గోదావరి నుంచి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా లక్షా 22 వేల ఎకరాలకు నీళ్లు అందించారని వివరించారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదో చెప్పాలని మంత్రి ఉత్తమ్ కు సవాలు విసిరారు. రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని ఇంజనీర్లు చెబుతున్నారని చెప్పారు. మరో 40 రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీళ్లు ఇవ్వడం లేదని ఎండగట్టారు.
పోయిన ఏడు నీళ్లు ఇవ్వక సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, నీళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లనే అప్పుడు పంటలు ఎండిపోయాయని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం, ఉసురు మంత్రి ఉత్తమ్ కు తగులుతుందని స్పష్టం చేశారు. జిల్లా మంత్రియే కాకుండా సాగునీటి శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వని మంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా కేసీఆర్ ను తిట్టుకుంటూ తిరిగితే కాంగ్రెస్ నాయకులకు ఒరిగేదేమీ లేదని, ప్రజల కోసం పని చేయాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు.
కేసీఆర్ ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో పరిపాలించారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏ ఒక్క అంశంపై ఆలోచన చేయకుండా పాలిస్తున్నారని చెప్పారు. “14 నెలల్లో 30 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఎవరు ఏమనుకున్నా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుంటా అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారు. మహిళలకు ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల అంశాలపై ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్ష చేయలేదు. మహిళలకు ప్రభుత్వం ఏమి చేయలేదు. ఏం చేశారో చెప్పడానికి ప్రభుత్వ పెద్దలు చర్చకు రావాలి” అని సవాలు చేశారు. కేసీఆర్ హయాంలో మహిళలకు పెద్దపీట వేశామని, మహిళా అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.
కేసీఆర్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేదని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో మతకల్లోలం లేని ప్రాంతమే లేదని, కాంగ్రెస్ పార్టీ పాలనలో శాంతి భద్రతల సన్నగిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఏ వర్గానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ, బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నదని ఎత్తిచూపారు. గందరగోళం.. కాకిలెక్కలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ గల్లా పట్టుకొని అడిగితే రైతు రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఎవరికీ సంపూర్ణంగా రుణ మాఫీ కాలేదని చెప్పారు. రైతుభరోసా ఒక్కో గ్రామంలో సగం మంది రైతులకు కూడా రాలేదని అన్నారు. రైతులను కూడా మోసం చేస్తూ రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతున్నారని విరుచుకుపడ్డారు.
చౌడమ్మ తల్లికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
సూర్యాపేట : పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌడమ్మ తల్లికి కవిత బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనం ఎత్తుకుని ఆలయం వద్దకు చేరుకున్న కవితకు పూజారులు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలిపారు. చౌడమ్మ తల్లికి బోనం చెల్లిండం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. సమ్మక్క సారక్క జాతర తరువాత రెండో అతి పెద్దదైన లింగమంతుల జాతర తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తుంది అని తెలిపారు. కేసీఆర్ హయాంలో జాతరకు రూ.14 కోట్ల నిధులు కేటాయించి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. ఈ ప్రభుత్వం కూడా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం అని కవిత పేర్కొన్నారు.