రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Sep 13, 2024 - 19:17
 0  9
రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని

     శుక్రవారం అలంపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలంపూర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు. వ్యవసాయపరంగా, విద్యాపరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నట్లు ఆయన తెలిపారు. తాను గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన ఉందని అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం అయితే తెలంగాణ యావత్తు సస్యశ్యామలం అవుతుందని అన్నారు. కృష్ణ తుంగభద్ర నదుల మధ్యన ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఇంకా రెండు లక్షల పైన ఉన్న రైతులకు సాంకేతికంగా పొరపాటు జరిగిన రైతులకు రేషన్ కార్డు లేని రైతులకు ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులలో ఇప్పటి వరకు రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేయడానికి 31 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. రైతన్నను, నేతన్నను రెండు కళ్ళుగా చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేనేత కార్మికులకు 30  కోట్లు మాఫీ చేసిందన్నారు. ఈసారి పంటవేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తెలిపారు. అకాల వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో అనేక మంది రైతులు నష్టపోయారని రాష్ట్రంలో కూడా రైతులు నష్టపోయిన సమగ్ర నివేదిక తెప్పించి న్యాయం చేస్తామని అన్నారు. రైతులకు పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆదుకుంటుందని మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా గద్వాల సీడ్ ప్రత్తి విత్తనాలకు డిమాండ్ ఉన్నందున ముఖ్యమంత్రితో చర్చించి ఆర్గనైజర్లతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. తుమ్మెళ్ళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మల్లమ్మ కుంట రిజర్వాయర్ను త్వరగా నిర్మించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఐజ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టిసారిస్తామని మంత్రి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ఉద్యోగం అందేలా చూస్తామన్నారు. బీచుపల్లి ఆయిల్ మిల్లు ఉత్పాదకకు మిషనరీలు ఇతర ఏర్పాట్లు చేయించి వచ్చే సంవత్సరం వరకు ప్రారంభించి ఇక్కడ నిరుద్యోగాన్ని రూపుమాపుతామని అన్నారు. ఆయిల్ ఫామ్ తోటలు పెంచడం వల్ల ప్రతి రైతుకు ఎకరాకు 
రూ. 1.50 లక్షల ఆదాయం లభిస్తుందని అన్నారు. రైతులు విరివిగా ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి లబ్ధి పొందాలన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి అధిక లాభాలు పొందాలని అన్నారు.

        మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లా వాసుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు. ప్రజలకు అన్ని విధాల ఆదుకునేందుకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించి ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశామని అన్నారు. అలంపూర్, ఐజ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు.

      ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బింగిదొడ్డి దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ గౌడ్, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఆర్డిఓ రామచందర్, మార్కెటింగ్ ప్రాంతీయ ఉపసంచాలకులు ప్రసాదరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333