రైతు వేదికలో గ్రామసభ
జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. ఈ రోజు ధర్మవరం గ్రామంలోని రైతు వేదికలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు స్పెషల్ ఆఫీసర్‌గా మండల వ్యవసాయ అధికారి పి. సురేష్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా పెసర, మినుములు, జొన్న, వేరుశనగ, ఆయిల్ పామ్ వంటి పంటలను సాగు చేయాలని రైతులకు తెలియజేశారు. అలాగే పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల సారవంత తగ్గడం, పర్యావరణ కాలుష్యం పెరగడం వంటి అనర్థాలు కలుగుతాయని వివరించి, రైతులు పంట వ్యర్థాలను దహనం చేయవద్దని సూచించారు. రైతులందరూ వెంటనే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలని కోరారు. సబ్సిడీపై జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి ఇమ్రాన్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు, డ్రిప్ ఇరిగేషన్ తదితర పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు, ఉప సర్పంచ్ ,వ్యవసాయ విస్తరణ అధికారి వేదావతి , గ్రామ పెద్దలు, రైతులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.