రూ. లక్ష పంటరుణాలను పూర్తిస్థాయిలో మాఫీచేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం
ఇంకా 14 లక్షల మందికిపైగా రైతులకు రూ. 9 వేల కోట్లు పెండింగ్
హైదరాబాద్: రెండోసారి అధికారంలోకి రాగానే రూ. లక్ష దాకా ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కారు.. ఐదేండ్లపాటు అధికారంలో ఉండి కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయలేదు. గత ప్రభుత్వ తీరు వల్ల లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా కొన్ని లోన్లు మాఫీ చేసినప్పటికీ ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు చెందిన రూ. 9 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఈ బాకీలను కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రెండోసారి పవర్లోకి వచ్చిన రెండేండ్లకు కానీ..!
2018 డిసెంబర్ 11 నాటికి రూ. లక్ష వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఆ కటాఫ్ డేట్నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులు.. రూ.25,936 కోట్ల పంటరుణాలు తీసుకున్నట్లు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తేల్చింది. నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే సుమారు 37లక్షల మంది రైతులకు రూ. 20,141 కోట్ల రుణాలను మాఫీ చేయాలని బ్యాంకర్లు తేల్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేండ్ల దాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ జోలికి వెళ్లలేదు. దీంతో వడ్డీలు పెరిగి రైతులు తిప్పలు పడ్డారు.
రైతులు, రైతు సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో రెండేండ్ల తర్వాత ఫస్ట్ ఫేస్ కింద రూ. 25 వేల వరకు లోన్లు ఉన్న 2.96 లక్షల మంది రైతులకు చెందిన రూ. 408.38 కోట్లు, సెకండ్ ఫేస్లో రూ. 36 వేల వరకు లోన్లు ఉన్న 2.70 లక్షల మంది రైతులకు చెందిన రూ.770.40 కోట్లు మాఫీ చేసింది. నాలుగున్నరేండ్లలో కేవలం 5.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.1,207 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు మిగతా క్రాప్ లోన్లను మాఫీ చేయాలని నాటి బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది.
హైదరాబాద్ ఓఆర్‌ఆర్ను 30 ఏండ్ల కాలానికి లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బును రుణమాఫీకి మళ్లించింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడు దఫాల్లో సుమారు 23 లక్షల మంది రైతులకు చెందిన రూ. 13 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు నాటి బీఆర్ఎస్ సర్కార్ ప్రకటించింది. అంటే.. ఇంకా 14 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,140 కోట్ల లోన్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ, మూడో దఫా రుణాలు మాఫీ చేసేనాటికి సీన్ రివర్స్ అయింది.
రుణమాఫీ నిధులు వేసిన బ్యాంకుల్లోని రైతుల లోన్ అకౌంట్లు మారిపోవడంతో సుమారు రూ. 2 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో చేరకుండా రిటర్న్ అయ్యాయి. ఫలితంగా రూ. 9 వేల కోట్ల పాత బాకీలను కూడా కాంగ్రెస్ సర్కారు రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా గత బీఆర్‌ఎస్ నాలుగున్నరేండ్ల దాకా లోన్లు మాఫీ చేయకపోవడంతో వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయాయి. ఆర్బీఐ నుంచి అందే 3శాతం వడ్డీ రాయితీకి కూడా నోచుకోలేదు. గత ప్రభుత్వంపై నమ్మకం పోయి చాలామంది రైతులు మిత్తికి మిత్తి చెల్లించి రెన్యువల్ చేసుకోగా.. రెన్యువల్ చేసుకొని లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు.
కొత్త సర్కారుపైనే ఆశలు
రూ. 2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు రూ. 35 వేల కోట్ల వరకు ఉంటాయని బ్యాంకర్ల ప్రాథమిక అంచనా. ఆగస్టు 15కల్లా వీటిని మాఫీ చేస్తామని సీఎం ప్రకటించడంతో ఆఫీసర్లు ఆ లెక్కలు తీస్తున్నారు. ఇప్పటికే స్టేట్ లెవల్ బ్యాంకర్లతో సమావేశమైన అధికారులు.. ఏ బ్యాంకులో ఎంత క్రాప్ లోన్లు ఉన్నాయో ఆరా తీశారు. సర్కారు నిర్ణయం మేరకు రూ. 2 లక్షలు ఏవిధంగా మాఫీ చేయాలనే దానిపై మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నారు.