మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి 8000 మంది
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత నరేంద్ర మోడీ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. భారత ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది.శుక్రవారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) కూటమి సమావేశంలో మోడీని పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంది. దాంతో ఆయన మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం అయింది. హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడవసారి దేశానికి ప్రధాని అవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, కళాకారులు, సాంస్కృతిక ప్రదర్శనకారులు, ప్రభాశీలులు సహా వివిధ రంగాలకు చెందిన 8,000 మంది వరకు హాజరు కానున్నట్టు భావిస్తున్నారు. అలాగే, 'వికసిత్ భారత్ అంబాసిడర్లు 'గా వందే భారత్, మెట్రో రైళ్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు, ప్రభుత్వ లబ్దిదారులు కూడా హాజరు కానున్నారు. ప్రత్యేక అతిథుల జాబితాలో గిరిజన మహిళలు, పారిశుధ్య కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పాల్గొన్న కార్మికులు కూడా ఉన్నారు. గతేడాది ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉన్న సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది నిర్మాణ కార్మికులను రక్షించడంలో శ్రమించిన ర్యాట్-హోల్ మైనర్‌లను కూడా ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు ఆహ్వానించారు.
అతిథుల జాబితాలో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(ఎన్ఈసీ) సభ్యులు, ఔట్‌గోయింగ్ పార్లమెంటేరియన్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌లు కూడా ఉన్నారు. వివిధ మతాలకు చెందిన 50 మంది ప్రముఖ మత పెద్దలకు కూడా ఆహ్వానం అందింది. పద్మవిభూషణ్, పద్బభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో పాటు దేశానికి, సమాజానికి సేవలు చేయడం ద్వారా మోడీ 'మన్ కీ బాత్'లో పాల్గొన్నవారు కార్యక్రమానికి విచ్చేయనున్నారు.
ప్రపంచ నేతలు..
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రపంచ నేతలు కూడా హాజరు కానున్నారు. వారిలో 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానం కింద ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే రానున్నారు. అలాగే, నేపాల్ ప్రధాని పుష్పా కమల్ దహాల్, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, మారిషస్ పీఎం ప్రవింద్ జుగ్నాథ్, సీషెల్స్ వైస్-ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్‌లకు ఆహ్వానం అందింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజూ ముఖ్యమైన ఆహ్వానితులుగా ఉన్నారు.