మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ అవసరం
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి.
22న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమం.
గూగుల్ మీట్ లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 21 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రత్యేక అధికారులుగా నియమింపబడ్డ వారందరూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మొక్కజొన్న కొనుగోలు, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గద్వాల, ఐజ, క్యాతురు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద పెద్ద మొత్తంలో నిల్వలు ఉండడంతో అదనపు లారీలను ఏర్పాటు చేసి ఈనెల 26వ తేదీ లోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాలకు సంబంధించి గోదాముల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలోనూ సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఈనెల 26వ తేదీలోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యేలా వేగవంతం చేయాలన్నారు. తహసిల్దారులు పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించుకొని జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ కూడా వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. ఈనెల 22న నిర్వహించే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంను విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఆర్డిఓ శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ డిఎం చంద్రమౌళి, డిటీఓ టీవీ రావు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.