మాదిగ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేందర్ మాదిగ, రాజేందర్ మాదిగ
హైదరాబాద్, జూన్ 26:- ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ కోసం జరిగిన 30 ఏళ్ల పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరుల త్యాగాలు మరువలేనివని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు బూరుగుల నాగేందర్ మాదిగ, తక్కెళ్ళపల్లి రాజేంద్ర మాదిగలు అన్నారు .బుధవారం హైదరాబాదులో జులై 7న లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే మాదిగ అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. మాదిగల ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగిన పోరాటం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
30 ఏళ్ల పోరాటంలో సురేందర్ , భారతి , ప్రకాష్ ,జీవా, మహేష్, ప్రభాకర్, రవి వంటి ఎంతోమంది తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి అమరత్వం పొందారని గుర్తు చేశారు. ఆత్మగౌరవ పోరాటానికి మూడు దశాబ్దాలు నిండిన సందర్భంగా ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారు సుంచు లింగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు అంకగళ్లకరుణాకర్, పెద్దింటి శ్రీనివాస్, దుబ్బ నాగేష్, చుక్క అశోక్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మల్లెపాక కుమార్, నాయకులు బొల్లి రాజన్న, సూగురి శ్రీనివాస్, కంబాలపల్లి రాములు, ఒగ్గు సోమన్న, మీసాల లింగయ్య, కనుకు రవి ,బోట్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.