మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి : గరికపాటి

సూర్యాపేట : ప్రతి మనిషి చేసే మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలని మహా సహస్ర అవధాని,పద్మశ్రీ అవార్డు గ్రహిత గరికపాటి నర్సింహారావు అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రం రవి ఫంక్షన్ హాల్ లో కర్మ సిద్దాంతం పై అధ్యాత్మిక ప్రవచనాలను ఉద్దేశించి మాట్లాడారు.
కర్మ అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసింది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము.దీని ప్రకారము పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.
భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం.విధిరాత నే వారు కర్మగా భావిస్తారు. మనుషులు మంచి, చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు, కాని వాటి ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది.మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి.ఎవరు చేసిన పాపం,పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము. తల్లి తండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు.అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.