బస్టాండ్ నిర్మించేది ఎప్పుడో....?

Oct 24, 2025 - 20:59
 0  159
బస్టాండ్ నిర్మించేది ఎప్పుడో....?

 ఎండ ఉన్న వాన పడ్డ రేకుల షెడ్డు కిందనే... 

పబ్లిక్ టాయిలెట్లు నిర్మించే నా..? 

ప్రధాన కూడలిలో ప్రయాణికుల ఇబ్బందులు ..! 

సంబంధిత అధికారుల స్పందనే లేదు...! 

తిరుమలగిరి 25 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంగా ఉన్నా, ప్రయాణికుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. పట్టణం జిల్లా ప్రధాన రహదారుల కలయిక స్థలంగా ఉండి, హైదరాబాద్,సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ వంటి ప్రధాన నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఇక్కడి నుంచే బస్సులు ఎక్కుతున్నారు. కానీ, ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పట్టణంలో ఒక శాశ్వత బస్టాండ్ లేకపోవడం ప్రజలకు నిత్య ఇబ్బందిగా మారింది. ఎండ ఉన్నా… వాన పడ్డా… బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిలువ నీడ లేదు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు వర్షంలో తడుస్తూ, ఎండలో కాలిపోయే పరిస్థితి నెలకొంది. దుకాణాల రేకుల కింద నిలబడి బస్సులు ఎక్కే పరిస్థితి రావడంతో వ్యాపారులు కూడా అసహనంగా వ్యవహరిస్తున్నారు.   ప్రత్యేకించి వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వర్షం కురిసినప్పుడు ప్రయాణికులు తడవకుండా ఉండేందుకు ఎక్కడా షెడ్డు లేదా షెల్టర్ లేదు. అదనంగా మూత్ర విసర్జన కోసం పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం మహిళలు, చిన్నారులు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. జిల్లాలో మార్కెటింగ్ పరంగా పేరుగాంచిన పట్టణంగా తిరుమలగిరి వేగంగా అభివృద్ధి చెందుతున్నా, ప్రయాణికుల సమస్యలపై ఏ ప్రజాప్రతినిధి దృష్టి సారించకపోవడం ప్రజల్లో ఆవేదన కలిగిస్తోంది. “గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కానీ ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం అయినా ఈ సమస్యను పరిష్కరించాలి. కనీసం ఒక శాశ్వత బస్టాండ్ ఏర్పాటు చేసి, పబ్లిక్ టాయిలెట్ సదుపాయం కల్పించాలని” ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు."

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి