పాఠశాల సమయం ముగియకముందే విద్యార్థులను ఇంటికి పంపిన కారణంగా ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్
చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు

మంగళవారం అయిజ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలుర పాఠశాల)లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తనిఖీ సందర్భంగా పాఠశాల సమయములో విద్యార్థులందరూ గైర్హాజరుగా ఉన్నారు.దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇది ప్రభుత్వ సెలవు కాదు. అధికారికంగా కూడా ఎటువంటి సెలవు లేదు.అయితే విద్యార్థులను అనుమతి లేకుండా విద్యార్థులను ఇంటికి ఎందుకు పంపించారు?” అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.దీనికి ఉపాధ్యాయులు, “ఈ రోజు మాల పున్నమి కావడంతో విద్యార్థులు ఇంటికి వెళ్లారు” అని సమాధానం ఇచ్చారు.అయితే దీనిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ప్రభుత్వం ప్రకటించని సెలవును మీరు ఎలా ఇస్తారు? పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చి బోధన పొందాలి. మీరు ప్రోత్సహించకపోతే విద్యార్థులు చదువు ఎక్కడ నేర్చుకుంటారు?” అని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేషపాణి శర్మను సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాధికారికి కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను స్వయంగా పరిశీలించారు.ప్రతి రోజు ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ 100 శాతం హాజరుగా ఉండాలని స్పష్టం చేశారు.విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని,ఆ దిశగా కృషి చేసి వంద శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాములు, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు. జారీచేయువారు:-జిల్లా పౌర సంబంధాల అధికారి, జోగులాంబ గద్వాల్ జిల్లా.