పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి

Apr 10, 2026 - 19:50
Apr 10, 2026 - 19:51
 0  1
పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి
పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి

ప్రతి గ్రామంలో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి ,

 పెండింగ్లో ఉన్న కూలీలు వెంటనే విడుదల చేయాలి. సీఐటీయూ డిమాండ్.

 జోగులాంబ గద్వాల 10 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పని ప్రదేశాలలో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని CITU జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ డిమాండ్ చేశారు. శుక్రవారం ధరూరు మండలంలోని యమునోని పల్లి, పెద్దపాడు, డ్యాం, గూడెందొడ్డి, మన్నాపురం, గ్రామాలలోని ఉపాధి కూలీలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపాడు లో స్థానిక సమస్యల వల్ల ఉపాధి పనులు జరగడం లేదని దీనివల్ల కూలీలు ఉపాధి లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. యమునోని పల్లి గ్రామంలో సాంకేతిక సమస్యల వల్ల వరుసగా మూడు రోజులపాటు కూలీలు అడ్డమీదికి వచ్చి ఫోటో క్యాప్చరింగ్ సరిగా రాక తిరిగి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్యామ్ లో కూడా పనుల ప్రారంభం కాలేదన్నారు. గూడెం దొడ్డి గ్రామంలో సుమారు 90 మందికి పైగా కూలీలు పనిచేయడానికి వచ్చినప్పటికీ, ఫోటో క్యాప్చర్ సమస్య వల్ల పని దొరకక తిరుగు ప్రయాణం కావలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పని ప్రదేశాలలో కూలీలకు త్రాగడానికి మంచినీరు,వడదెబ్బకు గురి అయితే ప్రత్యామ్నాయంగా ఉండవలసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూలీలు,వృద్ధులు వికలాంగుల సౌకర్యార్థం టెంటు వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మన్నాపురం గ్రామంలో సైతం ఉపాధి కూలీలు ఇటువంటి సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూలీలు పస్తులు ఉంటూ పనిచేస్తున్నప్పటికీ చేసిన పనికి గాను కూలీలు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు.  మూడు నెలల నుండి కూలీలు రావాలని చెబుతున్నారని, కానీ అధికార యంత్రాంగం మాత్రం ఫిబ్రవరి 5 లోపు వరకు అందరికీ కూలీల ఖాతాలో జమ అయ్యాయని అంటున్నారని,కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి తోడు స్థానిక అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ కరువవడంతో కూలీలకు కనీస సౌకర్యాల కల్పన  గగనమైందన్నారు. ఉపాధి పనులు జరుగుతున్న చోట అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.తక్షణమే కూలీలకు ఇవ్వాల్సిన నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు హనుమంతు,అమ్రేష్,రంగన్న, ఫాతిమా లాల్ సాబ్,నాగేష్,సవారన్న,శివన్న తదితరులు పాల్గొన్నారు. 
డిమాండ్స్.
1. పెద్దపాడు డ్యాం గ్రామాలతో పాటు, ప్రతి గ్రామంలో వెంటనే ఉపాధి పనులు ప్రారంభించి కూలీలకు ఉపాధి కల్పించాలి. 
2. పని ప్రదేశాలలో కూలీలకు మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టెంటు, ప్రధమ చికిత్స పెట్టే అందుబాటులో ఉంచాలి. 
3. పెండింగ్ లో ఉన్న కూలీలను వెంటనే ఇవ్వాలి. 
4. సాంకేతిక సమస్యలను అధికార యంత్రాంగం తక్షణమే పరిష్కరించాలి.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State