నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తీవ్ర ఆగ్రహం
వేముల శ్రీను తెలంగాణ వార్త నకిరేకల్, ఏప్రిల్ 8 : రైతుపై ఎమ్మెల్యే వేముల వీరేశం దాడి – ప్రజాస్వామ్యంపై బహిరంగ దౌర్జన్యం నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తాజాగా నార్కెట్ పల్లి లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు సందర్బంగా రైతుపై దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. స్థానిక రైతును ఎమ్మెల్యే వేముల వీరేశం బహిరంగంగా చెంపపై కొట్టడం, ఆ తర్వాత “నన్నెందుకు కొట్టారు?” అని ప్రశ్నిస్తూ కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతుపై కాలితో తన్నే ప్రయత్నం చేయడం దారుణమని ఖండించారు.
ప్రజల సమస్యలు వినాల్సిన ప్రజాప్రతినిధి… రైతులపై చేయి చేసుకోవడం మాత్రమే కాదు, ప్రశ్నించినందుకు మళ్లీ దాడి చేయడానికి దిగడం ప్రజాస్వామ్య విలువలను తుంచేసే చర్యగా పేర్కొన్నారు. ఈ ఘటనను చూసిన రైతులు తిరగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, చివరకు ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్లిపోయినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ…
“రైతు గౌరవం తుంచే ప్రయత్నం చేస్తే ఊరుకోం. అధికార దుర్వినియోగం ఎంతైనా భరించం. రైతును కొట్టే ఎమ్మెల్యేకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు” అని ఘాటుగా హెచ్చరించారు.
రైతు దేశానికి వెన్నెముక. అలాంటి రైతులపై దాడులు జరగడం అనేది సమాజంపై దాడి అని పేర్కొంటూ, వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రైతాంగానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని..బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల ఓట్లతో గెలిచిన వారు ప్రజలపై దాడులు చేస్తే… అది ప్రజాస్వామ్యం కాదు, అధికార దురహంకారానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ప్రెస్ మీట్‌లో స్థానిక నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.