తెలంగాణ ఎక్సైజ్ శాఖలో అక్రమాలు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు..
హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్‌శాఖకు పన్ను చెల్లింపు విషయంలో రూ.77 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అవకతవకలు అన్నీ 2017-22మధ్య జరిగినట్లు తనిఖీల్లో గుర్తించామని తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పని తీరుపై కాగ్ మండిపడింది. 179కేసులకు సంబంధించి పన్నులు తక్కువ చెల్లించడం, ఆలస్యంగా చెల్లించినా అపరాధ రుసుం వసూలు చేయకపోవడం చేశారని వెల్లడించింది. అలాగే అసలు పన్నులే చెల్లించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదని చెప్పింది. రాష్ట్రానికి నివేదిక ఇచ్చిన అనంతరం ఎక్సైజ్ శాఖ 11కేసుల్లో రూ.11లక్షలు వసూలు చేసినట్లు కాగ్ తెలిపింది.
రికార్డుల తనిఖీల్లో గుర్తించిన అంశాలు ఇవే..
2018 డిసెంబరు నుంచి 2022 మార్చి మధ్య 6 ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలో అపరాధ రుసుం చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కాగ్ తెలిపింది. 46 బార్ అండ్ రెస్టారెంట్లు తమ లైసెన్సుల పునరుద్ధరణ రుసుం, వార్షిక బార్ ఎక్సైజ్ పన్ను చెల్లింపుల విషయంలో ఆలస్యం చేసినట్లు తెలిపింది. అయితే వారికి రూ.71లక్షల అపరాధ రుసుం విధించకుండా అధికారులు వదిలేసినట్లు నిగ్గు తేల్చింది. ఈ అంశాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందని లేదని చెప్పింది.
సికింద్రాబాద్ డీపీఈవో కార్యాలయ రికార్డులను 2022ఫిబ్రవరిలో ఆడిట్ చేస్తున్న సమయంలో రెండు బార్లు రూ.24లక్షలు చెల్లించని విషయం తమ దృష్టికి వచ్చినట్లు కాగ్ వెల్లడించింది. 2020-21కి సంబంధించి రెండు బార్లు వార్షిక ఎక్సైజ్ పన్ను చెల్లించలేదని, వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీపీఈవో చెప్పారని తెలిపింది. దీనిపై 2022నవంబర్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెప్పింది.
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి మేడ్చల్ ఆర్‌కే డిస్టిలరీస్ ఎక్సైజ్ పన్ను చెల్లింపులో ఆలస్యం చేసినా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. ఆలస్యం చేసినందుకు విధించాల్సిన రూ.86.99లక్షల అపరాధ రుసుంను సైతం ఎక్సైజ్‌శాఖ విధించలేదని తెలిపింది. ఈ విషయం 2022జనవరిలో రికార్డులు పరిశీలించిన సమయంలో గుర్తించినట్లు కాగ్ పేర్కొంది.
శంషాబాద్ డీపీఈవో పరిధిలో 12మంది బార్ లైసెన్సుదారులపైనా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని కాగ్ తన నివేదికలో తెలిపింది. 2019 జనవరి నుంచి 2020 నవంబర్ వరకూ పన్ను చెల్లింపు విషయంలో వారు ఆలస్యం చేసినా విధించాల్సిన రూ.10.44 లక్షల అపరాధ రుసుం విధించలేదని వెల్లడించింది. 2022మార్చిలో ఖమ్మం, మహబూబాబాద్ డీపీఈవోల పరిధిలో ఎలైట్ బార్లకు సంబంధించి ఆడిట్ చేశామని, అయితే మూడు బార్లు రూ.12లక్షల ఎక్సైజ్ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ తక్కువగా చెల్లించినట్లు గుర్తించామని కాగ్ తన నివేదికలో పేర్కొంది..