తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి... మేదరమెట్ల వెంకటేశ్వరరావు
మునగాల 01 సెప్టెంబర్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
*వరి,పత్తి,మిర్చి పంటలునష్టపోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.*
*ప్రమాదాన్ని వెంటనే అధికారులు అంచనా వేయాలి.*
*ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.*
*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్.*
గత రెండు రోజులుగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల మూలంగా మునగాల మండలంలో వందలాది ఎకరాలలో వరి పంట నీట మునిగిందని, అనేక గ్రామాలలో ఇల్లు కూలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మునగాల మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల మూలంగా అనేక చెరువులు, కుంటలు అలుగు పోయడం వరద బీభత్సం వల్ల నాటు పెట్టిన వరి పొలాలు మొత్తం కొట్టుకపోవడంతో రైతులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రెవిన్యూ, వ్యవసాయ అధికారులువెంటనే గ్రామాలలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా వందలాది ఇండ్లు నేలమట్టం అయ్యాయని ఇండ్లు కూలిపోవడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ప్రభుత్వం వారికి సహాయక కేంద్రాలకు తరలించి భోజనం సౌకర్యం కల్పించాలని కోరారు. ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించి, వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. అలాగే నిత్యవసర వస్తువులు, వంట సరుకులు వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల వ్యాప్తంగా సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.