తీవ్ర ఎండల ప్రభావం ఉన్నందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... తాసిల్దార్ ఆంజనేయులు

మునగాల 01 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న తీవ్ర ఎండల దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ ఆంజనేయులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ వారం రోజులపాటు సూర్యాపేట జిల్లాలో తీవ్రస్థాయిలోఎండలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినందువలన అవసరమైతే గాని ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దని ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఇండ్ల వద్దే ఉండాలని అన్నారు. ఉపాధి కూలీలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పని ముగించుకొని ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. రైతులు వరి కొయ్యలకు నిప్పంటించకుండా ఉండేందుకు కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సాటింపు వేయించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఏవో అనిల్ కుమార్, ఏపీఎం నగేష్, ఆర్ఐ రాధారెడ్డి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.