గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 18 ఫిర్యాదులు స్వీకరణ : జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్
జోగుళాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : జిల్లా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్కిల్ అధికారుల సమక్షంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., తెలిపారు.
ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 18 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వారి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. తద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం పెరుగుతుందని అన్నారు.
గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ రోజు వచ్చిన ఫిర్యాదుల్లో తల్లికి కొడుకులు అన్నం పెట్టడం లేదని - 01, భూ వివాదాలకు సంబంధించినవి – 12, ప్లాట్ల ఆక్రమణకు సంబంధించినది – 01, గొడవలకు సంబంధించినవి – 03, ఇతర అంశాలకు సంబంధించినవి – 01 ఫిర్యాదులు ఉన్నాయి.
....