గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి:జిల్లా అదనపు కలెక్టర్
జోగులాంబ గద్వాల 4 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతి నిధి: గ్రామాలలో విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచే దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు కోరారు.గురువారం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా మండల కేంద్రంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి గ్రామంలో అభివృద్ధి సాధించే విధంగా ప్రతిజ్ఞ గావించారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు జిల్లా అదరపు కలెక్టర్ నీతి ఆయోగ్ ఢిల్లీ ప్రతినిధి శ్రియ నాయర్, సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడుతూ, నీతి ఆయోగ్ ద్వారా దేశంలోని 500 మండలాలను వెనుకబడిన మండలాలుగా గుర్తించడం జరిగిందని, ఇందులో గట్టు మండలాన్ని కూడా వెనుకబడిన మండలంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈనెల 4వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 6 అంశాలపై అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు, బాలింతలకు పౌష్టికాహారం, మండలంలోని గ్రామాలలో 30 సంవత్సరాలకు పైబడిన వారిలో రక్తపోటు, మధుమేహం వ్యాధులను గుర్తించడం, రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందజేయడం, మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ 100 శాతం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. గట్టు మండలంలో వైద్య విద్య ఆరోగ్యం వ్యవసాయ రంగాలలో అభివృద్ధి పరిచేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలి అన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి, కొత్తగా ఏర్పడే మహిళా సంఘాలకు ఆర్థిక అభివృద్ధి కోసం రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలలో గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం పట్ల ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ప్రత్యేక చరచూపాలన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం తదితర అంశాలపై వైద్య శాఖ ఆధ్వర్యంలో స్కిట్ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది.
టీచ్ ఫర్ చేంజ్, భవిష్య భారత్ అనే స్వచ్ఛంద సంస్థలు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు పనిచేయడం జరుగుతుందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఢిల్లీ ప్రతినిధి శ్రియ నాయర్, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, వైద్య విద్య శాఖల అధికారులు, ఎంపీడీవో చెన్నయ్య, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, స్థానిక ప్రజాప్రతినిధులైన మాజీ ఎంపీపీ విజయ్, జెడ్పిటిసి శ్యామలతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.