క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఎంపిక పోటీలు: అదనపు కలెక్టర్
జోగులాంబ గద్వాల 20 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్ తెలిపారు.గురువారం ఐ డి ఓ సి లోని తన ఛాంబర్ లో క్రీడా పాఠశాలలకు సంబంధించిన గోడపత్రికలను సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎనిమిది నుంచి తొమ్మిది ఏళ్లలోపు బాలబాలికలు క్రీడా పాఠశాలల్లో నాలుగవ తరగతిలో చేరేందుకు గద్వాలలోని ఇండోర్ మైదానంలో ఈనెల 28న జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ లో ఉన్న స్పోర్ట్స్ పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు 01.09.2015 నుండి 31.08.2016 మధ్యన జన్మించిన వారు మాత్రమే అర్హులని అన్నారు.
ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రము, మూడవ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు, కుల దృవీకరణ పత్రము, ఒరిజినల్ తో పాటు రెండు జతల జిరాక్స్ కాపీలతో పాటు 10 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్, స్టాండింగ్స్ బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, 6X10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28న ఉదయం 8:00 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో ఇండోర్ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారికి రిపోర్టు చేయాలన్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 15 నుండి 25 మంది బాలబాలికలు ఎంపిక పోటీలకు వచ్చేలా సంబంధిత మండల విద్యాధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు బాధ్యత వహించాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు జూలై నెలలో రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్కడ ఎంపికైన విద్యార్థులకు క్రీడా పాఠశాలల్లో నాలుగవ తరగతిలో ప్రవేశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి ఇందిర, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి బి. ఎస్. ఆనంద్, ఎస్. జి. ఎఫ్. జిల్లా కార్యదర్శి జితేందర్, ఎం. ఈ. ఓ. సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.