కాగితాలపైనే నిబంధనలు.. యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

Aug 25, 2026 - 02:13
Aug 25, 2026 - 02:16
 0  0
కాగితాలపైనే నిబంధనలు.. యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

హైదరాబాద్‌ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో శనివారం కూలిన ఏడంతస్తుల నిర్మాణం నగరంలో అక్రమ కట్టడాల సమస్య ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో మరోసారి చాటింది. కేవలం 50 చదరపు గజాల స్థలంలో నిర్మాణంలో ఉన్న ఈ భవనం కూలిపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. నిర్మాణంపై అధికారులు గతంలోనే పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్మాణం కొనసాగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 

ఇది ఒక్క ప్రమాదంగా కొట్టిపారేయలేం. తాజాగా నిర్వహించిన సర్వేలో సైబర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 800కు పైగా అనధికార భవనాలు గుర్తించినట్లు సమాచారం. అంటే నిబంధనలు ఉన్నాయి.. అనుమతుల వ్యవస్థ ఉంది.. తనిఖీ చేసే యంత్రాంగం ఉంది.. అయినా అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. అసలు లోపం నిబంధనల్లో కంటే వాటి అమలులోనే ఉందన్నది స్పష్టం.

అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు వేచి చూడటం ప్రజల ప్రాణాలతో చెలగాటమే. నిర్మాణం ప్రారంభమైన వెంటనే దాని అనుమతులను డిజిటల్‌ వ్యవస్థ ద్వారా తనిఖీ చేసే విధానం రావాలి. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, భౌగోళిక సమాచార సాంకేతికతతో అనుమతి లేని నిర్మాణాలను ఎప్పటికప్పుడు గుర్తించాలి. అనుమతించిన అంతస్తుల సంఖ్య, స్థల విస్తీర్ణం, నిర్మాణ అనుమతి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

ముఖ్యంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతికి స్వస్తి పలకాలి. పనులు నిలిపివేయాలన్న ఆదేశాన్ని ఉల్లంఘిస్తే వెంటనే నిర్మాణాన్ని సీజ్‌ చేయాలి. ప్రమాదకర నిర్మాణాలను శాస్త్రీయంగా పరిశీలించి, అవసరమైతే చట్టబద్ధ ప్రక్రియతో తొలగించాలి. అక్రమ నిర్మాణదారులతో పాటు నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా బాధ్యత నిర్ధారించాలి.

నగరాభివృద్ధి అంటే కాంక్రీట్‌ భవనాల సంఖ్య పెరగడం కాదు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే క్రమబద్ధమైన నిర్మాణమే నిజమైన అభివృద్ధి. గచ్చిబౌలి విషాదం మరో వార్తగా మిగలకుండా, హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై శాశ్వత, పారదర్శక, కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థకు నాంది కావాలి.

హెచ్. ప్రతాప్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333