కలహాల కాపురాలకు ఆజ్యం పోస్తున్న  సీరియళ్లు!

Jun 10, 2026 - 00:05
 0  1

కలహాల కాపురాలకు ఆజ్యం పోస్తున్న  సీరియళ్లు!  కుటుంబ, మానవ బంధాలకు విఘాతం కలిగించడమే  టీవీ ప్రసారాల లక్ష్యమా?  మనిషిని  మనిషిగా  చూడలేని వ్యవస్థకుపెద్దలు చికిత్స చేయవలసిన బాధ్యత  మరిచిపోతెలా?

---వడ్డేపల్లి మల్లేశం 

వీలైతే తోటి మనిషికి సహాయం చేయాలి లేకుంటే  మౌనంగా కూర్చుంటే అంతే చాలు కానీ  లేనిపోని కయ్యాలు కల్పించడం  సంఘవిద్రోహమే.  ఇది   నిత్య కృత్యంగా కొనసాగుతున్న  దినచర్యగా భావించవచ్చు.  ఇదే మాదిరిగా ప్రస్తుతం టీవీ ప్రసారాలు సీరియల్  సామాజిక  సంస్కరణకు మానవ సంబంధాల బలోపేతానికి  అజ్ఞానంలో ఉన్న వారిని విజ్ఞానములో నికి తీసుకురావడానికి దోహదపడవలసిన బదులు  ప్రతి కాపు రాన్ని కలహాలలో ముంచే విధంగా సంభాషణలు, కథాకతనము, వ్యాఖ్యలు,  హావభావాలు  ఆందోళనకరంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ  ఎవరు ఎందుకు వ్యతిరేకించడం లేదు అనేది నాకు ఉన్నటువంటి  ఆశ్చర్యకరమైన అభిప్రాయం.  రాజకీయాలను,  సామాజిక అంశాలను, రాజకీయ పార్టీల విధానాలను,  ప్రభుత్వ ప్రజా  దృక్పథాలను,  ప్రజల సామాజిక బాధ్యతలను నిరంతరం  ఏదో ఒక మూలన చర్చిస్తూ సామాజిక రాజకీయ విశ్లేషకులు  మేధావులు బుద్ధి జీవులు నిత్యం  మార్గ నిర్దేశం చేస్తూనే ఉన్నారు.  ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి రాజకీయ పార్టీలకు గుణపాఠం కూడా  చేస్తున్నారు.  కానీ ఇలాంటి సామాజిక  విఘాతానికి  దోదకారులవుతున్నటువంటి టీవీ ప్రసారాలు సీరియల్ ఇతర  కార్యక్రమాలలో ఉన్నటువంటి అనౌచిత్యాన్ని,  అర్థనగ్న దృశ్యాలను,  విగాతము కలిగించే సంభాషణలు,  కలహాలు కయ్యాలను నేర్పే మాటలు  కల్లారా చూస్తూ  చెవులారా వింటూ  హావ భావాలను చూస్తూ ఆశ్చర్యపోతూ కూడా మౌనంగా ఉంటున్నారు కానీ ప్రశ్నించడం లేదు ఎందుకు?  సామాన్య ప్రేక్షకుల నుండి మేధావుల వరకు ఈ సన్నివేశాలు అందరికీ ఒకే మాదిరిగా కనిపిస్తున్నాయి కదా!  ఆటవిడుపుగా,  టైం పాస్ గా,  పొద్దు గడవడానికి  అన్నట్లుగా చూస్తే ప్రయోజనం ఏముంటుంది?  ప్రతి పనికి ప్రతి కార్యానికి  ఆలోచనకు ఆచరణకు  సిద్ధాంతానికి  చేష్టలకు ప్రయోజనం అంటూ ఉండాల్సిందే.  టీవీ ప్రసారాలకు మాత్రం ఈ మినహాయింపు ఎందుకు?  ఎవరు ప్రశ్నించకుండా  ఇంత మౌనంగా ఉండడం లోని ఆంతర్యం ఏమిటి?  ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే  తెరమీద తాత్కాలికంగా కొద్ది నిమిషాలు కనపడుతున్నటువంటి  దుష్ప్రచారాలు, దుష్ప్రభావాలు, నిందలు,  కలహాల సన్నివేశాలు శాశ్వతంగా మానవ జీవితాలను  సమాధి చేస్తూ ఉంటే వేలాది కుటుంబాలు వీధిపాలవుతూ  మానవ కుటుంబ బంధాలు తెగతెంపులు కావడాన్ని మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. అయినా ఒక్కసారి కూడా ప్రశ్నించడం లేదంటే  వాళ్ల దృష్టిలో ఈ సీరియల్ ప్రసారాలు  సమాజాన్ని ఉద్ధరిస్తున్నాయా?
       అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు,  వేషధారణ,  పలకరింపులు,  అంగాంగ ప్రదర్శనలు  సమాజాన్నిముఖ్యంగా యువతను  చిందరవందర చేస్తున్నాయి   అంటే అతిశయోక్తి కాదు. తమ కర్తవ్యాన్ని, వృత్తిని మరిచి వికృత చేష్టలు వేషధారనతో ఇప్పటికే సెల్ఫోన్ వ్యవస్థలో  ఎన్ని అంశాలు ఉపయోగకరంగా ఉన్నాయో అంతకు మించిన స్థాయిలో  మనిషిని కూ ల దోచే విధంగా  ఇబ్బెట్టుగా ఉండే సంభాషణలు సన్నివేశాలు  గంటల తరబడిగా చూసే అలవాటుకు పురికొల్పి ఎంతో  దుష్ప్రభావానికి గురి చేస్తూనే ఉన్నాయి.  సెల్ ఫోన్లతో పాటు టీవీ ప్రసారాలు  మరింత ప్రభావవంతమైనటువంటి  మీడియాగా మానవ సమాజం పైన ఇలాంటి ఆకృత్యాలను రుద్దుతూ ఉంటే  ఏ కొద్దిమంది నిర్మాతలు రచయితలు, కళాకారులు నటుల సంతృప్తి కోసం వారి ఉపాధి కోసం వారి మెప్పు కోసం  ప్రజలు నిర్బంధంగా చూడాల్సిందేనా?  ఇప్పటికే వ్యాపారమయమైన మానవ సంబంధాలు  పడి లేస్తూ  కుంటి నడక నడుస్తూ ఉంటే  మనుషుల మధ్యన కయ్యాలను నూరిపోసే మాటలు  సందర్భాలు సన్నివేశాలు  ఏవగింపులు  ఉన్నవాళ్లు లేని వాళ్ళ మధ్యన అసమానతలు అంతరాలను ప్రత్యక్షంగా కళ్లారా చూపిస్తూ,  బంగారు ఆభరణాలతో,  అంగాంగ ప్రదర్శనలతో,  జీవితమంటే ఇదే అనే రీతిలో తెరమీద కనిపిస్తే  నిజజీవితంలో ఏమాత్రం పొంతనలేని సన్నివేశాలను నిర్బంధంగా ప్రజలు చూడవలసిందేనా?  ఈ అంశం మానసికవేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, బుద్ధి జీవులకు  ఏనాడు మనసుకు తోచలేదా?  నిజజీవితంలో ఉన్న కథలను చూపిస్తున్నారా?  లేదా తెరమీద చూపిస్తున్న కథల వల్ల జీవితాలు చెడి మారిపోతున్నాయా?  ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఎందుకంటే అనేక అసమానతలు అంతరాల వలన కుటుంబ బంధాలు బంధుత్వాలు బలహీనంగా కావడం,  ఇదే అదనగా వికృత చేష్టలతో సంబంధాలను తెగదింపులు చేసుకోవడానికి సిద్ధపడుతూ  తమ చుట్టూ మాత్రమే గిరిగేసుకొని బ్రతికే కుటుంబ బంధాల కొత్త భాష్యానికి  అలవాటు పడుతూ ఉంటే ఇక పక్క వాడితో సంబంధాలు ఎలా ఉంటాయి?  అంతెందుకు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యనే బంధాలు అతి బలహీనంగా ఉన్న విషయాన్ని ఎవరైనా కాదనగలరా?  భార్యాభర్తల మధ్యన బంధాలను కూడా  కలహాలతో చూపెట్టే  సందర్భాలు తెరమీద కనబడుతుంటే  భార్య భర్తను భర్త భార్యను గౌరవించే అవకాశం ఉంటుందా?  కన్నపిల్లలు వృత్తికి, పనికి,  క్రమశిక్షణకు దూరమై  వికృత చేష్టలకు అలవాటు పడుతూ ఉంటే ఆ సన్నివేశాలను బలంగా చూపిస్తూ ఇదే నిజజీవితమని నమ్మించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం?

 టీవీ ప్రసారాల  నిర్వహణకు సంబంధించి.

  నియమ నిబంధనలు ఆదేశాలు  మార్గదర్శక సూత్రాలను రూపొందించే క్రమంలో  అలాంటి కమిటీలలో  బుద్ధి జీవులు సామాజికవేత్తలు మేధావులను  పాల్గొనేలా చూడాల్సిన అవసరం ఉంది.  అత్యాచారాలు హత్యలు జరిగిన తర్వాత  కారణాలను వర్ణిస్తూ చేసే మానసికవేత్తల అభిప్రాయాలు, విశ్లేషణలు  విభిన్న రకాలుగా  స్పష్టం చేయడం జరుగుతూ ఉంటుంది.  అదే అలాంటి సన్నివేశాలు జరగకుండా  ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి హెచ్చరికలను  అమలు చేసినట్లయితే కొంతవరకు అలాంటి దుష్ట సంఘటనలను జరగకుండా  చూడవచ్చు కదా! మద్యపానాన్ని, అత్యాచారాలను, హత్యలను,   వివక్షతను,  ఏవగింపును, కుట్రలను,  తోటి వారి పట్ల చిన్నచూపు,  నిందలు,  కయ్యాలు, కలతలు, కన్నీళ్లు  ప్రతి సీరియల్ లో నిరంతరం దర్శనమిస్తూనే ఉన్నాయి.  అలాంటి వాటి పట్ల స్పందించినటువంటి జనం  తమ నిజ జీవితంలోని అంశాలకు అదే మాదిరిగా స్పందించే అవకాశం ఉంటుంది కదా! ఈ రకంగా సీరియల్ వ్యక్తుల జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం?.ఈ ప్రసారాలు, సీరియల్లు  వ్యక్తుల జీవితాలను మార్చాలి,  మానవతా కుసుమాలను పూయించాలి , మనిషిని మనిషిగా చూసే సంస్కారాన్ని అలవాటు చేయాలి,  ఓర్పు నేర్పును పెంచాలి,  తప్పటడుగులు వేసే వారికి నచ్చజెప్పాలి,  నిండైన మూర్తి మత్వాన్ని అలవరచాలి. ఈ పనులకు బదులుగా  ఆడంబరాలు  అవమానాలు  నిందలు  కుట్రలు   చేదు మాటలు  అసహ్య కరమైన చేష్టలు  తాత్కాలికంగా  ఉల్లాసం అనిపించినా శాశ్వతంగా మనిషి జీవితాన్ని నాశనం చేసే అనేక సన్నివేశాలను  రద్దు చేయడం ద్వారా నిర్వాహకులు  రచయితలు టీవీ ప్రసార బాధ్యులు చివరికి ప్రభుత్వం  తమ సామాజిక బాధ్యత నిర్వహించాలి. ఇలాంటి వారికి సామాజిక వేత్తలు మేధావులు విశ్లేషకులు  తగిన పాఠాలు చెబుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే  అంతో ఇంతో బలిష్టంగా ఉన్నటువంటి మానవ సంబంధాలు మరింత దిగజారకుండా ఉండడానికి,  చేదు ఫలితాలు కనపడకుండా కాపాడుకోవడానికి,  మనిషిని మనిషిగా చూసే మానవ సమాజాన్ని కొంతకాలం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి పూర్తిగా  డబ్బు, స్వార్థం,  అహంకారం, ఆధిపత్యం చుట్టూ ప్రవర్తిస్తున్న వేళ  మనిషిని మహోన్నతునిగా చూడాలనుకోవడం అత్యాశే కావచ్చు కానీ ఆ ప్రయత్నం చేయక తప్పదు.  అటువైపుగా తీసుకువెళ్లే ప్రయత్నాలను  ఈ సీరియల్లు టీవీ ప్రసారాలు కనుక తమ లక్ష్యంగా పెట్టుకుంటే ఈ వ్యవస్థ మరింత బాగుంటుంది.  సీరియల్ నిర్వాహకులు ఇకనుండి తమ మనసు మార్చుకొని,  శైలిని సవరించుకొని,  చేష్టలను  సంస్కరించుకొని  వ్యవస్థను బలోపేతం చేసే దిశగా   కొనసాగించాలని మనం కోరుకుందాం! మనసారా ఆశిద్దాం!  అందుకు భిన్నంగా ప్రజా వ్యతిరేక చర్యలకు,  సామాజిక  విఘా తానికి  తలపెట్టే ప్రతి చర్యను కార్యక్రమాన్ని సన్నివేశాన్ని సంఘటనను  నిరంతరం ఖండించాలి. ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది.  ఇక ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? సామాజిక బాధ్యతను  గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందా? వేచి చూడవలసివుంది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333