కొలువులకు తగిన నైపుణ్యాలతో కూడిన  విద్యను రూపొందించాలి

Jun 10, 2026 - 00:08
Jun 10, 2026 - 22:53
 0  4
కొలువులకు తగిన నైపుణ్యాలతో కూడిన  విద్యను రూపొందించాలి

కొలువులకు తగిన నైపుణ్యాలతో కూడిన  విద్యను రూపొందించాలి. డిగ్రీలు పట్టాల కోసం  చదివే చదువులు మళ్లీ చదువులు చెప్పడానికే పనికి వస్తాయి. ప్రపంచంలోనే యువత అగ్ర భాగం నైపుణ్యాల కొరతతో విదేశాలపై ఆధారం 

----వడ్డేపల్లి మల్లేశం

కేంద్రం దశాబ్దం క్రితం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది    ఏ రంగంలో ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించినారు ఇప్పటికీ స్పష్టమైన  ఆధారాలు లేవు.  ఇక ప్రతి ఏటా కోటి మందికి పైగా యువతీ యువకులు కొత్తగా  పట్టాలు పుచ్చుకుంటూ ఉద్యోగం వేటకై ఉపాధి  అన్వేషణ లో వీధిలోకి వస్తున్నారు. అయితేనేమి  ఉద్యోగాల కొరత,  నైపుణ్యం లేకపోవడం  కారణాలు ఏవైనా  అతి తక్కువ మందికి మాత్రమే కొలువులు లభిస్తున్నా  ఇటీవల కాలంలో ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్య  ప్రధాన వనరు కాగా 80 శాతo అభ్యర్థులకు ఉద్యోగాలకు కావలసిన సామర్థ్యాలు లోపిస్తున్నాయని మేధావులు  విజ్ఞులు అభిప్రాయపడుతుంటే  ఇక మామూలు పట్టభద్ర  కోర్సులు చదివినటువంటి వాళ్ళ లోపల కూడా  90 శాతానికి పైగా  చదువుతో సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారంటే ఈ దేశంలో చదువుకు ఉద్యోగాలకు మానసిక  సంసిద్ధతకు లింకు ఎక్కడుంది?.  ఇ న్నింటికి తోడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీ ప్రకారంగా కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సందర్భంలో యువతకు ముందే ఆయా రంగాలలో నైపుణ్యాలను పెంపొందించి  నైపుణ్యభారతగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత లేదా? స్వ దేశంలో అర్హులైన వాళ్ళు లేక ఇతర దేశాలలోని  యువతను తమ కంపెనీలలో తీసుకోవడం కోసం మన దేశస్తులు ఆరాటపడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు.అధిక శాతం యువత వున్నా అర్హులు లేరని స్వదేశీ కంపెనీలు విదేశాల వైపు చూస్తుంటే మెజారిటీ యువత భారంగా బతుకులు వెళ్ళాదీస్తుంటే దేశాభివృద్ధి ఎలా సాధ్యం?. ఇటీవల అదాని గ్రూప్ తమ సోరశక్తి పరికరనిర్మాణాల కోసం చైనా ఇంజినీర్ల నియామకానికి ప్రభుత్వాన్ని అభ్యర్తించిన విషయం దేశీయంగా నిపుణుల కొరతకు అద్దం పడుతుంటే ఎలా? ఇదంతా మన  ముందు చూపు లేకపోవడం,  ప్రణాళికా బద్ధమైన కృషికి  ఎన్నో అ వరోదాలున్నాయని అర్థం చేసుకోవచ్చు.  సుమారు 45 ఏళ్ల క్రితం  డిగ్రీ, ఫీజీ లు చేసిన వాళ్లు మళ్లీ  డిగ్రీ పీజీ విద్యార్థులకు  లెక్చర్స్ ఇవ్వడానికి లెక్చరర్ గా ఉద్యోగానికి మాత్రమే ఆ  ఆనాడు అవకాశాలు ఉండేవి. కానీ ఈనాడు  చదువుకున్న వాళ్ళు చదువు చెప్పడానికి మాత్రమే  పనికొస్తే ఈ దేశం అభివృద్ధి  జీరోఅన్నాల్సిందే.  అందుకే బహుళ ప్రయోజన పద్ధతిలో చదివినటువంటి చదువులకు ఉపాధి అవకాశాలు శాస్త్ర సాంకేతిక రంగాలలో  కల్పించుకోవడం దానికి ఇతర దేశాల యొక్క సహకారాన్ని తీసుకోవడం  ప్రపంచంలోనే యువత అతిగా ఉన్నటువంటి భారతదేశo అందుబాటులోని అవకాశాలను పునికి పుచ్చుకొని  యువ భారతదేశంగా రాణించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఈనాడు ఎంతగానో ఉన్నది.

కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం 

చదివిన చదువుకు సామర్థ్యానికి సరిపోయే ఉద్యోగాలు లేనప్పుడు  సృజన దెబ్బతింటుంది  అక్కడ లోపం అనుకూలమైన ఉపాధి అవకాశాలు కల్పించనటువంటి ప్రభుత్వాలదే అవుతుంది. కానీ  బహుళ ప్రయోజన రీతిలో ఉపయోగపడే విధంగా విద్య నైపుణ్యాలను  యువత కు అందించడంలో  విఫలమైతే    ప్రపంచంలోనే దూసుకుపోవాలనే మన కల నిజమయ్యేది ఎలా?.  ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జనాభాలో 65% నవతరమే అయినా  నవీన  ఆధునిక సాంకేతిక రంగాల్లో  సత్తా ఉన్న వారిని వెతకడం కోసం  భారతీయ సంస్థలు కంపెనీలు విదేశాల వైపు చూస్తున్నాయి అంటే  నిజంగా ఇది సిగ్గుచేటైన విషయం,  మన యువతను మనమే అవమానించుకోవడమే అవుతుంది.  ఒక అంచనా ప్రకారం గా భారతదేశంలో 40 రంగాలలో 250 కి పైగా ఉపాధి మార్గాలు నేర్చుకునే అవకాశం బలియంగా ఉంది కానీ  వాటిపై అవగాహన కల్పించే వాతావరణం విద్యాలయాలలో లేకపోవడంతో  యువత మొక్కుబడిగా 93 శాతం మంది ఇంజనీరింగ్,మె డిసిన్, ఐటి, మేనేజ్మెంట్ వంటి  కొన్ని రంగాలకే పరిమితమై విద్యను అభ్యసిస్తూ ఉంటే మిగతా రంగాలు  కునా రిల్లిపోక మరే మవుతాయి? అందుకే కదా ఆ రంగాలలో నిపుణుల కోసం ఇతర దేశస్తులపైన ఆధారపడేది.  ఒక అంచనా ప్రకారం గా రానున్న రోజులలో  ఏఐ, రోబోటిక్స్, హరిత ఇంధనాలు, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, డిజిటల్  మార్కెటింగ్ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం  రంగాలలో ఎన్నో కొత్త అవకాశాలు రానున్నాయి  ఆ రంగాలలో పనిచేయడానికి సంసిద్ధులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కదా! ఒక అంచనా ప్రకారం గా పునరుత్పాదక ఇంధన రంగంలోనే 17 లక్షల నూతన ఉద్యోగాలు అంది వస్తాయని  నిపుణులు అంచనా వేస్తుంటే  దేశ యువతకు అవకాశాలను కల్పించవలసిన బాధ్యతను పాలకులు, తల్లిదండ్రులు మరిచిపోతే ఎలా? విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు,  తరగతి గదులు,  పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్య సంస్థల మధ్యన సత్సంబంధాలు  ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే  లక్షలాది ఉద్యోగాలను  చేయి దాటకుండా బయటికి పోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది.  యువత ఎక్కువగా ఉన్నదని మురిసిపోతే లాభమేమున్నది? ప్రతి యువతలో ప్రతి ఒక్కరు కూడా  ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు అని సగర్వంగా చెప్పుకునే సత్తా మనకు ఉండాలి ఆ బాధ్యత పాలకులది ఆ వైపుగా ఆలోచించవలసిన  సామాజిక చింతన తల్లిదండ్రులకు కూడా అవసరమే.  సాధారణంగా భారతదేశంలో పట్టభద్ర  స్థాయి చదువుకోవడం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూడడం, అంతటితోనే ముగిసిపోవడం గతంలో ఆనవాయితీగా ఉండేది. కానీ  కాలక్రమంలో సర్కారీ నౌకర్లను ప్రభుత్వాలు భారీగా తగ్గించి ప్రయివేట్ వైపు మొగ్గు చూపడంతో పాటు  వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో కూడా తలెత్తిన సంక్షోభం వల్ల  ఎంతోమంది వ్యవసాయ రంగంలో ఉపాధిని కోల్పోవడం వల్ల విధి లేని పరిస్థితిలో ఉద్యోగాల వేటలో పోటీ పడుతున్నారు.  ఈ పోటీకి తగిన రీతిలో ఉద్యోగ అవకాశాలను కల్పించవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్రాల పైన ఉన్నది అందుకు కేవలం  వేతనం ఇస్తే సరిపోతుందని కాదు  ఉద్యోగానికి తగిన నైపుణ్యం ఉన్నప్పుడు  ఉత్పత్తి పంపిణీ  విదేశాలకు ఎగుమతి చేయడంలో  మన దేశం ముందు వరుసలో ఉంటుంది. ఆ రకమైనటువంటి అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లడానికి  మనకు ఉన్నటువంటి లక్షలాది అవకాశాలను ఉపయోగించుకోలేకపోవడం మన నేరమే... కానీ  మన యువతలో విజ్ఞానం నైపుణ్యం లేక కాదు.

సరిచూ చుకొని సవరించుకోవాలి

ముఖ్యంగా భారతదేశంలో యువతలో నిర్లక్ష్యం,  తప్పటడుగులు,  అసాంఘిక లక్షణాలు,  టీవీ సెల్ ఫోన్ వ్యవస్థ వంటి అంశాలు కూడా అతిగా ప్రభావితం చేయడం వల్ల  యువత  దారి తప్పుతున్నది. క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు, మద్యపానం ధూమపానం వంటివన్నీ కూడా యువత పైన చెడు ప్రభావం చూపడం వల్ల  మన యువతను మనమే నిందించుకునే దౌర్భాగ్య పరిస్థితులు దాపురించినవి.  ఈ దుష్ట సంస్కృతిని కట్టడి చేయడానికి పాలకులు  చట్టబద్ధమైన  రీతిలో నిషేధం విధించడంతోపాటు  ఔత్సాహిక ప్రోత్సాకాలను అందించే క్రమంలో నైపుణ్య సంస్థలను విరివిగా  నెలకొల్పి  భారతదేశంలో ఏ రంగానికైనా యువతను నిపుణులను  మేధావులను బుద్ధి జీవులను శాస్త్రవేత్తలను అందించగలం అని సగర్వంగా చెప్పుకునే సత్తా మనకు ఉంది.  స్పృహ సోయి తపన పాలకులకు ఉంటే కచ్చితంగా ప్రపంచంలో అగ్రభాగాన నిలబడతామనడంలో సందేహం లేదు.

చదువుకునే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. చదువుకు దూరం అవుతున్న వాళ్ల సంఖ్య నిల్ అని చెప్పిన అతిశయోక్తి లేదు.  ఎక్కడో మారుమూల ప్రాంతాలు లేదా గిరిజన ఆదివాసి ప్రాంతాలలో కొంత ఇబ్బంది జరగవచ్చు కానీ ప్రస్తుత నాగరిక  సమాజంలో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి విద్యా అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా యువత  విద్యారంగంలో  నిలదొక్కుకుంటున్నారు అందుకు తగినటువంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నారు కానీ  పక్కదారి పట్టించే అసాంఘిక కార్యకలాపాలు దుష్ట సంస్కృతి  యువతను  పక్కకు లాగుతూ ఉంటే వాళ్ల మనసు  మేధోపరమైనటువంటి  అంశాల పైన నిలవడం కష్టం కదా!  ఈ లోపాలను  తల్లిదండ్రులు కూడా  గుర్తించి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తమ పిల్లలను జారవిడుచుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఇవ్వాల కనపడుతున్నాయి.    సాంఘిక రాజకీయ రంగంలో ఉన్నటువంటి అనేక అసమానతలు అంతరాలు  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు డ్రగ్స్ మధ్యము మత్తు పానీయాలు  ఇవన్నీటిని నిషేధించి యువతను  కార్యో్నముఖులను చేయగలిగితే  ప్రపంచంలోనే భారతదేశం  యువ  నిపుణులు శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులతో కూడినటువంటి అత్యున్నత స్థాయిలో  అగ్ర బాగా న నిలబడుతుంది అనడంలో సందేహం లేదు.  చదివినది ఒకటి చేసే ఉద్యోగం మరొకటి అది కూడా కనీసం  జీవితానికి విలువలకు  నైపుణ్యాలకు సంబంధించినవి కాకుండా గుమస్తాలుగా లెక్కలు చేసి  వేతనాలు పంచి  సర్దుబాటు చేసే పోస్టుల్లో లక్షలాదిమంది ఉంటే ఏ రకంగా ఈ దేశాభివృద్ధికి ఉపయోగపడతారు?  అందుకే  సేవా రంగానికి సంబంధించిన ఉద్యోగాలను తక్కువ చేసి నైపుణ్య రంగాలకు సంబంధించిన ఉద్యోగాలను ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో  లక్షలాది పోస్టులను  కల్పించడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలను శాసించగలిగే స్థాయిలో మనం నిలబడగలిగితే  అనేక రంగాలలో ఉత్పత్తిని అధికం చేసుకునే అవకాశం ఉంది.   అనేక అంశాలకు సంబంధించి  పరిష్కారాలను కూడా మన భారతదేశంలో కనిపెట్టే ఆస్కారం కూడా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ,  సముద్ర జలాల పరిశుద్దీకరణ,  పునరుత్పాదక ఇంధన వనరుల యొక్క  అతి వినియోగం,  ప్రమాదకర ఇంధన వనరుల  వినియోగాన్ని తగ్గించే   నూతన వనరుల ఆవిష్కరణ ప్రధానమైనటువంటి అంశాలు. విశ్వవిద్యాలయాలు, విజ్ఞానానికి నెలవులు  మానవీయ విలువలకు ఆనవాళ్లు.  ఈ రెండు లక్షణాలను పునికి పుచ్చుకుంటే  అభ్యుదయ  అగ్రగామిగా  ప్రపంచ  పటంలో
భారత్ తన స్థిరమైన స్థానాన్ని పదిల పరుచుకుంటుంది అనడంలో సందేహం లేదు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333