ఒత్తిడి వద్దు సోదరా! చిత్తయిపోవద్దు సోదరి! నూరేళ్ల జీవితాన్ని అర్థవంతంగా జీవించండి!
నెగిటివ్ ఆలోచనలతో జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవద్దు. ఒత్తిడిలో పడితే జీవితమే నిర్వీర్యం అయిపోతుంది .
----వడ్డేపల్లి మల్లేశం
ఒత్తిడి ఇవాళ సహజంగా ప్రతి చోటా మాట్లాడుకునే మాట. సంతోషం, ఓపిక, ఓర్పు, నేర్పు, ఉల్లాసం ఉండాల్సిన బదులు వాటి స్థానాల్లో కోపం, అసూయ, ద్వేషం, ఏకాగ్రత లోపించడం, ఒత్తిడికి గురి కావడం, ఆందోళన చెందడం, భయపడడం ఇవి నేడు మానవ జీవితాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. అయితే ఇవన్నీ మనిషి తనకు తానుగా తెచ్చుకుంటున్నవే. తన శక్తిని సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేసుకుని ప్రతి పనిని కూడా నెగిటివ్గా ఆలోచించడం వలన ఇవన్నీ దాపరిస్తున్నాయి. సానుకూల దృక్పథాన్ని అవలంబించి, ప్రతి పని నాతో సాధ్యమేనని, ఈ విషయంలో గెలిచి తీరుతానని, సానుకూల ఆలోచనలను కలిగి ఉంటే జీవితం నందనవనమే. అయితే కావాల్సింది అసూయ ద్వేషాలు, కుట్రలు కుతంత్రాలను విడిచిపెట్టడం మాత్రం అవసరం. కానీ నేటి మానవులు వీ టిని పట్టుకొని వేలాడుతున్నారు కనుకనే ఒత్తిడికి గురవుతున్నాడు జాగ్రత్త యువతా!
ఆందోళన చెందడం వల్ల శారీరక మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం అవి క్రమంగా పరిణామ క్రమంలో సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసే స్థాయికి చేరడంతో పాటు శారీరక బలాన్ని కూడా కుదించి వేసి బలహీనులను తయారు చేస్తుంది. ముఖ్యంగా స్త్రీ పురుషుల్లో ఇద్దరిని కూడా మానసిక ఒత్తిడి నిరాశపరిచి ఆందోళన గురిచేసినప్పటికీ మగవాళ్లపై మరింత దుష్ప్రభావాలు ఎక్కువ అని వైద్య పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అధిక ఒత్తిడి పైన జరిపిన అనేక పరిశోధనల్లో అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జామిన్ బ్రహ్మబట్ పరిశోధన ప్రకారంగా ఒత్తిడి వల్ల సంతానోత్పత్తికి దారి తీసే వీర్యకణాల సంఖ్య పడిపోయి క్రమంగా బలహీనంగా కదలడానికి సహసంబంధం ఉందని, పురుషులు నిరంతరం ఒత్తిడి కి లోనవడం వీర్యకణాల ఆరోగ్యం పై దుష్ప్రభావం అధికంగా కలవడానికి దోహదపడుతుందని ఒత్తిడిని తగ్గించుకోకపోతే భవిష్యత్తు జీవితం అంధకారమని ఈ పరిశోధన హెచ్చరిస్తున్నది.
వైద్య పరిశోధనలు ఒత్తిడి వల్ల అనర్థాలు
శాస్త్ర సాంకేతిక రంగాలలో కొనసాగిన పరిశోధనల సారాంశాన్ని జనానికి సంబంధితులకు ముఖ్యంగా ప్రస్తుతం యువతి యువకులకు తెలియజేయడం ద్వారా జరుగుతున్న పొరపాట్లు చేస్తున్న తప్పులు సవరించుకోవలసినటువంటి పరిస్థితులను అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా యువతి యువకులకు ప్రధానమైనటువంటి సంతాన సమస్యను ఫోకస్ చేస్తూ జీవితమే నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నదని తెలిపే ఈ పరిశోధన చాలా అత్యంత బాధాకరం. అందుకే యువతి యువకుల్లారా జాగ్రత్త మీ ఒత్తిడిని నివారించుకోండి. పురుషులకు సంబంధించిన అంశం ఈ వ్యాసంలో ప్రధానంగా ఫోకస్ చేసినప్పటికి సంతానోత్పత్తి ఉబయుల కృషి ఫలితమే కదా! ఆ అవగాహనా ఇరువర్గాలకు ఉండాలని కోరుకుంటూ సంతానోత్పత్తితో హాయిగా సాగిపోండి.
--- తాత్కాలికంగా ఒత్తిడితో పెద్దగా ప్రమాదం లేదు కానీ రోజులు వారాలు నెలపాటు కంటిన్యూగా ఒత్తిడి జరిగినట్లయితే నిద్ర దెబ్బ తినడంతో పాటు శక్తి సన్నగిల్లి మానసిక స్థితిలో మార్పు జరిగి బరువు పెరగడంతో పాటు లైంగిక వాంఛ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో కొందరు దుర్ వ్యసనాలకు కూడా పాల్పడి తమ అస్తిత్వాన్ని బాధ్యతలను కోల్పోతే మరింత కష్టమే కదా!
సాధారణంగా ఒత్తిడి కలిగినప్పుడు శరీరము కార్టీ సాల్ అడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది ఈ విడుదలయ్యే హార్మోన్లు నిరంతరం ఒత్తిడి వల్ల మంచికి బదులుగా చెడు చేసే అవకాశం ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
--- సంతానోత్పత్తిలో ప్రధాన భాగమైనటువంటి శుక్రకణాల ఉత్పత్తి, పరిపక్వత,వీర్యంలో కలిసిపోవడానికి సుమారు రెండు మూడు నెలల సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలిక అలసట నిద్రలేమి ఒత్తిడి గనుక ఉన్నట్లయితే శుక్రకణాల ఉత్పత్తిని నేరుగా దెబ్బతీసే ప్రమాదం ఎక్కువ.
--- అధిక ఒత్తిడి స్థాయి వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం, బలహీనపడడం, బలహీనంగా కదలడం, ఆకారం కోల్పోవడం వంటి దుర్లక్షణాలకు దారితీస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఒక పరిశోధన ప్రకారంగా మధ్యస్థాయి ఒత్తిడి ఉన్న వారితో పోలిస్తే అధిక స్థాయి ఒత్తిడి ఉన్న వాళ్ళలో వీర్యకణాల సాంద్రత సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గినట్లు పరిశోధన తేలింది.
ఈ పరిస్థితుల్లో అర్థవంతమైనటువంటి జీవితం గడపడం ద్వారా తనకు తన కుటుంబానికి సమాజానికి గుర్తింపు తీసుకు రావలసినటువంటి సందర్భంలో యువత ఈ రకంగా నిర్వీర్యం కావాల్సిందేనా? పరిష్కారాలు లేవా? కష్టతరంగానైనా ఆచరిస్తే ఫలితాలు లేకపోలేదు కదా!జీవిత భాగస్వామిలో ఈ అవగాహన కల్పించడం ద్వారా పరిస్కారాన్ని మరింత దగ్గరగా చూడవచ్చు. ఒక్కసారి ఆలోచిద్దాం.
ఒత్తిడిని నివారించుకోవడం ద్వారా సంతాన ఉత్పత్తి శక్తిని పెంచుకోవడానికి మార్గాలు
ప్రధానంగా నిద్ర లేకపోవడం, డ్రగ్స్కు అలవాటు పడడం, మద్యం తాగడం, వంటివి ప్రధానంగా ఒత్తిడికి కారణాలు. స్నేహ సంబంధాలు కూడా ఈ ఒత్తిడి శక్తిని మరింత పెంచే ప్రమాదం లేకపోలేదు. కారణాలు విశ్లేషించుకుని అందుబాటులో ఉన్న అంశాలను ఆచరించి జీవితాన్ని ఫ లవంతం చేసుకుందాం.
-- టీవీ కంప్యూటర్ సెల్ఫోన్ వంటి డిజిటల్ వ్యాపకమనేది ప్రధానంగా ఒత్తిడి కలిగించే పెద్ద శక్తులు. వీటి బారిన పడకుండా సాధ్యమైనంత తగ్గించుకోవడమే శరణ్యం.
--- వీర్యకణాల ఉత్పత్తి సంతాన సాఫల్యతకు ప్రధానమైనటువంటి టెస్టోస్టిరాన్ హార్మోన్ను నిద్ర ప్రభావితం చేస్తుంది. ఏడు నుండి తొమ్మిది గంటలు నిద్ర ఉంటే హార్మోన్ ఉత్పత్తికి డోకా ఉండదు.
-- ప్రస్తుత యువత శారీరక వ్యాయామం కంటే ప్రధానంగా ఒకే దగ్గర కూర్చుని టీవీ సెల్ ఫోన్ కంప్యూటర్ కి అలవాటు పడ్డ రోజులివి. అలా కాకుండా క్రమం తప్పని శారీరక శ్రమకు అలవాటు పడితే బరువు తగ్గించుకోవచ్చు. హార్మోన్ల ఉత్పత్తి గణనీయంగా యంగా పెరుగుతుంది. శారీరక శక్తి పటిష్టమవుతుంది. అధిక బరువు వీర్యకణాల ఉత్పత్తిని ప్రేరేపించే అవకాశం ఉంది అందుకే బరువు తగ్గించుకోవడం చాలా అవసరం.
-- నికోటిన్, గంజాయి, ఆల్కహాల్ డ్రగ్స్, వైన్స్ వీర్యకణాలు తగ్గిపోవడానికి బలహీనంగా కదలడానికి అసాధారణ కణ ఆకృతులకు కారణమవుతున్నాయి కనుక వెంటనే రద్దు చేసుకోవాలి. ఒత్తిడి దీర్ఘకాలికంగా గనక కొనసాగినట్లయితే దాని ప్రభావం సంతానోత్పత్తి సమర్థత పైన పడుతుంది. అందువల్ల ఒత్తిడి కారణాలను గుర్తించి అది పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో యువత ముఖ్యంగా భార్యాభర్తలు కుటుంబ సభ్యులు కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒత్తిడి ప్రధానంగా యువకుల పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపినప్పటికీ దానివల్ల జరిగే పరిణామాలు సంబంధాలు స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సంబంధించిన అంశాలుగా చూడవలసి ఉంటుంది. అందుకే యువతి యువకులుగా భార్యాభర్తలు గా కలిసి ఉన్న సందర్భంలో నిరాశ నిస్పృహ ఒత్తిడికి గురైన సందర్భాల్లో ఈ అవగాహన ఉంటే పరస్పరం సహకరించుకోవడానికి, క్రమంగా తగ్గించుకోవడానికి, ఉత్సావంతమైన వాతావరణాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది.అందుకే ఈ లక్షణాలు ఈ ప్రభావాలు వైరుధ్యాలు స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం చాలా ఉన్నది. పురుషుల్లో ఒత్తిడి వల్ల వీర్యశక్తి క్రమంగా నశిస్తుందని చెప్పుకున్నాం మరి స్త్రీలలో ఒత్తిడి కూడా నెగిటివ్ ఆలోచనలకు అయీష్టతకు ఆందోళనకు దారి తీసినప్పుడు కూడా స్త్రీ పురుషులు ఇద్దరి మధ్యన సఖ్యత లేకుంటే అది కూడా అనర్థమే కదా! అంటే ఒత్తిడి పురుషుల్లోనే కాదు స్త్రీలలో కూడా అనర్థ హేతువే. ఆ రకంగా ఈ సమస్యను ఉమ్మడి సమస్యగా ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )