ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నందున  జాగ్రత్తలు పాటించాలి 

Mar 30, 2026 - 17:20
Mar 30, 2026 - 17:23
 0  0
ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నందున  జాగ్రత్తలు పాటించాలి 

జోగులాంబ గద్వాల 30 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో ఎండ తీవ్రతలు 40 డిగ్రీలు ఉన్నందున వడదెబ్బకు గురి కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ సూచించారు.

 సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎండల తీవ్రతపై వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్కరు  వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా మండలాలలోని అన్ని ఎంపీడీవోలు, తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులు అంగన్వాడి చిన్నారులకు వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని, పాఠశాల విద్యార్థులకు ఇప్పటికే సగం రోజు పాఠశాలలను నిర్వహించడం జరుగుతుందన్నారు.  వసతిగృహాలలొ ఉండే విద్యార్థులు ఎండ పూట బయటకు వెళ్లకుండా ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.  

జిల్లా అధికారులు కూడా వడదెబ్బకు గురి కాకుండా టోపీలను వినియోగించాలని, తరచుగా నీరు సేవించాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ కూలీలు కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు నిర్వహించాలని అన్నారు.  వైద్యాధికారులు అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకు ORS ప్యాకెట్ లు పంపిణి చేయాలన్నారు. పక్షులు, పశువులకు కూడా నీటిని అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో  బయటకు వెళ్లకూడదని, ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. తరచుగా తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, లేదా ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్ ప్రజలకు సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవలసిన చర్యలపై ఏప్రిల్ రెండవ తేదీ నుండి నిర్వహించే ప్రజా పాలన  గ్రామ సభలలో  ప్రజలకు అవగాహన కలిగించాలని  అధికారులకు కలెక్టర్ తెలిపారు.

 ఈ సందర్భంగా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ముద్రించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశం ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జిల్లా వైద్యాధికారి సంధ్య కిరణ్మయి, ఆర్డిఓ శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State