ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుందా...?

డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్ట్, హ్యూమనిస్ట్, రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు

Mar 2, 2026 - 22:24
Mar 2, 2026 - 22:28
 0  5
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుందా...?
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుందా...?

స్టాక్ మార్కెట్లు అతలాకుతలం, పెరగనున్న ద్రవ్యోల్బణం, ఇంధనం ధరలు, తగ్గనున్న జిడిపి

భారతీయుల భద్రతకు ప్రభుత్వం చర్యలు

✍️ డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్ట్, హ్యూమనిస్ట్, రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు

ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య మొదలైన యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది. ఇజ్రాయిల్ కు అమెరికా మద్దతు నుంచి యుద్ధరంగంలోకి దిగింది. యుద్ధం మంచిది కాదంటూ రష్యా చైనాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఇంతవరకు యుద్ధం విషయంలో ఏ ప్రకటన చేయలేదు. ఏ చర్యకు ఉపక్రమించలేదు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇజ్రాయిల్ వ్యవహరిస్తుందని ఇరాన్ ఆరోపిస్తుండగా, ఆటంబాంబుల తయారీకి ఇరాన్ ప్రయత్నిస్తున్నందున తామ అడ్డుకుంటున్నామని ఇజ్రాయిల్ పేర్కొంటుంది. ఇంకా దాదాపు నెల రోజులకు పైగా యుద్ధం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంతర్జాతీయ యుద్ధ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఇండియా పై  ప్రభావం చూపనుందా

ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వలన భారతదేశంపై ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశ గల్ఫ్ దేశాల నుంచి 90% దాకా ఇంధన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ వద్దనున్న హార్మోజ్ జల సంధిని కూడా మూసివేస్తే అక్కడ నుంచి ఇంధన నౌకలకు రవాణా సౌకర్యం ఆగిపోవడంతో భారత్ లోని ఇంధన ధరలకు రెక్కలు వస్తాయా అన్న సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర వేగంగా పెరుగుతూ 100 డాలర్లకు చేరుకుంటుంది. యుద్ధ తీవ్రత ఈ విధంగానే కొనసాగితే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 1978 సంవత్సరంలో పెరిగిన మాదిరిగా 200 డాలర్లు లేదా 300 డాలర్లకు అయినా చేరుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితి కనుక వస్తే భారత్లో డీజిల్, పెట్రోల్ రేట్లు ఏ స్థాయిలో పెరుగుతాయో అంచనాలకు అందకుండా ఉంది.వాణిజ్య నౌకల సరఫరాను పునరుద్ధరించకపోతే భారత్ కు తీవ్ర విఘాతం కలుగుతుందని అంచనా వేస్తున్నారు.

భారత్ వద్ద అదనపు చమురు నిల్వలు ఉన్నాయని, 74 రోజులు వరకు సరిపోతాయని అధికారులు చెబుతున్నప్పటికీ అవి ఎంతకాలం సరిపోతాయి అన్న విషయంలో స్పష్టత లేదు. గల్ఫ్ దేశాల నుంచి ప్రతిరోజు 81 మిలియన్ టన్నుల గ్యాలన్ల ఇంధనం ప్రపంచంలోనే అనేక దేశాలకు సరఫరా అవుతుంది. ఇండియాలో రోజు 5.5 మిలియన్ టన్నుల  గ్యాలన్ల ఇంధనం అవసరమవుతుంది. దీంతో డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయని భారతీయుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు సహజవాయువు గ్యాస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఖతార్ దేశం ప్రకటించడంతో గ్యాస్ ధరల పట్ల కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రపంచంలోనే అన్ని దేశాలకు అతిపెద్ద గ్యాస్ సరఫరా గా ఉన్న ఖతార్ దేశం కూడా గ్యాస్ సరఫరాను ఆపివేస్తున్నట్లు ప్రకటించడం పట్ల గ్యాస్ రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

భారతీయుల భద్రతకు చర్యలు

ప్రపంచంలోని వివిధ గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయుల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్పటికే భారత ప్రధాని మోడీ సౌదీ అరేబియా బహ్రెయిన్ దేశాధ్యక్షులతో ఫోన్లో సంభాషించారు. అంతేకాకుండా భారత విదేశాంగ శాఖ వివిధ గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ భారతీయులను అప్రమత్తం చేస్తూనే ఉంది. విదేశాలలోని భారతీయుల సంఘాలు, తెలుగు వారి సంఘాలు, తెలంగాణ సంఘం తదితర సంఘాలన్నీ కూడా వాట్సాప్ ల ద్వారా మెసేజ్లు పంపుకుంటూ సురక్షిత ప్రదేశాలలో ఉండేలా నియమ నిబంధనలు పాటిస్తున్నామని, ఇప్పటివరకు భారతీయుల ఎవరికి కూడా ఇబ్బందులు కలగలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.

 అవసరమైతే ఇబ్బందులు ఉన్న భారతీయులందరినీ కూడా భారత్ కు రప్పించడానికి చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ ప్రకటించింది. భారతీయులు ఉన్న అన్ని దేశాల అధ్యక్షులతో సంప్రదింపులు భారత ప్రభుత్వం జరుపుతూ ఉంది. బంకర్లలో నిద్రిస్తున్నామని ఇజ్రాయిల్ లోని భారతీయులు వెల్లడిస్తున్నారు. గల్ఫ్ దేశాలలోని భారతీయులకు షెల్టర్ విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తడంలేదని గల్ఫ్ దేశాల నుంచి సమాచారం అందుతుంది.


ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం

యుద్ధం అనేది అన్ని రంగాలపై ప్రభావం చూపనుంది. కేవలం ప్రాణ నష్టం ఆస్తుల నష్టమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం వాటిల్ల పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో పెద్దదేశమైన భారత దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కానుంది అనే ఆర్థిక రంగనిపుణులు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుందని, తద్వారా జిడిపి తగ్గుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే సోమవారం స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అయ్యి సెన్సెక్స్ 1040 పాయింట్లు పతనం గాక నిఫ్టీ 400 పాయింట్లతో నష్టాలను చూశాయి. కేవలం డీజిల్, పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరిగితే ఆ ప్రభావం వంటింటి పై కూడా పడనుంది. ఇప్పటికే యూరప్ లో గ్యాస్ రేట్లు పెరిగాయి. ఆటోమేటిక్ గా నిత్యవసరాలు కిరాణా సరుకుల ధరలకు రెక్కలు రానున్నాయి. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

నెమ్మది నెమ్మదిగా వస్త్ర, వ్యాపార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, వాణిజ్య, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగాలపై కూడా యుద్ధం ప్రభావం చూపనుంది. బంగారం, వెండి ధరలపై కూడా యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉంది. మొత్తానికి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా మధ్యప్రాచ్యం లో జరుగుతున్న యుద్ధం వలన భారతకు కష్టాల కాలం వచ్చినట్టు అయింది. ఇరాన్ ఇజ్రాయిల్ సంక్షోభం ఎంత త్వరగా ముగిసిపోతే భారత్ కు అంత క్షేమం అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. 90 శాతం వరకు చమురు ఉత్పత్తులపై గల్ఫ్ దేశాలపై భారతదేశం ఆధారపడి ఉన్నందున రాబోవు భవిష్యత్తు కాలంలో భారతదేశం ఆచితూచి వ్యవహరించాల్సి ఉందని, పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే భారత్ ఆర్థిక వ్యవస్థకు భారీ షాక్ తప్పదని  నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారతదేశ మరింత అప్రమత్తంగా వ్యవహరించి రాబోవు సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, ఎదుర్కొంటుందని మనమూఆశిద్దాం.

భారత దేశంలో మతపరమైన అల్లర్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖలు రాయడం, ప్రజలు కూడా ప్రార్థన లు, సభల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, అల్లర్లకు, తగాదాలకు, ఘర్షణలకు ఎలాంటి ఆస్కారం లేకుండా చూడాలని,  ఇంటలిజెన్స్ విభాగాలు మరింత సమర్థవంతంగా దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు భంగం కలగకుండా చర్యలు ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు కూడా సహకరించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలలో పేర్కొనడం శుభపరిణామం. యుద్ధం వలన ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ వాటన్నిటిని శాంతి, సహనం, ఓపికతో ఎదుర్కొని భారతీయులుగా ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు భంగం కలగకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333