ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటన చేసిన నేటికీ అమలులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా అడ్డుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గత 13 ఏళ్లుగా ఆర్టీసీలోఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదని దీని మూలంగా ఉద్యోగులపై పనిభారం అధికంగా పడుతుందన్నారు. తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు పోవడంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ సభ్యులు మాచర్ల భాస్కర్, ఏకాంబరం, నాయనీ విద్యాసాగర్ పాల్గొన్నారు.