వ్యయం పెరుగుతున్నా విద్యా ప్రమాణాలు  పెరగడం లేదు ఎందుకు

Aug 30, 2024 - 19:02
 0  5

పర్యవేక్షణ కొరవడి బోధనా బోధనేతర సిబ్బంది  తగిన స్థాయిలో  లేకపోవడం కారణమే!  ప్రైవేటీకరణ పై ఉన్న మోజు  ప్రభుత్వ విద్యారంగo పైన పాలకులకు లేక పోతే ఎలా ?   నిరంతరం ప్రయోగ దశలో విద్యారంగాన్ని కొనసాగించడం కూడా  వైపల్యమే  .*

--వడ్డేపల్లి మల్లేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే విద్యారంగం పైన కేటాయిస్తున్న బడ్జెట్ శాతం  క్రమంగా తగ్గడం విద్యా పట్ల పాలకుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం . పాఠశాల విద్యలో ప్రతిఏటా వ్యయం పెరుగుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు  చెబుతున్న  మౌలికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గడం  ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య పెరగడం అనే లోపాన్ని ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించడం లేదు.  రాష్ట్రంలోని మొత్తం సుమారు 60 లక్షల మంది విద్యార్థులు  పాఠశాల విద్యా స్థాయిలో విద్యను అభ్యసిస్తుంటే  ఇటీవల లెక్కల ప్రకారం గా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య  20, 75,579  అని ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తుంటే ప్రభుత్వ వైఫల్యం  ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి పునాది గత పది ఏళ్లలో ఉన్న దని గ్రహిస్తేనే  సవరణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్కు 6% దాటక పోగా  భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అత్యల్ప శాతాన్ని కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ మిగిలిపోవడం  అభ్యంతరకరం . బడ్జెట్  పరిమాణం ఏటా పెరుగుతున్నప్పటికీ , విద్యారంగానికి కేటాయించే నిధుల  శాతం ఏమాత్రం పెరగక పోయినప్పటికీ  బడ్జెట్ మొత్తాన్ని విద్యార్థులకు పంపిణీ చేసినప్పుడు  క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది కనుక  ఒక్కో విద్యార్థి పైన చేసిన ఖర్చు పెరిగినట్లుగా మనకు గణాంకాలు తెలియజేస్తున్నవి. కానీ నిజంగా ఆ పెరుగుదల  గణాంకాలకు మాత్రమే పరిమితం కానీ  విద్యారంగ అభివృద్ధికి,  మౌలిక వసతుల రూపకల్పనకు , ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి,బోధనా,బోధనేతర  సిబ్బందికి  ఏ రకమైన ప్రయోజనం కలిగించడం లేదు అంటే ఆ రంగాలలో ప్రభుత్వ నిధులు  నిండు సున్నా అని చెప్పక తప్పదు.  రాష్ట్రంలోని సుమారు 26 వేల పాఠశాలల్లో  పాఠశాల పరిశుభ్రత మరుగుదొడ్లు టాయిలెట్స్  ఇతర పనుల నిమిత్తం  పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను బట్టి  3000 నుండి 20వేల వరకు ప్రతినెల  ఇవ్వడానికి  అమ్మ మహిళా కమిటీల  ద్వారా ఖర్చు చేయడానికి నిర్ణయం తీసుకోవడం  కొంతవరకు సమంజసమే అయినా అవి ఏ మూలకు సరిపోవు. పనిచేయడానికి ఎవరు కూడా సిద్ధపడరు ఎందుకంటే ఈ రంగంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను నియమించకపోవడం ప్రభుత్వం యొక్క పెద్ద వైఫల్యం  .
   ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యారంగ పరిస్థితి పైన ఉపాధ్యాయ విద్యార్థి సామాజిక  ప్రజా సంఘాలు  చేసిన విమర్శ ప్రకారంగా ఒకే యాజమాన్యంలో విద్య ఉండాలని, అప్పుడు మాత్రమే సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుందని , భిన్నమైన పరిస్థితులు ఉన్న కారణంగా సమాన భావన  సమ అభివృద్ధి సాధ్యం కావడం లేదని ఫలితంగా  నాణ్యతా ప్రమాణాలు దెబ్బతిన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు . గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  కులాల వారిగా రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి  విద్యా వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టిన విషయాన్ని మనం గమనించాలి.  ప్రస్తుతము ప్రభుత్వ ,స్థానిక సంస్థలు ,కేజీబీవీ, ఆదర్శ, గురుకుల,నవోదయ,కేంద్ర్పాఠశాలలు  వంటి పేర్లతో ఇన్ని యాజమాన్యాలలో విద్య కొనసాగినప్పుడు  పర్యవేక్షణ అనేది ఒకే రకంగా ఉండకపోగా  విధానాలు సిద్ధాంతాలు పాలనాపరమైన నిర్వహణ కూడా భిన్నంగా ఉండడం కూడా ఫలితాలు గొప్పగా లేకపోవడానికి ప్రధాన కారణం.
  రాష్ట్రంలోని సుమారు 26,826 పాఠశాలల్లో  1, 13,4 o3మంచి ఉపాధ్యాయులు పనిచేస్తుంటే ఇప్పటికీ  డ్రాయింగ్ క్రాఫ్ట్  పిఈ టి పండిట్లు ఇతరత్రా అనేక పోస్టులు కూడా ఖాళీగా ఉండడం,  భాషకు సంబంధించి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను  నియమించకపోవడం , సింగల్ టీచర్ పాఠశాలల్లో బోధన ఇబ్బందికరంగా మారడం,  ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన నిర్వహణతో పాటు అనేక ఇతర బాధ్యతలు అప్పగించడం,   పాఠశాల నిర్వహణ పైన  పర్యవేక్షణ లేకపోవడం వంటి అనేక సమస్యలతో విద్యా వ్యవస్థ  కొట్టుమిట్టాడుతుంటే నిధులను కేటాయించితె ప్రయోజనం ఎక్కడిది,? మౌలికమైనటువంటి విద్యార్థుల సంఖ్యను పెంచుకోకుండా  అభివృద్ధి సాధ్యం కాదు.  అదే ఢిల్లీ  ప్రభుత్వం తీసుకున్న విద్యారంగ సంస్కరణల కారణంగా  ప్రభుత్వ పాఠశాలల లోకి ప్రైవేటు పాఠశాలల నుండి అధికారుల యొక్క పిల్లలు వలస రావడాన్నీ గమనిస్తే  మనం మన రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు ఎంత అసమాగ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  ఇప్పటికీ  మూత్రశాలలు మరుగుదొడ్లు లేనటువంటి పాఠశాలలు అనేకంగా ఉండడం  వాటి నిర్వహణకు నిధులు లేకపోవడం  వంటి కారణాలు కూడా పిల్లలు పాఠశాలకు రెగ్యులర్గా లేదా ఆడపిల్లలు రాకపోవడానికి ప్రధాన కారణమని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి . అంతేకాదు భారత సర్వోన్నత న్యాయస్థానం అనేకమార్లు రాష్ట్ర ప్రభుత్వాలను మందలించినా కూడా మూత్రశాలలు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించకపోవడం నిర్వహించకపోవడం విడ్డూరమే కదా !
  లోపించిన    విద్యా పర్యవేక్షణ  **
********
తెలంగాణ రాష్ట్రంలోని 602 మండలాలకు కేవలం 17 మంది మాత్రమే రెగ్యులర్ మండల విద్యాధికారులు ఉన్నారంటే  585 మండలాలకు విద్యాధికారులే లేకపోవడంతో  విద్య పర్యవేక్షణ ఎంత  దిగజారి పోతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అనేక జిల్లాలకు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా లేనట్లుగా మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి.  ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను  మండలాలకు విద్యాధికారులుగా నియమిస్తూ ఒక్కొక్కరికి రెండు నుండి
పది మండలాల బాధ్యత అప్పగిస్తే  ఆ ప్రధానోపాధ్యాయిని పాఠశాల  అంధకారంలోకి నెట్టబడినట్లే కదా ,,! రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు అభ్యసన సామర్ధ్యాలు 2018 లో పోల్చినప్పుడు దారుణంగా పడిపోయినాయని అసర్ సర్వే 2022లో వెల్లడించడం పాలకుల యొక్క వైఫల్యానికి నిదర్శనం .  ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి  ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చూస్తూ అన్ని మండలాలకు విద్యాధికారులను నియమిస్తూ  పర్యవేక్షణ నీ రంతరము కొనసాగించినట్లయితే  స్నేహపూరిత వాతావరణంలో  విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంటుంది .
     దిగజారుతున్న విద్యార్థుల సంఖ్య
*******
  2015- 16 లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 24.12 లక్షలు  ఆనాడు ఒక్కో విద్యార్థి పైన చేసిన సగటు ఖర్చు 33,059  రూపాయలు  2022 23 విద్యా సంవత్సరంలో 23.78 లక్షల మంది పిల్లలు ఉంటే  ఒక్కో విద్యార్థిపై చేసిన ఖర్చు సగటున 65,555 రూపాయలు  కాగా 2024- 25 బడ్జెట్లో  17,942 కోట్లు కేటాయిస్తే విద్యార్థుల సంఖ్య  సుమారు 20 లక్షల 75 వేలకు పడిపోవడo గమనించినప్పుడు  సగటున ఒక విద్యార్థిపై చేస్తున్న ఖర్చు 95,690 రూపాయలు  అని కాగితాల మీద రాసుకున్నప్పటికీ  విద్యార్థుల సంఖ్య  దయనీయస్థితిలో పడిపోవడాన్ని మాత్రం గమనించకపోవడం శోచనీయం . విద్యార్థుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేయకుండా  నిధులు కేటాయించినట్లు చూపినప్పటికీ  అనేక మౌలిక లోపాల కారణంగా అనుకున్న ఫలితాలను సాధించలేకపోవడం,  భిన్న యాజమాన్యాలలో పాఠశాలలు కొనసాగడం  సమగ్రమైన విద్యా వ్యవస్థను నిర్వహించలేకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
            40 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతుంటే  అట్టడుగు పేద వర్గాలకు చెందినటువంటి కేవలం 20 లక్షల మంది మాత్రమే  ప్రభుత్వ రంగంలో విద్యను అభ్యసిస్తుంటే  పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల పైన శ్రద్ధ ఉండేది   అసంభవమే  అందుకే కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని,  విద్య ఒకే యాజమాన్యంలో ఉండాలని , విలువలతో కూడినటువంటి విద్య ప్రణాళికను అమలు చేయాలని  కొఠారి తో సహా అనేక కమిషన్లు  హెచ్చరించినప్పటికీ భారతదేశంలో కనీసం గా కూడా ఏ ఒక్క రాష్ట్రంలో ఆ సూచనలు పాటించకపోవడం  సమాజాన్ని ధిక్కరించడమే అవుతుంది.  అంతేకాదు పాలకులు మారినాకొద్ది విద్యా వ్యవస్థలు  ప్రయోగ దశలోనే అనేక  పథకాలను ప్రవేశపెట్టి  సమగ్రమైన విధానాన్ని అవలంభించకపోవడం వలన  కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం అవుతున్నది.  పాలకులే ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించడం  ,ప్రభుత్వ రంగం పైన బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం , బోధన బోధనేతర సిబ్బంది నియామకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం  వంటి లోపాలను ఇప్పటికైనా సవరించుకోకుంటే  ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత దిగజారే ప్రమాదం  లేకపోలేదు. దానికి పూర్తిగా   తెలంగాణ ఏర్పడిన నుండి నేటి వరకు పాలించిన పాలకులే బాధ్యత వహించవలసి ఉంటుంది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333