వినడానికి చదవడానికి కూడా బద్ధకమే అయితే  ఈ సమాజాన్ని ఏం ఉద్ధరిస్తావు

Mar 2, 2024 - 16:31
Apr 15, 2024 - 17:48
 0  7
వినడానికి చదవడానికి కూడా బద్ధకమే అయితే  ఈ సమాజాన్ని ఏం ఉద్ధరిస్తావు

అచేతనంగా మొక్కుబడిగా జీవిస్తే  వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఎలా సాధ్యం ?

మరింత మెరుగైన సమాజమే అంతిమ లక్ష్యం అయినప్పుడు  సామాజిక బాధ్యతను విస్మరిస్తే  మనకు బ్రతికే అర్హత లేదు.సోయి తెచ్చుకుంటే మంచిది.

ఈ వ్యవస్థలో మార్పుల కోసం  విభిన్న రంగాలలో  అనేకమంది తమ శక్తి వంచన లేకుండా కృషిచేసి అసువులు బాసిన విషయాలను మనం చరిత్రలోకి వెళితే గమనించవచ్చు  .వాళ్లు ఏం ఆశించి ఆ పని చేశారో ఒక్కసారి చెప్పగలరా  ?బాధ్యత విస్మరించి  సామాజిక చింతనకు దూరంగా  స్వార్థ చింతనతో  జీవించే అర్హత మనకు లేదు అని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి.  ఇక అంతే కాదు  విద్యావంతులై  ఉండి కూడా  కనీస బాధ్యత నిర్వహించని  లక్షలాది మంది  తమ కోసమే బ్రతుకుతున్న వారిని గమనిస్తే  నిరక్షరాస్యు లకు వీరికి తేడా ఏమిటో    సమీక్షించుకోవాలి .

 అక్షరాస్యు లై అంతకుమించి విద్యావంతులై  ఉండి కూడా  ఉత్తమ సాహిత్యాన్ని  గ్రంథాలను  చదవడానికి, పరిశీలనాత్మక అధ్యయనం చేయడానికి  ఏ మాత్రం ఇష్టపడకుండా కాలయాపన చేస్తున్న వారిని కోట్లాదిమందిని గమనించవచ్చు.  అంతేకాదు  ప్రసంగాలు యూట్యూబ్ ఛానల్ లో  వక్తల ఉపన్యాసాలను  వినడానికి  కూడా  బద్ధకం ఆవరించిన వారిని గమనిస్తే  విచారకరం.  ప్రకృతి పరిశీలన ద్వారా  ప్రసంగాలను వినడం ద్వారా  సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా  ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది . తద్వారా సముపార్జించిన జ్ఞానంతో  తమ తమ బాధ్యతలు కర్తవ్యాలను నిర్వహించడానికి,  అచేతను లైన వారిని చైతన్యం చేయడానికి,  సమయోచితంగా  వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది.  హక్కులకై పోరాడాలన్న బాధ్యతలకు నిలబడాలన్న  మనిషి  పదునైన జ్ఞానాన్ని  అలవరచుకొని పరిశీలన శక్తిని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే  మనిషి సంఘజీవి అనే మాటకు అర్థం ఉంటుంది . తమ ప్రతిభతో, పరిశీలనా శక్తితో , అనేకమంది బుద్ధి జీవులు  సృజనాత్మక శక్తితో  విస్తృతమైన జ్ఞాన సంపదనకు మనకు అందించినారు . వివిధ రూపాలలో నిక్షిప్తం చేయబడిన  అపార జ్ఞాన నిలువలను  సమయస్ఫూర్తిగా ఆకలింపు చేసుకొని  తిరిగి ఈ సమాజానికే వెచ్చించవలసిన బాధ్యత  ప్రతి వ్యక్తి,ముఖ్యంగా విద్యావంతులైన  ఉన్నది.  చదువు లేని వాళ్ళు  భాషా పరిజ్ఞానం అంతగా లేని వాళ్ళు  ఈ విషయంలో కొంత వెనుకబడితే అర్థం ఉంది కానీ  పట్టాలు పుచ్చుకొని,  సంవత్సరాల తరబడి చదువులు చదివి,  లక్షలాది రూపాయలు వెచ్చించి  విద్యావంతులమని చెప్పుకునే వాళ్లు కూడా  చదవడానికి వినడానికి బద్దకిస్తే  ఇక వ్యవస్థ ఎలా మారుతుంది ?అలా అయితే దుర్మార్గుల చె ర నుండి ఈ వ్యవస్థను  విద్యావంతులు కాక రక్షించేది మరెవ్వరు?   పేదలు  శ్రామికులు కాయ కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళు చిరు వ్యాపారులు శ్రమ జీవన సౌందర్య ఆరాధకులు  నిరంతరం ఏదో ఒక రూపంలో  ఉత్పత్తిలో భాగస్వాములై  మనకు అన్నం పెట్టి ఆదుకుంటున్నారు.  ఆలోచనలో పాలుపంచుకుంటున్నారు.  చదవలేక పోవచ్చు సాంకేతిక విషయాలను విన్నా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ  చదువుకున్న వాళ్ళ కంటే గొప్పగా స్పందించే  గుణం ఇప్పటికీ ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు.  ఏది ఏమైనా ఈ వ్యవస్థకు వచ్చిన చి క్కు విద్యావంతులతోనే . ఒక దీపంతో   అనేక దీపాలను వెలిగించి  వెలుతురును అందించినట్లు  విద్యావంతులు జ్ఞానాన్ని  ప్రకృతిలో దాగిన రహస్యాన్ని  చర్చ నీ అంశాలను విస్తృతం చేయడం ద్వారా  అలుముకున్న అజ్ఞానాన్ని తరిమికొట్టి విజ్ఞాన వీచికలు  విస్తరింప చేయడానికి  ఎంతో అవకాశం ఉన్నది .   స్వార్థ చింతనతో  సేకరించడానికి విస్తృత పరచడానికి ఇష్టపడని వాళ్లంతా  ఈ వ్యవస్థకు ద్రోహం చేసిన వాళ్లు గానే భావించాలి. వారికి బ్రతికే హక్కు ఎక్కడిది అని  సమాజం నిలదీసే రోజు  దగ్గరలోనే ఉన్నది. ఎందుకంటే  ప్రజల చెమట ద్వారా  లభించే ఉత్పత్తుల నుండే విద్యావంతులు ఉద్యోగులు  పురుడుపోసుకున్నారని తెలుసుకుంటే మంచిది.
        మొక్కుబడిగా జీవిస్తే  విప్లవాత్మక మార్పులు ఎలా సాధ్యం?

  అరిస్టాటిల్ మేరకు,  ప్రతి వ్యక్తి సంఘజీవియే కనక  సంఘ కట్టుబాట్లకు  సామాజిక బాధ్యతకు  కట్టుబడి ఉండవలసి ఉంటుంది.  అలాంటప్పుడు  అప్రకటిత సంఘ నియమావళి  మేరకు చైతన్యంగా సామాజిక బాధ్యతగా సమాజంలో  జరుగుతున్న ప్రతి సంఘటనకు  స్పందించవలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా తను సంపాదించిన జ్ఞానాన్ని  తన పరిశీలన ఆలోచన శక్తిని కూడా సమాజ ఉద్ధరణ కోసం  ప్రతి వ్యక్తి దారపోయాలి . ఈ రకమైన కృషి సేవ  ఏదో కొద్ది మందికి మాత్రమే పరిమితం అని,  తమకు ఏమి సంబంధం లేదని,  అలాంటి మహానుభావులు కొద్ది మందే ఉంటారని అనుకోవడం ఆనవాయితీగా మారిపోయింది . ఈ భావనతోనే అనేకమంది తమ  చైతన్యాన్ని  నిర్వీర్యం చేస్తూ  తమకేమీ సంబంధం లేనట్లు ఆలోచించడం వల్లనే  ఈ వ్యవస్థ  రోజురోజుకు నీరుగారి పోతుంటే  చరిత్రలో గొప్ప వాళ్ళ పేర్లను మాత్రమే తలుచుకొని  మనము వాళ్ల వారసులమంటే అంగీకరించేది ఎలా?   అడపాదడపా ఆటుపోట్లూ సంభవించినప్పుడు పరిష్కరించడానికి  చట్టం, న్యాయం, రాజ్యాంగం , పాలకులు, బుద్ధి జీవులు,  మేధావులు ఉండనే ఉన్నారు.   కుటుంబ సభ్యులు ఒక కుటుంబాన్ని  ఏ రకంగా రక్షించుకుంటారో  ఒక దేశంలోని ఒక ప్రాంతంలోని ప్రజలు  భిన్న వర్గాలకు చెందిన నిపుణులు  మేధావులు విద్యావంతులు జ్ఞానవంతులు, పాలకులు  చట్టం పరిధిలో పనిచేసే యంత్రాంగం  కూడా అదే రకమైన పాత్రను పోషించవలసిన అవసరం ఉన్నది . ఆ సందర్భంలో భిన్న రంగాలకు చెందిన వాళ్లు మరింత బాధ్యతాయుతంగా సేవా దృక్పథంతో పనిచేయడం ద్వారా  ఈ వ్యవస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఆ స్పృహ, సోయి  సామాజిక చింతన  ప్రజల్లో పౌర సమాజంలో అలవాడాలన్నదే  మనందరి ఆకాంక్ష. 
        మెరుగైన సమాజం మన అంతిమ లక్ష్యమైనప్పుడు  సామాజిక బాధ్యత విస్మరిస్తే ఎలా  ?

ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే అభిప్రాయం తోని పనిచేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది.   అభివృద్ధికి ఆటంకం కలిగించినా,  సామాజిక చింతనకు వ్యతిరేకంగా  ఒకరినొకరు దూషించుకున్నా , ఒకరి మంచితనాన్ని మరొకరు ప్రోత్సహించకపోయినా  ఆ కుటుంబం వీధిపాలవుతుంది . అదే పద్ధతిలో  దేశాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు  భిన్న మనస్తత్వాలు ఉంటే ఉండవచ్చు  కానీ భిన్నత్వంలో ఏకత్వమే  భారతదేశ జీవన  నినాదంగా  ప్రకటించబడిన నేపథ్యంలో  అంతిమ లక్ష్యం దేశాభివృద్ధి,  సుస్థిరత, మరింత మెరుగైన సమాజాన్ని చేరుకోవడమే  అని అందరం గుర్తించాలి.  పాలకులు, పెట్టుబడిదారులు,  కొంతమంది సంపన్న వర్గాలు, భూస్వాములు  తమ వర్గ ప్రయోజనం కోసం మాత్రమే పనిచేసే వాళ్లు లేకపోలేదు . అదే సందర్భంలో  ఈ దేశ సంపద ప్రజలందరి సొత్తు అని నినదించి  పాలకులను పెట్టుబడిదారులను ఆలోచింపజేసి  గుర్తింప చేయడానికి అనేక పోరాటాలు చరిత్రలో కొనసాగినాయి .ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఉద్యమాలు  ప్రజా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి . ఈ సామాజిక వాస్తవాన్ని  గుర్తించి  ఎవరైనా  సామాన్యుని మేలునే ఆశిస్తున్నారు కనుక  పౌరసమాజం బుద్ధి జీవులు మేధావులు సామాజికవేత్తల కు అండగా నిలబడ్డప్పుడు  ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టడానికి మరింత ఆస్కారం ఉంటుంది. " తన కడుపు నిండితే దేశంలో దరిద్రమే లేనట్లు,  తన ఇంటిలోని అందరికీ  ఉద్యోగాలు ఉంటే దేశంలో నిరుద్యోగమే లేనట్లు భావించే  స్వార్థపరులు  బుద్ధిహీనులు  సంఘద్రోహులు ఈ వ్యవస్థలో ఉన్నంతకాలం  మెరుగైన సమాజాన్ని చేరుకోవడానికి  మరిన్ని ఆటంకాలను అధిగమించవలసి వస్తుంది."  .సమానత్వం, స్వేచ్ఛ, సాంఘిక న్యాయం,  పేదరిక నిర్మూలన,  ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు , అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వంచన లేనటువంటి  మెరుగైన వ్యవస్థ కోసం   కొనసాగుతున్న పోరాటంలో  మనం భాగస్వాములo కావడం ద్వారా  మన బాధ్యతలను మరింత  గుర్తించి  దీర్ఘకాలికంగానైనా ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం  ప్రధానం . "  వ్యక్తిగా జీవిస్తూనే వ్యవస్థ కోసం పని చేద్దాం" అనే నినాదాన్నీ  విశ్వవ్యాప్తం చేద్దాం  యువత  నవతరం  సబ్బండ వర్గాలు  మానవతా  విలువల పునాదిగా  పనిచేసి  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే  కొత్త వ్యవస్థకు అంకురార్పణ చేసుకుందాం.  అక్కడ అసమానతలు అంతరాలు  అసలే ఉండవు  సంపన్నులు    పీడించే వాళ్లకు స్థానం ఉండదు.  ఆ సోయి స్పృహ గనక మనకు లేకుంటే  మనిషిగా  బ్రతికే హక్కు లేదని  తెలుసుకుంటే మరీ మంచిది.

---  వడ్డేపల్లి మల్లేశం.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు  హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333