విద్యాశాఖ అధికారులు పాఠశాలలను పర్యవేక్షించాలి
ఉపాధ్యాయుల పనితీరు మెరుగు పడకుంటే కఠిన చర్యలు తప్పవు.
విద్యార్థుల నమోదు పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతిరేది : గద్వాల. జిల్లా మండల స్థాయి విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను తరచు సందర్శిస్తూ అక్కడి కార్యకలాపాలు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై గురువారం కలెక్టర్ తన చాంబర్ నుంచి అన్ని మండలాల ఎంఈఓ లు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, తదితరులతో వెబ్ ఎక్స్ మీట్ ద్వారా సమీక్షించారు. పదేపదే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్, ఏఎక్స్‌ఎల్ ఆన్‌బోర్డింగ్, విద్యార్థుల నమోదు, డ్రాప్‌బాక్స్ పెండింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలోని 87 ఎఫ్‌ఎల్‌ఎన్ కాంపొనెంట్ పాఠశాలల్లో విద్యార్థుల వారీగా అభ్యసన ఫలితాలను నమోదు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన బేస్‌లైన్ అసెస్‌మెంట్ ఫలితాలను సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయ సమావేశాల్లో చర్చించి, వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఏ సబ్జెక్టులో, ఏ సామర్థ్యంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించి, మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అవసరమైన వారికి రెమిడియల్, అదనపు తరగతులు నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు.
జిల్లాలో విద్యార్థుల నమోదు ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ పేర్కొన్నారు. సుమారు 6 వేల మంది విద్యార్థులను ఇంకా పాఠశాలల్లో చేర్పించాల్సి ఉందని తెలిపారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కొత్తగా విద్యార్థుల నమోదును పెంచాలని ఆదేశించారు. ఎంఈఓలు, సీహెచ్‌ఎంల పాఠశాల సందర్శనలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ తక్కువగా ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి మండలంలో పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించి, విద్యార్థుల అభ్యసన స్థాయి, ఎఫ్‌ఎల్‌ఎన్ నమోదు, హాజరు, తదితర అంశాలను పరిశీలించాలని సూచించారు. ఉపాధ్యాయుడి పేరు, హోదా, బోధిస్తున్న సబ్జెక్టు, విద్యార్హతలు, బీఈడీ, డీఈడీ వంటి వృత్తిపరమైన అర్హతలు, అదనపు డిగ్రీలు, ప్రత్యేక శిక్షణలు, ఇతర నైపుణ్యాల వివరాలను సేకరించాలని తెలిపారు. పాఠశాల వారీగా ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య, గూగుల్ ఫారంలో నమోదైన వివరాల సంఖ్య సరిపోలేలా చూసి ఏ ఒక్క ఉపాధ్యాయుడి వివరాలు మిస్ కాకుండా డేటాను సిద్ధం చేయాలని ఆదేశించారు. పూర్తయిన యూనిఫాంలను ఆగస్టు 31లోగా విద్యార్థులందరికీ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన వాటికి అవసరమైన చర్యలు తీసుకుని పంపిణీని పూర్తి చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల పనితీరు రాబోయే రోజుల్లో గణనీయంగా మెరుగుపడాలని, లేదంటే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఈవో విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారులు ప్రసాద్, మైఖేల్, కర్రెప్ప, ఎంఈఓ లు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పిలు, తదితరులు పాల్గొన్నారు.