విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి

Jun 21, 2026 - 17:57
 0  0
విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

 జోగులాంబ గద్వాల 21 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :   రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో విత్తన మేళాలను నిర్వహిస్తున్నందున అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రెండు రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలలో సంబంధిత విత్తన ఆధీకృత డీలర్లు వివిధ రకాల విత్తనాలను విక్రయించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వము బిపిటి 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటి సోనా, జైశ్రీరామ్, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715, డబ్ల్యూజిఎల్ 44 రకాల వరి విత్తనాలకు మాత్రమే బోనస్ చెల్లించడం జరుగుతుందని, రైతులు ఈ రకాలను మాత్రమే కొనుగోలు చేసేందుకు మేళాలో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. వీటితోపాటు కందులు, మినుములు, పెసర్లు, నువ్వులు, పత్తి, మిరప, వివిధ రకాల కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీలను సరసమైన ధరలకే విక్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్నదాతలకు తమ పరిధిలోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడమే ఈ మేళాల ప్రధాన ఉద్దేశమన్నారు. మేళాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తారన్నారు. ఈ మేళాలలో ఆయా గ్రామాల సర్పంచులు, అభ్యుదయ రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామాల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని, రైతులకు సహకరించి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333