రోడ్డుపై చేసే ఒక్క తప్పు… ఒక కుటుంబంలో ఎప్పటికీ నిండని ఖాళీని సృష్టిస్తుంది

Apr 13, 2026 - 19:36
 0  1
రోడ్డుపై చేసే ఒక్క తప్పు… ఒక కుటుంబంలో ఎప్పటికీ నిండని ఖాళీని సృష్టిస్తుంది
రోడ్డుపై చేసే ఒక్క తప్పు… ఒక కుటుంబంలో ఎప్పటికీ నిండని ఖాళీని సృష్టిస్తుంది

➤Speed thrills కాదు… kills! – ఒక క్షణం వేగం… జీవితాంతం శోకాన్ని మిగులుస్తుంది. 

➤ బాధ్యతగా డ్రైవ్ చేస్తేనే బతుకు సురక్షితం – గద్వాల్‌లో అధికారుల పిలుపు

జోగులాంబ గద్వాల 13 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : పట్టణంలోని అనంత ఫంక్షన్ హాల్‌లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమం సాధారణ సమావేశం కాకుండా, ప్రతి పౌరుడి మనసును కదిలించిన చైతన్య యజ్ఞంగా నిలిచింది.  పోలీసుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు తో పాటు జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్  ముఖ్య అతిథిగా హాజరుకావడం జరిగింది. 

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ తరపున రోడ్ సేఫ్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  ప్రతి గ్రామంలో కూడా రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.  రోడ్డు భద్రతను కేవలం ఒక నియమాల వ్యవస్థగా కాకుండా ప్రాణ రక్షణ వ్యవస్థగా నిర్వచిస్తూ, “గోల్డెన్ అవర్” ప్రాముఖ్యతను అత్యంత బలంగా ప్రస్తావించారు. ప్రమాదం జరిగిన తొలి గంటలో బాధితుడిని ఆసుపత్రికి తరలించడం అంటే ఒక ప్రాణాన్ని తిరిగి ఇవ్వడమేనని, కానీ అదే సమయంలో నిర్లక్ష్యంగా వీడియోలు తీస్తూ కాలక్షేపం చేయడం అనేది మానవత్వానికి విరుద్ధమని కఠినంగా వ్యాఖ్యానించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రి తీసుకెళ్లే పౌరులకు ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. జతగాత్రులకు నగదు రహిత చికిత్స నిమిత్తం 1.5 లక్షల ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమాలు—హెల్మెట్, సీట్ బెల్ట్, సరైన మార్గంలో ప్రయాణం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం—ఇవి చట్టాలు మాత్రమే కాదు, కుటుంబాలను కాపాడే కవచాలని ఆయన స్పష్టం చేశారు. “మీరు స్నేహితులకు బంధువుల బర్త్డే పార్టీలకు  హెల్మెట్ గిఫ్ట్ ఇస్తే… మీరు ఒక ప్రాణాన్ని కాపాడినట్టే” అన్న సందేశంతో సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరి ముందుంచారు.

 జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు తన ప్రసంగాన్ని మరింత గట్టిగా మలుస్తూ, “రోడ్డు ప్రమాదం అనేది యాదృచ్ఛికం కాదు… అది నిర్లక్ష్యానికి ఫలితం” అని స్పష్టం చేశారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ రోడ్డుపై ఉండాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రమాదం ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు. కేవలం మీ భద్రత మాత్రమే కాదు, మీ వల్ల ఇంకొకరి ప్రాణం ప్రమాదంలో పడకూడదన్న బాధ్యతతో డ్రైవ్ చేయాలని పిలుపునిచ్చారు. డిఫెన్సివ్ డ్రైవింగ్, పూర్తి అవగాహన, నియమాల కచ్చితమైన పాటింపు—ఇవే ప్రమాదాల నివారణకు మార్గమని ఆయన వివరించారు. “మీరు క్షేమంగా చేరుకోవడం గొప్ప కాదు… మీతో పాటు అందరూ క్షేమంగా ఉండేలా చూడడం గొప్ప” అనే సందేశం సభలో గంభీరంగా మార్మోగింది.

గద్వాల్ ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రతలో ప్రతి అంశం సమన్వయంతో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం మరియు మెయింటెనెన్స్ మెరుగ్గా ఉంటే ప్రమాదాల అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని, అదే సమయంలో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం కూడా అత్యంత ముఖ్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజలు సురక్షితమైన ప్రయాణ మార్గాలను ఎంచుకునే అవకాశం కలుగుతుందని, ముఖ్యంగా ఆర్టీసీ సేవలను వినియోగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేస్తూ, రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకుంటే మన ప్రాంతంలో ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి ప్రజలు పోలీస్ శాఖ సూచనలను తప్పకుండా పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరగా, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333