మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా సంక్షేమ అధికారి  డి. సునంద

Jul 29, 2026 - 22:19
 0  2
మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా సంక్షేమ అధికారి  డి. సునంద
మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా సంక్షేమ అధికారి  డి. సునంద

 జోగులాంబ గద్వాల 29 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవం July-30  సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేజీబీవీ అలంపూర్లో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి డి. సునంద  మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్రమైన ముప్పని పేర్కొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, తప్పుడు ఉద్యోగాలు, వివాహాలు, విద్య పేరుతో ఇచ్చే తప్పుడు హామీలను ఆసరాగా చేసుకుని మహిళలు, బాలికలు, చిన్నారులను అక్రమ రవాణాకు గురిచేస్తున్నారని తెలిపారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మరాదని, ఉద్యోగం, విద్య లేదా ఇతర అవకాశాల పేరుతో ఎక్కడికైనా వెళ్లే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసు శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ లేదా చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా పోక్సో (POCSO) చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, మిషన్ వాత్సల్య, సఖి వన్ స్టాప్ సెంటర్, భరోసా కేంద్రం, చైల్డ్ హెల్ప్‌లైన్–1098, అలాగే మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న రక్షణ, సంరక్షణ మరియు పునరావాస సేవల గురించి విద్యార్థినులకు సమగ్రంగా వివరించారు. సురక్షితమైన జీవనం కోసం స్వీయ రక్షణ, అప్రమత్తత, విద్య యొక్క ప్రాముఖ్యత మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనుమానాస్పద సంఘటనలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, సమాజంలో అవగాహన కల్పించడంలో విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని జిల్లా సంక్షేమ అధికారి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీపీఓ శ్రీ నరసింహ, ఎస్‌ఐ శ్రీ రామకృష్ణ, ఎక్సైజ్ ఎస్‌ఐ  మమత, డీహెచ్‌ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ శ్రీమతి సరోజ, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి అరుణ, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ శ్రీ శివలీల, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి స్వప్న, ఉపాధ్యాయులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, ఇతర అధికారులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333