మల్దకల్ తిమ్మప్ప స్వామి జాతర — బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ

Dec 4, 2025 - 20:52
 0  1
మల్దకల్ తిమ్మప్ప స్వామి జాతర — బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ
మల్దకల్ తిమ్మప్ప స్వామి జాతర — బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ

 జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్ ఆదిశిల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మల్దకల్ (పూర్వంలో మొదల్‌కల్‌గా పిలువబడేది)లో జరగనున్న శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప స్వామి) జాతర సందర్భంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని అంచనా నేపథ్యంలో, జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు స్వయంగా జాతర స్థలాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అయోమయం లేకుండా భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా పటిష్టమైన బందోబస్తు అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

పార్కింగ్ ఏర్పాటు విషయంలో అయిజ వైపు నుంచి వచ్చే వాహనాలకు కేజీవీబీ పాఠశాల పక్కన, గద్వాల్ వైపు నుంచి వచ్చే వాహనాలకు పీఎచ్‌సీ సెంటర్ వద్ద, ఎలుకూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ట్రినిటీ స్కూల్ వద్ద, మద్దెలబండ నుంచి వచ్చే వాహనాలకు మల్లకల్ ఎంట్రెన్స్ వద్ద — మొత్తం నాలుగు దిశల్లో నాలుగు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.

దేవాలయానికి వెళ్లే మార్గాలు, క్యూ లైన్ బారికేడ్లు, ఎంట్రీ–ఎగ్జిట్ ద్వారాలు, ప్రముఖుల ప్రవేశ మార్గాలు వంటి అంశాల్లో సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరమైన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.

ఐదు రోజుల పాటు రెండు షిఫ్టులుగా భారీ బందోబస్తు మోహరించిన నేపథ్యంలో ప్రతి పోలీసు సిబ్బంది తాము కేటాయించిన ప్రదేశాల్లో పూర్తిగా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే రథోత్సవం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే, ఆకతాయిలను అణచివేసేందుకు షీ టీమ్‌లను మఫ్టీలో ఫుట్ పెట్రోలింగ్‌లో ఉంచాలని, అలాగే పిక్ ప్యాకెటర్లు వంటి నేరస్తుల పట్ల సీసీఎస్ టీమ్‌లు కూడా మఫ్టీలో అలర్ట్‌గా మోహరించాల్సిందిగా సూచించారు.

భక్తులకు తాగునీరు, దారి చూపే సూచికలు, అత్యవసర సేవలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.
“ప్రతి భక్తుడు ప్రశాంతంగా, భద్రతతో స్వామి వారిని దర్శించుకోవడానికి సమగ్ర ప్రణాళికతో కట్టుదిట్టమైన బందోబస్తు అమలు చేస్తున్నాము” అని తెలిపారు. అనంతరం స్వామి వారిని జిల్లా  ఎస్పీ దర్శించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గద్వాల్ డీఎస్పీ వై. మొగిలయ్య, గద్వాల్ సీఐ టంగుటూరి శ్రీను, శాంతినగర్ సీఐ టాటా బాబు, మల్దకల్ ఎస్సై నందికర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333