మతం కోమాలో ఉన్న మనిషి

కోమా అంటే వైద్య పరిభాషలో వైద్యపరమైన అత్యవసరస్థితి . దీనికి తలకు గాయం, స్ట్రోక్, మెదడు కణితి లేదా మాదకద్రవ్యాల లేదా మద్యం మత్తు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. మధుమేహం లేదా ఇన్ఫెక్షన్ వంటి అంతర్లీన అనారోగ్యం వల్ల కూడా కోమా సంభవించవచ్చు. కోమా అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. హైపోగ్లైసీమియా లేదా హైపర్‌క్యాప్నియా మొదట్లో తేలికపాటి ఆందోళన మరియు గందరగోళానికి కారణమవుతాయి, కానీ మొద్దుబారడం మరియు చివరికి పూర్తి అపస్మారక స్థితికి చేరుకుంటాడు. దీనికి విరుద్ధంగా, తీవ్రమైన బాధాకరమైన మెదడు గాయం లేదా సబ్‌అరాక్నాయిడ్ రక్తస్రావం ఫలితంగా కోమా తక్షణమే సంభవించవచ్చు. కోమాలో ఉన్న వ్యక్తి ఎవరిని గుర్తించడు. ఎటు వంటి ఆహారం తీసుకోడు. తనంతట తానుగా కదలడు. మాట్లాడడు పడుకున్న దగ్గర నుండి లేవడు. శవానికి ప్రతిరూపమే కోమాలో ఉన్న వ్యక్తి. ఎప్పుడు మేల్కొంటాడోర్ ఎవరు చెప్పలేరు. కోమాలో ఉన్న వ్యక్తి ఎప్పుడు లేస్తాడో ఎవరు చెప్పలేరు. అంచనా బట్టి డాక్టర్లు చెబుతారు కానీ నిజంగా ఎప్పుడు చైతన్యవంతుడవుతాడో చెప్పలేరు.
మతం కోమాలో ఉన్న వ్యక్తి:-- దీర్ఘకాలిక రోగంతో బాధపడే వ్యక్తి ఎలాగైతే కోమాలో ఉంటాడో అలాగే మతం మత్తులో ఉండి ఉన్మాద స్థితికి చేరుకొని మనిషి కూడా అలాగే తయారవుతాడు. మతం కోమాలో ఉన్న వ్యక్తికి విచక్షణ జ్ఞానం నశిస్తుంది. ఆలోచనలను ప్రశ్నించి, విశ్లేషించే సామర్ధ్యం కోల్పోతాడు. అనుసరించడమే పరమావధిగా పెట్టుకుంటాడు..ఇతర మతాల వారిని చూస్తే సహనం కోల్పోతాడు. తన మతమే గొప్పదంటాడు. తన దేవుడే గొప్పవాడంటాడు.
తన మతమే తన దేవుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు అంటాడు.తన నియమాలే, తన సంప్రదాయాలే, తన ఆచార వ్యవహారాలె సరియైనవని అంటాడు. ఇతర మతాల వారి ఆచారాలు సంప్రదాయాలు సరికావని వాదిస్తాడు. మనుషుల్ని హీనంగా చూస్తాడు ..రాళ్లను, పక్షులను పశువులను క్రిములు కీటకాలను దేవుళ్లు అంటాడు
మద్యం మత్తు కన్నా అత్యంత భయంకరమైన మత్తు మతం. మతం మత్తులో ఉన్నవాడు మనుషులను, తన బంధు వర్గాన్ని కూడా తన కుటుంబ సభ్యులను కూడా పురుగుల్లాగా చూస్తాడు. వారికి జ్ఞానం కలగలేదంటాడు. దేవుని స్మరణలో మునిగిపోతాడు. దేవుని సాక్షాత్కారం కోసం కొందరు ప్రయత్నం చేస్తుంటారు. మత గ్రంథాల్లో చెప్పినట్టుగా, కథలలో జరిగినట్టుగా తనకు కూడా జరగాలని వాంచిస్తాడు. దేవుళ్ళు ప్రత్యక్షమై వరాలిస్తే బాగుంటుందని రాత్రింబవళ్లు ధ్యానం చేస్తాడు. ఒకవేళ తన అభిమతానికి విరుద్ధంగా దేవుడు రాకుంటే ఆత్మ త్యాగం చేసుకోవడానికి అయినా సిద్ధపడతాడు.
కొందరు ఆవేశపరులు తమ సంసారము బాగుపడుతుందని, తమకు సంపదలు వచ్చి చేరుతాయని తమ కొడుకును బలివ్వాలని ఎవడో గడ్డాలు పెంచిన సన్యాసి చెబితే నిజమని నమ్మి తన కన్న కొడుకులను కూడా బలియిచ్చిన సందర్భాలు కూడా మన రాష్ట్రాల్లో జరిగాయి. మదనపల్లిలో జరిగిన ఘటన ఇంకా మన మనసులో నుండి చెరిగిపోలేదు. ఇవన్నీ కూడా మతం పిచ్చిలో చేసిన సంఘటనలే..అక్షర జ్ఞానము లేని వారి విషయంలో జరిగితే ఏరేలే చదువుకున్నోడు కాదు కదా? అనుకుంటాం..
బాగా చదువుకుని విద్యావంతులైన వారు భక్తి మత్తులోచేసిన అరాచకాలు కూడా.యిన్ని అన్ని కావు.
మతం మార్పులేని వ్యవస్థ.. వేల ఏళ్ల నాడు ఏవైతే సంప్రదాయాలు,ఆచారాలుగా, నియమాలుగా కొనసాగుతున్నవో, అవి మార్పు లేకుండా ఇంకా ఇప్పటికి ఈ అధునిక యుగంలో కూడా కొనసాగుతున్నాయి. కాలానుగుణంగా మతం మార్పు చెందదు మతంలోనికి అదనంగా కొన్ని వచ్చి చేరుతాయే తప్ప ఉన్నవి మాత్రం మార్పు చెందవు. ఒక మనిషి ఏదైతే మతం స్వీకరిస్తాడో,
ఆ మతంలోని నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు అన్ని పాటించవలసి ఉంటుంది. లేనిచో మతబోధకుల నుండి మత గురువుల నుండి ఒత్తిడి వస్తుంది. అందరూ కలిసి వారిని మతంలో చేరేవరకు దాడులు కూడా చేస్తారు. కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి పెంచుతారు.
విధి లేని పరిస్థితుల్లో వాడు మతంలో చేరవలసిందే.
మన దేశంలో కులమతాలు మనుషులను విభజించాయి. విడదీసాయి .మనుషుల మధ్య అడ్డుగోడలు నిర్మించాయి. సఖ్యత లేకుండా చేశాయి. సహకారం, సోదర భావం కానరావడం లేదు. మనుషులను మనుషులుగా చూసే మానవతా ధర్మం మట్టిగలిసి పోయింది. సమానత్వ భావాన్ని చంపి వేశాయి. మనుషుల మధ్య కలహాలను సృష్టించాయి.ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఇతర కారణాలవల్ల చనిపోయిన వారి కంటే కుల మతాల మధ్య కలహాల వల్ల చనిపోయిన ప్రజలే అధికం అని సర్వేలు తేల్చి వేశాయి. కులాలను మతాలను మనుషులే సృష్టించుకున్నా రు మనుషులు సృష్టించుకున్న కులాలకు, మతాలకు మనుషులే బానిసలు అయ్యారు. ఇది విచిత్రమైన పరిస్థితి. మనుష్య జాతిలో తప్ప ఏ ప్రాణులలో లేని విచిత్రమైన పరిస్థితులు మానవ సమాజంలో ఉన్నాయి. దీనికంతటికి మానవుడే కారణం. మానవుడే మహనీయుడు. మానవుడే మహానుభావుడు. మానవుని వలన అభివృద్ధి జరిగింది. కానీ మనుషుల మధ్య సఖ్యతను పెంచలేకపోయింది.
మనిషి ప్రస్తుతం మతం కోమాలో మునిగిపోయాడు. ఎప్పుడు చైతన్యవంతుడైతాడో , ఎప్పుడు నిజాలు తెలుసుకుంటాడో ఎప్పుడు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందుతాడో, ఎప్పుడు ఇతర దేశాల సరసన నిలబడతాడో ఎవరు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తానున్న పరిస్థితిలో ఏమిటో తెలుసుకో లేకుండా ఉన్నారు. అబద్ధాలే నిజాలై సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నాయి. మానవుడు తాను కులమతాల దుష్ట సంప్రదాయాలలో కూరుకుని పోయాడని అర్థం కావడం లేదు. ఇదొక్కటి అర్థమైనా నాడు మన దేశాన్ని అభివృద్ధి పదములోకి తీసుకుపోతాడు.
అడియాల శంకర్, అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం.