భూ భారతి భూ హక్కులకు కొత్త యుగం

Apr 22, 2025 - 16:38
Apr 22, 2025 - 16:39
 0  12
భూ భారతి భూ హక్కులకు కొత్త యుగం
భూ భారతి భూ హక్కులకు కొత్త యుగం

7జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:-

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ అన్నారు.

మంగళవారం మానవపాడు మండలంలోని కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం-2025 పై అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొని, భూభారతి చట్టంపై, అందులోని అంశాలపై వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భూమి మరియు రైతు మధ్య అనుబంధం అనివార్యమైనది,భూ భారతి చట్టం - 2025 ద్వారా రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు,రక్షణ, సమర్థవంతమైన నిర్వహణకు అవసరమైన అన్ని సహాయాలు అందించడం లక్ష్యమని పేర్కొన్నారు. భూమిపై మన దేశంలో శతాబ్దాలుగా సాగిన భూ వ్యవస్థలో అనేక దశల మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు.రాజుల కాలం నుండి ఇప్పటి వరకు భూ సంస్కరణ చట్టాలు, భూమిపై హక్కులు, పరిపాలన విధానాలు గణనీయంగా మారాయని అన్నారు.గతంలో ధరణి వ్యవస్థలో సాంకేతిక సమస్యలు,పాత భూ రికార్డుల అప్డేట్ లోపాలు, రైతుల భూముల జాబితాలో తప్పుల వలన అనేక ఇబ్బందులు ఏర్పాడని అన్నారు.ధరణి స్థానంలో భూమి హక్కుల రికార్డులను మరింత సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.గతంలో ధరణి వ్యవస్థలో మన జిల్లా 7 స్థానంలో ఉండగా, ఇప్పుడు ఈ చట్టం అమలుతో మరిన్ని అప్లికేషన్లు త్వరగా పరిష్కరించబడతాయని, భూ సంబంధిత సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు వీలవుతుందని తెలిపారు.ఈ చట్టం ద్వారా భూ హక్కుల రికార్డులు పకడ్బందీగా నిర్వహించబడుతూ, ప్రజలకు తప్పుల సవరణకు కూడా స్పష్టమైన అవకాశం కల్పించబడుతోందని అన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ చేపట్టేముందు భూముల సర్వే నిర్వహించి,సంబంధిత మ్యాప్‌ను సమర్పించాల్సి ఉంటుందని,ఈ చర్యల ద్వారా భూమి హద్దులపై పూర్తి స్పష్టత ఏర్పడి, భవిష్యత్తులో ఏలాంటి వివాదాలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు.పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూ భారతి చట్టం ద్వారా అవకాశం కల్పించబడిందని, వారసత్వ భూముల మ్యుటేషన్‌కు ముందు 30 రోజులలో విచారణ చేసి,కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.భూ హక్కులు సంక్రమించిన ప్రతీసారీ మ్యుటేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేస్తారనికొత్త పాసుపుస్తకాల్లో సర్వే మ్యాప్ తప్పనిసరిగా ఉంటుందని అన్నారు.భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ, ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ వద్ద అపీల్స్ చేయవచ్చని పేర్కొన్నారు.ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డుల తరహాలో భూ ఆధార్ కార్డులు అందజేస్తామని అన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.మే 1వ తేదీ నుంచి గ్రామ పాలన అధికారుల నియామకంతో భూ సమస్యలు సులభతరం అవుతాయని అన్నారు. భూభారతి అమలుతో భూ సంబంధిత సమస్యలు జిల్లా స్థాయిలోనే త్వరగా పరిష్కరించబడతాయని,రైతులు, పేదలు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని తమ భూముల సంబంధిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవాలని అన్నారు.

అనంతరం పలువురి అనుమానాలు,సందేహాలు నివృత్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో మానవపాడు తహసిల్దార్ జ్యోషి శ్రీనివాస్ శర్మ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కుమార్, ఎంపీడీవో భాస్కర్, ఏవో సందీప్ కుమార్, రెవెన్యూ డీటీ ధరణిష, రైతులు,తదితరులు పాల్గొన్నారు. 

———————————————

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State