భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఊపిరి

Jun 23, 2026 - 19:33
 0  1
భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఊపిరి

కొత్త స్థలంపై కేంద్రానికి ప్రతిపాదనలు

10 రోజుల్లో ఫీజిబిలిటీ నివేదిక ఇవ్వాలని అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశం 

రాంమోహన్ నాయుడిని కలిసిన మంత్రులు తుమ్మల, ఉత్తమ్

జులైలో మామునూరు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

న్యూఢిల్లీ, జూన్‌ 23:

దశాబ్దాలుగా భద్రాద్రి జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ప్రతిపాదించిన స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన ప్రభుత్వం, అక్కడ సాధ్యాసాధ్యాల పరిశీలనను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్‌ నాయుడిని కలిసి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు.

గత రెండు ప్రతిపాదనలకు సాంకేతిక అడ్డంకులుః

కొత్తగూడెం సమీపంలో గతంలో ప్రతిపాదించిన రెండు స్థలాల్లో విద్యుదీకృత రైల్వే మార్గం, కొండలు అత్యంత సమీపంలో ఉండటం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భద్రతా ప్రమాణాలు నెరవేరడం లేదని ఫీజిబిలిటీ అధ్యయనాల్లో తేలిందని మంత్రి తుమ్మల వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, దానిపై సమగ్ర నివేదిక రూపొందించేందుకు ఏవియేషన్ సంస్థను నియమించినట్లు తెలిపారు.

కొత్త స్థల ప్రతిపాదనపై 10 రోజుల్లో నివేదికః

కొత్తగా ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించి ఫీజిబిలిటీ నివేదికను పది రోజుల్లో అందజేయాలని కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రక్రియలను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.

మామునూరు ఎయిర్‌పోర్టుకు త్వరలో శంకుస్థాపనః

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వరంగల్ జిల్లా మామునూరు మరియు ఆదిలాబాద్ విమనాశ్రయాల నిర్మాణాలపై చర్చలు జరిపినట్లు కేంద్రమంత్రి తెలిపారు. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయానికి జులైలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు. అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టును త్వరలోనే రక్షణశాఖ ద్వారా అనుమతులు పొంది, వారి ద్వారానే నిర్మాణం చేపట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

భద్రాచలం భక్తులకు వరంః

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని చెప్పారు.

పారిశ్రామిక, విద్యా రంగాలకు కొత్త ఊపుః

సింగరేణి బొగ్గుగనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, బీపీఎల్ వంటి ప్రముఖ పరిశ్రమలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పటికే ప్రత్యేక పారిశ్రామిక గుర్తింపు పొందిందని తుమ్మల తెలిపారు. జిల్లాలో ఉన్న అటవీ సంపద, ఖనిజ వనరులు, ఎకో టూరిజం అవకాశాలు, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులకు విమానాశ్రయం మరింత బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు విద్యా, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారంః

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, అనుమతుల ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు త్వరలోనే వాస్తవరూపం దాల్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333