మూసి ప్రాజెక్టు రైట్ కెనాల్ షట్టర్స్ మరమ్మత్తులు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి సూర్యాపేట రూరల్: గత ఆరు మాసాల క్రితం మూసి ప్రాజెక్టు కుడి కాలువ మూడు తూముల రైట్ కెనాల్ షెటర్స్ ఊడిపోయాయని తక్షణమే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మూసి ప్రాజెక్టును తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసి ప్రాజెక్టు షెటర్స్ ఊడిపోవడం మూలంగా నీరు వృధాగా కాలువ ద్వారా ప్రవహించిన కారణంగా ప్రాజెక్టు నీటిమట్టం పెరగకపోవడం వలన ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ నిఒ ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న కూడా పాలకులు గాని, అధికారులు గాని ప్రాజెక్టులో అని నీటిని కాపాడడంలో ఏమాత్రం చిత్తశుద్ధి కనబరచలేదని విమర్శించారు. తక్షణమే రైట్ కెనాల్ షెటర్స్ బాగు చేయించి ఆయకట్టు రైతాంగంలో ఉన్న సందిగ్ధాను తీర్చాలని లేనియెడల ఆయకట్టు రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందడి రామ్ రెడ్డి, జిల్లా నాయకులు నారాయణ వీరారెడ్డి, పందిరి సత్యనారాయణరెడ్డి, బోళ్ల నాగేందర్ రెడ్డి, నంద్యాల కేశవరెడ్డి, మేరెడ్డి కృష్ణారెడ్డి, నంద్యాల జగదీష్ రెడ్డి, బిక్షం, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.