ప్రాంక్ మోజులో పంచాయతీ కార్యదర్శి స్త్రీ వేషం..
పిల్లల కిడ్నాపర్ అనుకుని పట్టుకుని చితక్కొట్టిన గ్రామస్థులు
ప్రాంక్ మోజులో పడి స్త్రీలా వేషం వేసుకుని జనాన్ని ఆటపట్టించే ప్రయత్నం చేసిన పంచాయతీ కార్యదర్శిని జనం పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ములుగులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లికి చెందిన బి.వేణుగోపాల్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ప్రాంక్‌లు చేయడాన్ని ఇష్టపడే వేణుగోపాల్ గతరాత్రి ములుగు చేరుకుని అమ్మాయిలా వేషం వేసుకుని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వచ్చీపోయే వారిపై ప్రాంక్ చేసేందుకు ప్రయత్నించాడు.
మహిళ వేషంలో ఉన్నది పురుషుడని గమనించిన కొందరు వ్యక్తులు వేణుగోపాల్‌ను పట్టుకుని పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడిని విచారించగా గుమ్మలపల్లి పంచాయతీ కార్యదర్శి అని తేలింది. ప్రాంక్‌లు చేయడం అలవాటుగా మార్చుకున్నట్టు గుర్తించిన పోలీసులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇలాంటి పచ్చిపనులు ఏంటని మందలిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యలకు సమాచారం అందించి పంపించారు