ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

Sep 8, 2026 - 21:48
Sep 8, 2026 - 21:59
 0  4
ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

 తిరుమలగిరి 09 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా నాగారం సర్కిల్ పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని నాగారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జన కార్యక్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు నాగారం సర్కిల్ పరిధిలోని తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి మండలాల గ్రామాలకు చెందిన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, విగ్రహ తయారీదారులు, డీజే నిర్వాహకులతో తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ప్రజలంతా పరస్పరం సహకరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. గణేశ్ ఉత్సవ కమిటీలు మండపాల ఏర్పాటు విషయంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్, మండపాల నిర్మాణం తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటు కోసం సంబంధిత పోలీస్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీస్ శాఖకు అందించాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గణేశ్ మండపాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు. ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

అలాగే డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌ల వినియోగం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. అధిక శబ్దం వల్ల ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున డీజేలు నిషేదం అన్నారు. సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం, అసభ్యకర ప్రవర్తన, గొడవలు, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం వంటి వాటికి పాల్పడవద్దని హెచ్చరించారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. గణేశ్ విగ్రహాల తయారీదారులు, ఉత్సవ కమిటీలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ శాఖ సూచనలు మరియు నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.

ప్రజల భక్తి భావాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం లేకుండా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ లు వెంకట్ రెడ్డి, మధు, చిరంజీవి, పోలీస్ అధికారులు, సిబ్బంది, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, విగ్రహ తయారీదారులు, డీజే నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి