ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని ఔషధాల నిల్వ గదిని సందర్శించి అక్కడ నిల్వ ఉంచిన మందుల స్టాక్‌ను పరిశీలించారు. మందులపై ఉన్న ఎక్స్‌పైరీ తేదీలను స్వయంగా తనిఖీ చేసి గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైన అన్ని రకాల మందులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం అవుట్ పేషంట్ విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలించారు. ప్రతిరోజు ఆసుపత్రికి ఎంతమంది ఓపి రోగులు వస్తున్నారు అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎక్కువసేపు వేచి ఉండకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఓపి విభాగంలో క్యూ లైన్లో ఉన్న రోగులతో కలెక్టర్ మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకురావాలని రోగులకు సూచించారు.
ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సమయానికి వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది కట్టుబడి పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన అన్ని రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, ఔషధాల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో సూపర్డెంట్ డాక్టర్ రమేష్ ఆర్ సి ఓ డాక్టర్ చైతన్య,వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.