ప్రభుత్వాలు నిర్మోహమాటంగా తేల్చుకోవాల్సిన అంశాలు ఎన్నో వుంటాయి.

Jul 25, 2024 - 09:53
Aug 26, 2024 - 17:46
 0  4
ప్రభుత్వాలు నిర్మోహమాటంగా తేల్చుకోవాల్సిన అంశాలు ఎన్నో వుంటాయి.

మెజారిటీ ప్రజానీకానికి  దూరమైతే ప్రమాదకరమనే   సోయి ఉంటే మంచిది.

తాత్కాలికంగా  సంపన్న వర్గాల నుండి ప్రయోజనాలు ఆశిస్తే దీర్గ కాలంలో పరాభవం తప్పదు.!!!!

-- వడ్డేపల్లి మల్లేశం 

కష్ట జీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అని  కళాకారులు రచయితలు   మేధావుల పక్షాన  మాట్లాడి వారి బాధ్యతలను మరింత విస్తరింపజేసిన క్రమములో  పరిపాలన అంటే ప్రభుత్వాలు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించడం అనే విస్తృత అర్థంలో నిర్వచించుకున్నప్పుడు  పాలకుల యొక్క  పాత్ర  జవాబు దారి తనం ఎంత బాధ్యతాయుతమైనదొ   అర్థం చేసుకోవచ్చు.  అదే క్రమంలో  కవులు  రచయితలను కళాకారులను కూడా ప్రభుత్వ పెద్దలు అప్పుడప్పుడు  మీరు ప్రజల వైపే పనిచేయాలి అని  నచ్చజెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు.  పరిపాలన అంటేనే సామాన్య ప్రజానీకం అనే విస్తృతార్థంలో  వినియోగించుకున్నప్పుడు  పాలకుల యొక్క స్వభావం,  పట్టుదల, విధానపరమైన ఆలోచనలు,  బాధ్యతలు, సిద్ధాంత పరిజ్ఞానం, భావజాలం  ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ దానికి భిన్నంగా  పాలకులు పెట్టుబడి దారి భూస్వామ్య పారిశ్రామికవేత్తలు సంపన్న వర్గాల వైపు  మో గ్గు చూపడంతో పాటు  పేద వర్గాలను వివక్షతకు గురి చేస్తున్న ఆనవాళ్లు ఈ దేశంలో  అనేకం కనిపిస్తాయి.  ఆ ప్రజా వ్యతిరేక విధానాల అవలంబించిన కారణంగానే ప్రభుత్వాలు ఎన్నోసార్లు ప్రజల చేతిలో  తిరస్కారం,  అవమానం తో పాటు ఓటమి పాలు కాక తప్పలేదు.  అలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని  మెజారిటీ ప్రజానీకానికి దూరమైతే రాబోయే ప్రమాదం  పాలకవర్గాలను  అగ్నిలా దహించి వేస్తుందని, సునామీల 
ముంచి వేస్తుందని గ్రహించడం అవసరం . ఎన్నికలు,  ప్రజా ఉద్యమాలు, ప్రజల ప్రతిఘటన వ్యతిరేకత ఉన్నప్పుడు మాత్రమే  ప్రజలు  గొప్పవాళ్ళని ప్రజలే ప్రభువులని కీర్తిస్తూ ఎన్నికల ప్రచారంలో లీనమైతారు. కానీ ఎన్నికలు ముగిసి పరిపాలన పగ్గాలు చేతికి రాగానే ఐదు సంవత్సరాల దాకా ప్రజలను పట్టించుకోకుండా  యాచకులు బానిసలుగా మార్చి శ్వౌర విహారం చేయడాన్ని మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం.  ప్రభుత్వాలు తప్పటడుగు వేస్తే  ప్రజలు నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, ప్రతిఘటిస్తారు  అనే సోయి గనుక ఉంటే పాలకులు కూడా తమకంటూ  కొన్ని విధానాలను నిర్మోహమాటంగా ప్రకటించి ప్రజల ఆమోదం పొందాలి.

 పాలకులు తేల్చుకోవాల్సిన కొన్ని అంశాలు :-

ప్రభుత్వాలు అవలంబించే విధానాలను బట్టి ప్రజల మద్దతు,  ప్రభుత్వాల మనగడ,  ప్రజల చేతిలో ఎదుర్కొనే పరాభవం , ఓటమి గెలుపు ఆధారపడి ఉంటాయి.   పాలనాపరమైన అంశాలలో పాలకులకు స్పష్టమైన విధానం అవసరం అందుకే  కొన్ని అంశాల పైన  తమ విధానం ఏమిటో తేల్చుకోవలసి ఉంటుంది.నచ్చితే మద్దతిస్తారు లేకుంటే తృణీకరిస్తారు. . వాటి ఆధారంగా ఆ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమా, పెట్టుబడిదారీ ప్రభుత్వమా,  భూస్వామ్య ప్రభుత్వమా  చెప్పవచ్చు.
--  ప్రజల వైపా  పెట్టుబడు దారి భూస్వామ్య సంపన్న వర్గాల వైపా తేల్చుకోవాలి.
--  సేవా దృక్పథంతో ప్రజలను  ప్రభువులు గా చూడడమా?  లేక వాణిజ్య ధోరణితో  ప్రజలను పీడించడమా?
--  మరింత మెరుగైన సమాజాన్ని ఆశించి అంతరాలు లేని వ్యవస్థ ద్వారా సమసమాజాన్ని స్థాపించడమా?  లేక ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలని  స్తబ్దతను కోరుకోవడమా?
--- శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అభివృద్ధిలోకి వెళ్లడమా  ?  అంద విశ్వాసాలు ,మతతత్వంతో  అభివృద్ధిని అడ్డుకోవడమా?  
--సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యాన్ని ఆశించడమా?  పెట్టుబడిదారీ వర్గాల ఎరువులు క్రిమిసంహారక మందుల కంపెనీలను ప్రోత్సహించి  ప్రజలను అనారోగ్యం పాలు చేయడమా?
---  విద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి  సమానత్వాన్ని సాధించడానికి కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడమా?  బాధ్యతలు విస్మరించి ప్రైవేటుకు అప్పజెప్పి మొక్కుబడిగా పరిపాలన గావించడమా?
--  ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని ఆరోగ్యాన్ని  బలోపేతం చేయడమా?  ప్రైవేటుకు అప్పజెప్పి చేతులు దులుపుకోవడమా?  
---లౌకిక విధానాన్ని అవలంబించడమా?  మతాలను మతతత్వాన్ని ప్రోత్సహించడమా?  
---ప్రజా సంపదను ప్రజలకు చట్టబద్ధంగా పంపిణీ చేయడమా?  ఉచితాలు థాయిలాల పేరుతో  ప్రజలను యాచకులుగా మార్చడమా ?
---మానవ, పౌర ,ప్రాథమిక హక్కులను గౌరవించి పరిరక్షించడమా?  నిర్బంధము, అణచివేత ,అక్రమ కేసులు,  అరెస్టులతో  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమా?
---  రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన న్యాయ0, స్వేచ్ఛ, స్వతంత్రము, సమానత్వము,  సౌబ్రాతృత్వము వంటి అంశాలను  పాలనలో ప్రతిఫలింప చేయడమా?  లేక  రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సొంత ఎజెండాతో  అక్రమ పాలనకు శ్రీకారం చుట్టడమా?
--  జనాభా దామాషాలో అన్ని సామాజిక వర్గాలకు  ఉద్యోగ విద్య అవకాశాలతో పాటు చట్టసభలలో  స్థానం కల్పించడమా?  లేక నాయకత్వంలో ఉన్న ఆధిపత్య వర్గాలు తమ కులాలకు చెందిన వారికి మాత్రమే అధికారాన్ని కట్టబెట్టడమా?  
---ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ప్రజలను స్వయం పోషకంగా  తీర్చిదిద్దడమా?  లేదా గాలిలో దీపం లాగా వదిలివేయడమా? 
-- ప్రైవేటే కరణను ప్రోత్స హించడమా?  ప్రభుత్వరంగాన్ని మరింత బలోపేతం చేయడమా?
          ప్రస్తుతము దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పరిపాలనలో  అనేక అవకతవకలు,  పాలకులు కావాలని చేస్తున్న తప్పటడుగులు,  రాజ్యాంగాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు,  అధికారాన్ని చేతిలోకి తీసుకొని చట్టాలకు అతిక్రమించి న్యాయవ్యవస్థను తుంగలో తొక్కిన సందర్భాలు అనేకం.  అందుకే పైన పేర్కొన్న అంశాలలో పాజిటివ్ నెగిటివ్ అంశాలు  ప్రస్తావించిన విషయాన్ని గమనించి పాలకులు  ఎటువైపు ఆలోచిస్తారో తేల్చు కోవాల్సిన అవసరం ఉంది.  ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే  మెడకు ఉచ్చు బిగిసినట్లుగా ప్రజల పోరాటాలు  నిరసనల హోరులో  పాలకులు బలికాక తప్పదు.  ఎందుకంటే ఈ దేశ పరిపాలన కొనసాగేది  ప్రజల చెమట ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి సంపదతోనే  కానీ పాలకుల జేబులో నుండి ఖర్చు చేస్తున్నది కాదు అని తెలుసుకోవడం అవసరం.  అందుకే ప్రజలకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రజా సంపదను పంపిణీ చేయాలి కానీ  దానం చేసినట్టు,  పాలకుల దయాదాక్షిణ్య మీద ఆధారపడి బ్రతికేట్లు,  యాచకులుగా మార్చే ఎలాంటి చర్యలు కూడా ప్రజలు అంగీకరించరని తెలుసుకోవడం అవసరం.  ఈ బుజ్జగింపులు,  ప్రలోభాలు ,వాగ్దానాలు, ఉచితాల  మత్తులో ప్రజలు పాలకులను ప్రశ్నించకుండా ఉంటారని  భ్రమ పడితే అది కల్ల మాత్రమే.  అందుకే పాలకుల యొక్క విధానపరమైన  నిర్ణయాలు  అవలంబించే విధానాల పైన  వాటి మనుగడ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  పాలకులు నిరంతరం చేస్తున్న తప్పులను కొంతైనా సవరించుకోవడం కోసం  తేల్చుకోవాల్సిన అంశాల పేరుతో పైన తెలిపిన  సమాచారాన్ని  పఠించి ప్రజలకు అనుకూలమైన విధానాన్ని పాటిస్తే  మంచిది. పెట్టుబడిదారుల ప్రయోజనాల మీద ఆధారపడి  కాలు జారితే మాత్రం ప్రజల చేతిలో పరాభవం తప్పదు .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333