ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం చదువు
జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయం
సూర్యాపేట జిల్లా ఎస్పీ బి కే రాహుల్ హెగ్డే
సూర్యాపేట:- ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం చదువు అని, మనం నిగ్రహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఏదైనా వినగలిగి, నిలబడగలిగి, గెలవగలమనే సామర్థ్యం విద్య ద్వారానే సాధ్యమవుతుందని, జర్నలిజం లో డాక్టరేట్ పొందడమే కాకుండా బంటు కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి కే రాహుల్ హెగ్డే ప్రశంసించారు. ఇటీవల జర్నలిజం లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా తో పాటు గోల్డ్ మెడల్ ను గవర్నర్ చేతుల మీదుగా అందుకుని అరుదైన ఘనత సాధించి సూర్యాపేట పేరును రాష్ట్రస్థాయిలో విస్తరింపజేసిన ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణను అదనపు ఎస్పి మేక నాగేశ్వరరావు తో కలిసి శాలువా కప్పి సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
విద్యను ఆర్జించి విజ్ఞానవంతులై ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఎలాగైనా డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించాలని నిరంతర తపన పట్టుదలతో తాను కన్న కలలను నిజం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదని, తన గోల్ రీచ్ అయ్యేవరకు నిరంతర తపన పట్టుదలతో కొనసాగడం అభినందించదగ్గ విషయం అన్నారు. అవిరళకృషి, నిరంతర సాధన ద్వారా ప్రతివారు కూడా విద్యలో అగ్ర శిఖరాలకు చేరుకోవచ్చు అని సూచించారు. ప్రతివారు కూడా చదువుతోపాటు సంస్కారం, మానవత్వం కలిగి ఉండాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. సంపద కంటే చదువు ముఖ్యమైనదని, సంపదను నిరంతరం మనం కాపాడుకోవాల్సి వస్తుందని, చదువు మాత్రం మనల్ని కాపాడుతుందని, చదువు ద్వారా సంపాదనే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయని వివరించారు.