ప్రజా ప్రతినిధుల కేమో లక్షలు ఉద్యోగులకు శిక్షలా?

Apr 12, 2026 - 21:36
 0  0


ప్రజా సంపదను కొల్లగొడుతున్నది  రాజకీయ ప్రతినిధులని సర్వత్రా విమర్శలు.  అక్కడక్కడ ఉద్యోగుల అవినీతి కారణంగా  కుదేలవుతున్న ప్రజా జీవితం. రెండు వర్గాలు ఆలోచన చేస్తే  మంచిది.

---  వడ్డేపల్లి మల్లేశం

ప్రజా జీవితాన్ని ప్రత్యక్షంగా  ప్రభావితం చేస్తున్న రాజకీయ యంత్రాంగం ఉద్యోగ వర్గాలు  ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అంత ప్రజలకు మేలు జరుగుతుంది.  ఈ రెండు వర్గాలు అవినీతికి పాల్పడితే  ఇక ప్రజా జీవితం అంధకారమే.  ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో  ప్రజా జీవితాన్ని చిద్రం చేస్తున్నది రాజకీయ యంత్రాంగమైతే  అవకాశాల వారీగా అవినీతికి పాల్పడుతున్నcçది  ఉద్యోగులని  సర్వత్రా విమర్శలు ఉన్నవి.  ఇది ఆరోపణ మాత్రమే కాదు  కళ్ళ ముందు జరుగుతున్న కటోర సత్యం  అంతేకాదు ప్రజా సంపదను  ప్రజలందరికీ సమానంగా పంచవలసిన ప్రభుత్వాలు  పెట్టుబడిదారుల పంచన చేరి  ప్రజలకు ద్రోహం చేస్తూ  తమ అధికారాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో ఎంతటి తప్పుడు పనులకైనా పాల్పడుతూ ఉంటే  వీరికి మద్దతుగా అక్కడక్కడ ఉద్యోగులను కూడా వాడుకొని  బలి పశువులను చేస్తున్న విషయాలు సర్వత్ర  ఆందోళన కలిగిస్తున్నవి..శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖలు  అంటే ప్రజా ప్రతినిధులు అధికారులు ఉద్యోగ యంత్రాంగం  సమన్వయంతో కలిసి పని చేస్తే  అంకిత భావంతో  ఆరాటపడితే ఈ దేశ పరిస్థితులు మరింత బాగుండేవి.  ఇప్పటికీ రోజు పత్రికల్లో  ప్రభుత్వ భాగస్వాముల అవినీతి  అక్రమా స్తులు, భూధందాలు  దర్శనమిస్తుంటే  అవినీతికి పాల్పడిన ప్రజా ప్రతినిధులు తమ తప్పును అంగీకరించకపోగా  విచారణ అధికారులపై  తిరుగుబాటు చేస్తున్న విషయాలు మరింత ఆశ్చర్యకరం.  స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ  నిజమైన నేరస్తులను గుర్తించడం  కీలకం. ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రభుత్వ పాలక పక్షాలు ప్రజలను పక్కదారి పట్టిస్తూ  పరస్పరం విమర్శించుకుంటూ పోతే   నేరాన్ని  అంగీకరించకపోగా తప్పించుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. 

రాజకీయ యంత్రాంగంపై పెను ఆరోపణలు:

పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు వారి బంధువులు అనుంగు సహచరుల పైన  వస్తున్న ఆరోపణలకు అంతులేదు. కొందరు అధికారం లేకుండానే అనధికారికంగా చక్రం తిప్పుతూ  ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ వాటిపైన స్పష్టమైన విచారణ జరగని కారణంగా  తప్పించుకు తిరుగుతున్నారు. ఇక శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు  అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలకు అంతే లేదు.  వారి వేతనాలను వారే నిర్ణయించుకోవడంతో పాటు  ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి  ప్రయాణ ఖర్చులు ఫోన్ చార్జీలు గ్యాస్  గృహవసతి  విమాన చార్జీలు  కలుపుకుంటే  వార్షికోదాయం కోట్లలోనే ఉంటుంది.  గమ్మత్తైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి పార్లమెంటు సభ్యునిగా  శాసనసభ్యునిగా పనిచేస్తే  రెండు రకాల పెన్షన్లు పొందుతున్నారని ఇది ప్రజాధనాన్ని దుబారా చేయడమేనని  ఆరోపణలు వినబడుతున్నాయి. దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతున్నది. పైగా వీరి నాయకత్వంలో తీసుకోబడేటువంటి నిర్ణయాలను అమలు చేసే ఉద్యోగ యంత్రాంగం  తీసుకున్న చర్యలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయ వ్యవస్థ దృష్టికి వచ్చినప్పుడు  కోర్టు బోనులో నిలబడేది శిక్ష అనుభవించేది ఉద్యోగులే కానీ మంత్రులు కాదు.  మరొకవైపు మంత్రులు చెప్పిన మాటలు లేదా మౌఖిక ఆదేశాలను ఉద్యోగులు ధిక్కరించినట్లయితే  వారికి బదిలీలు  ఇతర శిక్షలు సర్వసాధారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల  ఆవరణలో ఇతర కార్యాలయాలు ఉండకూడదని  అలాంటి అవకాశం ఇచ్చినటువంటి అక్కడి జిల్లా కలెక్టర్లకు  హైకోర్టు శిక్ష విధించడం నిజంగా  సరైనదేనా? దానికి మ0త్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి వెనుక ఉండి నడిపించిన కథ ఎవరికి తెలియదు.

 తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇతరత్రా ప్రాజెక్టుల అవకతవకల పైన జరుగుతున్న విచారణలో  ఇంజనీర్లు అధికారుల పైన  అమలవుతున్న శిక్షలు ఒత్తిడి ఆ ప్రజాప్రతినిధుల పైన కనిపించకపోవడమే నిదర్శనం.  కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నాటి ముఖ్యమంత్రి,,నీటిపారుదల శాఖ మంత్రులను  విచారణ కమిటీ  విచారించినప్పటికీ  ఇతర అనేక అవినీతి  ఆరోపణల్లో నాటి మాజీ మంత్రులను విచారించినప్పటికీ ఏ ఒక్కరికి కూడా శిక్ష పడలేదు.  కేంద్రం  వారిని ముఖ్యమంత్రి శిక్షించాలని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. అంటే పరస్పరం  ఆరోపించుకోవడం కోసం కాలయాపనకే నా?  చిత్తశుద్ధి గనుక ఉంటే కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల పైన  జరిపిన న్యాయ విచారణ మేరకు  శిక్ష ఇప్పటికే అమలు కావలసి ఉండే కానీ ఎలాంటి  సూచనలు కనిపించడం లేదు అంటే ఎంతటి ఆరోపణలకైనా తప్పించుకోవడానికి ఈ దేశంలో అవకాశం ఉంది ప్రజా ప్రతినిధులకు అని  తెలుస్తున్నది. శాసనసభ్యులు, మంత్రులు అవినీతి  సొమ్ము కోట్లలో సంపాదిస్తుంటే శిక్షలు మాత్రం  వారి  పర్యవేక్షణలో పనిచేసిన అధికారులు ఉద్యోగులకు  అమలవుతున్నటువంటి  విధానం సరైనదేనా? చట్టాన్ని ఉల్లంఘించలేక మంత్రుల ఆదేశాలను కాదనలేక  అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే  అందులో కూడా అవినీతి ఉద్యోగులు ఆ నిర్ణయాలకు మరింత ఆజ్యం  పోస్తే  శిక్షలు అనుభవిస్తున్న ఉద్యోగులు  కులుకుతున్నది ప్రజాప్రతినిధులు అనే మాట వాస్తవం. చ ట్టసభలు జరిగినంత కాలం  హాజరు కావలసినటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ప్రతిపక్ష నాయకులు  హాజరుకాకుండానే సంవత్సరాల తరబడిగా వేతనాలు తీసుకుంటున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి  ఇరువురు కూడా సభకు రాకుండానే వేతనం తీసుకుంటూ ప్రభుత్వాలపైన లేనిపోని నిందలు వేస్తున్నారు కానీ నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనకపోవడం  ఎంతవరకు సమంజసం.? ఉద్యోగులు విధికి నిర్వహణకు రాకపోతే వేతన0లో  కోత విధించినట్లు  ప్రజా ప్రతినిధులకు కూడా  కోత విధించడం ద్వారా  గైర్హాజరు పీరియడ్ కు తగిన శిక్ష అమలు చేయాల్సిన అవసరం ఉంది.  ప్రజా ప్రతినిధులకు ఒకనీతి అధికారులకు మరొక నీతి యా?  

ఉద్యోగులు  బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

అకారణంగా తమ బాధ్యత ఏమీ లేకుండా పై అధికారులు లేదా మంత్రులు, శాసనసభ్యుల యొక్క  సూచన మేరకు చర్యలు తీసుకున్న కారణంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ శిక్షింపబడుతున్న అధికారులు కూడా ఎంతోమంది.  మరొకవైపు ఉద్యోగుల్లో కిందిస్థాయి వారు అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్న సందర్భాలు అక్కడక్కడ పత్రికల్లో  చోటు చేసుకుంటుంటే,  ప్రజల  సంపదను చెమట చుక్కలను వేతన రూపంలో తీసుకుంటున్న అధికార యంత్రాంగం కూడా  ప్రజలకు రైతులు కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు విభిన్న వర్గాలకు చెందిన పేద ప్రజలను పీడిస్తూ అవినీతికి పాల్పడుతూ లంచాలను  డిమాండ్ చేస్తూ  చట్టం చేతికి చిక్కిన వాళ్ళు కూడా ఎంతోమంది. మరొకవైపు ఉద్యోగుల్లో కూడా  అంకిత భావంతో పనిచేసి ప్రజల హృదయాల చొరవన్న వాళ్లు కూడా ఎంతోమంది లేకపోలేదు.

చట్టబద్ధంగా వస్తున్న వేతనాలతో పాటు మరింత అక్రమ సంపాదన కోసం ఆశపడి ప్రజల నుండి డిమాండ్ చేస్తూ  చట్టం చేతికి చిక్కి  అవినీతి వలలో  విలవిల కొట్టుకుంటున్నటువంటి  ఉద్యోగులు కూడా తమ బాధ్యతను  గుర్తించి కర్తవ్యాన్ని నిర్వహించాలి. కానీ అక్రమ సంపాదన కోసం అర్రు లు చాస్తే ప్రజాప్రతినిధుల కంటే ముందుగానే శిక్ష అనుభవించవలసి ఉంటుంది అనేది ఆచరణలో చూస్తున్న విషయం.  ముఖ్యంగా రాజకీయ నాయకులు  ఉద్యోగులు రెండు వైపులా ప్రజా సంపదను కొల్లగొ డుతున్నారనే మాట  సర్వత్రా వినబడుతుంది. అయితే ఈ రెండు వర్గాల ఆలోచన సరళి అంకితభావం వల్లనే ప్రజాల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి.  అక్రమాలకు పాల్పడతావా? ప్రజల హృదయాల్లో నిలిచిపోతావా? తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఉద్యోగులకు చాలా ఉంది.  ఇటీవలి కాలంలో న్యాయమూర్తుల పైన కూడా అవినీతి ఆరోపణలు  రావడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి జాడ్యం యొక్క వికృత విస్తృత రూపానికి ప్రతీక.  వడ్డించే వాడే పక్షపాతం చూపిస్తే,  శిక్షించే న్యాయ వ్యవస్థనే  పొరపాట్లకు అవకాశం ఇస్తే ఇక ఈ దేశాన్ని రక్షించేది ఎవరు?  ప్రజాస్వామిక మౌలిక సూత్రాలను గొప్పగా చెప్పుకున్నప్పటికీ  శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ శాఖలు  విడివిడిగా సమన్వయంగా ఈ దేశ భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేయనంత కాలం  ఈ భారత రాజ్యాంగం మేడిపండు లాగా మాత్రమే మెరిసిపోతుంది తప్ప  ప్రజల మనసులను గెలుచుకోలేదు. పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మ  హత్యలు, దోపిడీ పీడన, వంచన,వివక్షత, సంపద కేంద్రీకరణ  వంటి అనేక   జాడ్యా లతో పాటు  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు,  అర్ధనగ్న దృశ్యాలు, అంగంగా ప్రదర్శనలు, మద్యపానం ధూమపానం  డ్రగ్స్ వంటి సామాజిక వ్యతిరేక  రూపాలకు ప్రభుత్వాల అండదండలు ఉన్నాయనే  ఆరోపణలు  ద్వంద్వ  ప్రమాణాలకు నిదర్శనం కాదా?

రాజకీయ ఉద్యోగ రంగాల యొక్క అవినీతిని  ఆశ్రిత పక్షపాతాన్ని  దోపిడిని సామాన్య ప్రజలు  ప్రశ్నించకపోతే  ఆ రంగాలు మరింత విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది.  ఎంతో గొప్ప రాజ్యాంగం అని గర్వంగా ప్రపంచ స్థాయిలో చెప్పుకున్నామో  అన్ని బలహీనతలు   కనపడుతున్న వేళ  మానవీయ నైతిక విలువలకు సంబంధించిన  నూతన తరాన్ని రాజకీయ రంగంలోకి ఆహ్వానించవలసిన అవసరం చాలా ఉన్నది. అదేవిధంగా నూతనంగా ఉద్యోగ బాధ్యతలు వస్తున్నటువంటి  ఐపీఎస్ ఐఏఎస్ ఇతరత్రా అధికారులు  దేశం పట్ల  సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడానికి సంబంధించి ప్రమాణాలు చేసి  బాధ్యతల్లో చేరి  ఈ దేశ స్థితిగతులను అర్థం చేసుకున్నప్పుడు  అవసరమైన సందర్భంలో ప్రజా  నిరసన వ్యక్తమైన రోజుననే  ఈ రెండు రంగాల యొక్క అవినీతికి అడ్డుకట్ట వేయడానికి,  మంచిని   పెంచడానికి, నిజాయితీ పరుల  గుర్తించడానికి అవకాశం ఉంటుంది.  ఐఏఎస్ శంకరన్న గారి  లాంటి అధికారులు ఉద్యోగులు,  అవినీతి మచ్చలేని  అనేకసార్లు శాసనసభ్యులుగా  గెలిచి  ప్రజల్లో తలలోని నాలుకల  ప్రజలతో మమేకమైన  ఇల్లందు శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య గారి   లాంటి వాళ్లను  నేటి తరo  ఆదర్శంగా తీసుకుంటే  కంపు కొడుతున్న రాజకీయ వ్యవస్థను కొంతవరకైనా  శుద్ధి చేయవచ్చు కదా.!  

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333