పెన్నులపైనే మన్నుకప్పితే గన్ను లై పేలక తప్పదు
కలం పైనే బలం చూపెట్టి గళం నొక్కి జులుమ్ చేస్తే కాలం బుద్ధి చెప్పక తప్పదు
పూటుగా తాగి జర్నలిస్టులపై ఘాటుగా వాగిన మట్టి మాఫియా పై చట్ట ప్రకారం వేటుకు ఎందుకు వెనుకంజ..!
అక్రమాలు బయట పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న మట్టి మాఫియా... భయపెట్టి నిజాలను దాచాలని చూస్తున్న మట్టి మాఫియా
మీడియా పైనే తప్ప తాగి దాడులు చేయాలనుకుని భయభ్రాంతులకు గురి చేస్తే జంగ్ సైరన్ ఊదక తప్పదు
మట్టి మాఫియా అక్రమాలను, ఆగడాలను ప్రశ్నిస్తే మీడియా గొంతు నొక్కుతారా... ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తారా... నాలుగో స్తంభాన్ని కూల్చివేస్తారా...?
ఇసుక దందాకు విలేకరులు బలి అయినట్టుగా... మట్టి మాఫియా గుండా ఇజము, తాగుబోతు ఇజం, రౌడీయిజాలకు కూడా మీడియా బలి కావాల్సిందేనా..?
అర్ధరాత్రి లేదు.. అపరాత్రి లేదు...*మర్డర్ అయితే ఉరకాలి ..యాక్సిడెంట్ అయితే పరిగెత్తాలి... మట్టి అక్రమ రవాణా అంటూ బాధితులు ఫోన్ చేస్తే మీడియా వెళ్లకూడదా...?
టైమింగ్ లేనిది మీడియా జీవితం... 365 డేస్... 24,×7 మీడియా అనేది ఆన్ డ్యూటీ... విషయం తెలుసుకోవడానికి, వార్త సేకరించడానికి మీడియా వెళ్లకూడదా...?
జర్నలిస్టులకు పదివేలు ఇచ్చినట్టుగా వీడియో తీయండి రా అంటూ మట్టి మాఫియా తమ తాబేదారులకు హుకుం
మైనింగ్ వారికి రెండు లక్షలు ఇచ్చాం... కలెక్టర్ ఎస్పీ లకి ఫిర్యాదు చేసుకొని కేసు పెట్టుకోండి అంటూ దౌర్జన్యం చేసిన మట్టి మాఫియా
మట్టి రవాణా సక్రమమే అయితే... మట్టి దందాకు అన్ని రకాలుగా అనుమతులు ఉంటే... ఉదయం పూట చేయకుండా రాత్రి మాత్రమే రవాణా చేయడంలోని మతలబు ఏమిటి...?
మట్టి మాఫియా ఆగడాలను, అక్రమాలను అరికట్టడానికి పోలీస్, రవాణా, మైనింగ్ శాఖలు వెనుకంజ వేయడంలోని ఆంతర్యం ఏమిటి...?
ఇసుక ఆన్లైన్ విధంగానే మట్టి సరఫరాకు కూడా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాలి అంటున్న ప్రజానీకం
✍️గోల్డ్ మెడలిస్టు డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత
సూర్యాపేట జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు అంతులేకుండా పోతున్నాయి. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మట్టి మాఫియా మీడియా పై పడింది. ప్రస్తుతం మీడియా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అటు ఆకాశం మీద గాని, ఇటు భూమి మీద గాని మీడియా జీవితాలు లేకుండా త్రిశంకు నరకంలో వేలాడుతున్నాయి. యాజమాన్యాల నుంచి నెలవారి జీతాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వాలని ఆయా మీడియా సంస్థలపై ఒత్తిడి తెచ్చింది లేదు. వేజ్ బోర్డు అమలు అంతే సంగతులుగా ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో మీడియా కుటుంబాలు దిక్కుతోచకుండా ఉన్నాయి. టైమింగ్ లేని వెట్టి చాకిరి కింద మీడియా జీవితాలు ఉన్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎక్కడ ఏ సంఘటన ఎప్పుడు జరిగినా తప్పకుండా కవరేజ్ కి వెళ్ళాలి. కత్తుల వంతెన మీద కవాతు చేస్తున్నట్టుగా దినదిన గండం ఒక ఆయుష్షుగా విలేకరుల జీవితాలు ఉన్నాయి. నిప్పుల కుంపటి మీద రగులుతున్నట్టుగా కంటికి కునుకు లేకుండా కష్టపడ్డప్పటికీ సంసారాలను పోషించుకోలేని స్థితిలో జర్నలిస్టుల పరిస్థితి ఉంది. హక్కులు అడిగే సంగతి ఏమో కానీ కనీసం బాధ్యతగా బతుకుదామన్నా జర్నలిస్టులు బతికే స్థితిలో లేరు. తమను ఆదుకుంటాయి అనుకున్న అన్ని జర్నలిస్టుల సంఘాలు గాని, తమ తోటి జర్నలిస్టుల సానుభూతి, మద్దతు గానీ కొందరు జర్నలిస్టులు పొందలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మర్డర్లు జరిగినా, మానభంగాలు జరిగినా, యాక్సిడెంట్లు జరిగినా వార్త మిస్ కాకుండా సమయం ఏదైనాప్పటికీ ఎంత రాత్రి అయినప్పటికీ కవరేజ్ చేయాల్సిందే అన్నట్టుగా మీడియా 24 గంటలు విధి నిర్వహణలో ఉంటుంది. అలాంటిది అర్ధరాత్రి అక్రమ మట్టి దందా జరుగుతుంటే ఫిర్యాదు అందితే అక్కడి వెళ్లి వాస్తవ పరిస్థితులు పరిశీలించాల్సిన విధి, వార్తను సేకరించాల్సిన బాధ్యత విలేకరిపై ఉంటుందా, ఉండదా అని విమర్శలు కూడా చేసే కొందరు ప్రశ్న వేసుకుంటే జవాబు దొరుకుతుంది కదా. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా నిలిచి ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణ బద్ధులై ఉండాల్సిన మీడియాను కొన్ని రకాల మాఫియాలు ఉక్కు పాదంతో అణచివేయాలని భయభ్రాంతులకు మీడియా లొంగదు వంగదు అన్న విషయాన్ని మాఫియా తెలుసుకుంటే మంచిది. న్యూటన్ గమన సూత్రాల ప్రకారం బంతిని గోడకు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెను తిరిగి వస్తుంది అన్న సూత్రం ప్రకారం మీడియాపై ఎన్ని రకాలుగా దాడులు చేసి, దౌర్జన్యాలు చేసినా మీడియా తన పూర్వ వైభవాన్ని కోల్పోదు సరి కదా అంతకంతకు రెట్టింపు సంఖ్యలో వాస్తవ వార్త కథనాలు అందించి ప్రసారం చేసి, ప్రచురించి మీడియా తన విశ్వసినీయతను చాటుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నియంతృత్వాన్ని ప్రదర్శించిన ముస్సోలిని లక్ష సైన్యానికి భయపడతావా, ఒక్క పత్రికకు భయపడతావా అని ఆనాడే అంటే ఒక పత్రికకు భయపడతా, ఒక పత్రిక కోట్ల సైన్యంతో సమానం అని ఒప్పుకున్న చరిత్ర మనం చూశాం. నియంతృత్వానికి ప్రతీకగా నిలిచి ఫాసిజం చాటిన హిట్లర్ లాంటివాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు. మట్టి మాఫియా రౌడీయిజం కూడా ఎంతో కాలంగా సాగదు అన్న "సత్యం"ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని పలువురు మేధావులు హితబోధ చేస్తున్నారు.
ఇది ప్రజాస్వామ్యమా.. మాఫియాల రాజ్యమా...?
ఇసుక మాఫియా ఇబ్బందులు... మట్టి మాఫియా భయభ్రాంతులు...!
మట్టి మాఫియా పై ప్రత్యేక నిఘా పెట్టాలి
ప్రజలకు నిజం తెలియాల్సిందే... బెదిరింపులకు భయపడం అంటున్న మీడియా...అక్రమ రవాణా ఆపే వరకు ఉద్యమం...!
తాము ఏదో ఒకటి చేస్తూ, యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్లను భరిస్తూ, నిత్యం ఒత్తిడిని అనుభవిస్తూ, అనునిత్యం కష్టాల సుడిగుండంలో కాగుతూ, వేగుతూ, బతుకుతున్న జర్నలిస్టులకు మాఫియాల రాజ్యం ఒక సవాలుగా మారింది. ఇసుక మాఫియా ఎంతో మంది విలేకరుల జీవితాలను అతలాకుతలం చేసినట్టుగానే, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో మట్టి మాఫియా జర్నలిస్టులపై కక్ష కట్టింది. తాజాగా ఎలాంటి పర్మిషన్ లేకుండా బాలెంల గ్రామం సమీపంలోని తండాలో రాత్రిపూట అక్కడి ప్రజలకు నిద్ర పట్టకుండా, జెసిబిల పెద్ద పెద్ద శబ్దాలతో, టిప్పర్లతో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న వార్త సమాచారంతో వెళ్లిన జర్నలిస్టులకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అక్కడ జరుగుతున్న అక్రమ మట్టి దందా విషయమై తెలుసుకొని, వార్త సేకరణ చేద్దామని వెళ్లిన మీడియాకు చేదు అనుభవం ఎదురయింది. మట్టి మాఫియా కు పునాదిగా ఉన్న యజమానులు హైవేపై కార్లలో తాగుతూ, ఊగుతూ మీడియా వచ్చిందని సమాచారం రాగానే ఫుటుగా తాగిన మత్తులో, ఘాటైన పదజాలంతో విలేకరులపై విరుచుపడి దౌర్జన్యం చేస్తూ, భయభ్రాంతులకు గురిచేసి దాడి చేసినంత పని చేశారు. వాస్తవానికి అక్కడ మీడియా ప్రతినిధులు ఒక గుంపుగా వెళ్లారు కాబట్టి సరిపోయింది, అదే ఒకరిద్దరూ వెళ్లి ఉంటే అక్కడ ఏమి జరుగునున్నదో కనీసం మన ఊహించలేము కదా. మట్టి మాఫియా తాగిన మైకంలో దాడులు చేస్తే, జరగరానిది ఏదైనా జరిగితే విలేకరుల కుటుంబాలు రోడ్డున పడేవి కాదా. వాస్తవానికి ఎక్కడికి వెళ్లినా అక్కడ జరుగుతున్న సంఘటన గురించి మీడియా వీడియో తీసే పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ మీడియాపై మట్టి మాఫియా తాగిన మైకంలో సిండికేట్ గా అందరూ ఒక్కసారిగా ఉరికి వచ్చి చిందులు తొక్కుతూ మీడియా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మీడియా గొంతు నొక్కడం కాదా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన మీడియా పైననే అక్రమ దందాకు తెరలేపిన మట్టి మాఫియా యజమానులు "కలెక్టర్లకు, ఎస్పీలకు చెప్పినా మాకు ఏం కాదు, కేసులు పెట్టుకోండి చూద్దాం, అందరికీ డబ్బులు ఇస్తున్నాం"అన్న విధంగా మాట్లాడటం ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చ. అంతటితో ఆగకుండా ఎవరిని ఏమి డబ్బులు అడగనప్పటికీ మట్టి మాఫియా వారే వివాదం సృష్టించి విలేకరి ఒక్కంటికి 10000 ఇస్తున్నట్టు ఒక ఫేక్ వీడియో తయారు చేద్దాం, వీడియో తీయండి రా అంటూ తమ అనుచరులను ఉసిగొల్పడం, అసభ్య పదజాలంతో, బూతులు మాట్లాడుతూ మీడియాపై చిందులు తొక్కుతూ మట్టి మాఫియా మీడియా వారిని ఎగతాళి చేయడం సిగ్గుచేటు.
మట్టి మాఫియా కు అన్ని అనుమతులు ఉంటే ఉదయం పూట రవాణా ఎందుకు చేయరు..?
మట్టి మాఫియా చేసేదంతా చట్ట ప్రకారమే అయితే, వారికి మట్టి రవాణా చేయడానికి అన్ని రకాల అనుమతులు ఉంటే, జెసిబి లతో తవ్వి మట్టి అమ్ముకోవచ్చని కానున్ ఉంటే, అన్ని రకాలుగా అనుమతులు మట్టి మాఫియా వద్ద ఉంటే ఎందుకు అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా రవాణా చేస్తున్నారు అన్న సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలకు నిద్ర భంగం జరగకుండా ఉదయం పూట మట్టి రవాణా ఎందుకు చేయటం లేదు అన్న ప్రశ్న తలెత్తక మానదు. అంటే ఉదయం పూట రవాణా చేస్తే అనుమతులు లేని అక్రమ రవాణా కాబట్టి పోలీసు వారు ప్రశ్నిస్తారు, రవాణా శాఖ వారూ ప్రశ్నిస్తారు, మైనింగ్ వారు ప్రశ్నిస్తారు అన్న భయంతో నేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపు ఉదయం పూట డ్యూటీ లో ఉంటారు కాబట్టి, వారి కన్నుగప్పి రవాణా చేయడం అసాధ్యం కాబట్టి రాత్రి వేళను ఎంచుకున్నారనే అనుకోవడం నిజమే కదా. అన్ని రకాల అనుమతులు సక్రమంగా ఉంటే ఉదయం పూట ఎందుకు రవాణా చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమ రవాణా పై మీడియా గత కొన్ని రోజులుగా ఇంత గగ్గోలు పెడుతుంటే సంబంధిత శాఖ అధికారులు మాత్రం కిమ్మనకుండా ఉండడంలోని ఆంతర్యం ఏమిటో అంతు పట్టడం లేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ మట్టి మాఫియా తిరిగి మంగళ, బుధవారాల్లో రాత్రి వేళల్లో తిరిగి తమ అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ నే అక్రమ రవాణా కొనసాగించడం కొసమెరుపు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా బాస్ లు అయిన కలెక్టర్, ఎస్పీలు మట్టి అక్రమ రవాణా పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో అని సూర్యాపేట జిల్లా ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.