పాటను బ్రతికించుకోవాలి.
ప్రజల జీవితాల నుండి పుట్టే పాటలే ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, కర్తవ్య దీక్షను, సమసమాజ భావనను, జీవిత సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తాయి. చెత్త పాటల తరిమి కొట్టడం కూడా ప్రజల బాధ్యత.
--- వడ్డేపల్లి మల్లేశం
శ్రమ నుండి పాట పుట్టింది ప్రజల వృత్తి పరికరాల నుండి గానం అవతరించింది కష్టాలను మరిచిపోవడానికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి కలిమిడిగా తోటి సమాజంతో బతకడానికి ఉపయోగపడేదే పాట అని అనేకమంది ప్రముఖ కవుల నుండి సామాన్యుల వరకు నమ్ముతున్న వాస్తవం. వరి చేలు పంట పొలాలు తదితర ప్రదేశాలలో శ్రమ చేస్తున్న కూలీలు ఆడబిడ్డలు కలుపు కోత నాటు వంటి పనులలో తమ శ్రమను మరిచిపోవడానికి, ఉల్లాసంగా పనిచేయడానికి, మరింత ఆసక్తిని పెంపొందించడానికి, నెగిటివ్ ఆలోచనలను దూరం చేయడానికి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా జీవితం పట్ల అనురక్తిని సాధించడానికి కూడా పాట ఎంతగానో తోడ్పడుతుంది అనేది సామాన్యుల అనుభవం ద్వారా వింటున్న మాట. ప్రముఖ కవుల నుండి సామాన్యుల వరకు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంలో మానవ చర్యలను ద్వి గునీకృతం చేసే ఉల్లాసాన్ని పెంపొందించడం ద్వారా మరింత మెరుగైన సమాజాన్ని నిర్మించడం కోసం పాట యొక్క లోతుపాతులను తెలుసుకోవడం,పాటను ప్రేమించి ఆరాధించడం, అభిమానించడం సామాన్యుల నుండి అసమాన్యుల వరకు తప్పనిసరి.
భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ప్రజా ఉద్యమాల సందర్భంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, స్వతంత్ర పోరాటం, ఇటీవలి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాట కీలక భూమిక పోషించిన విషయం మనందరికీ తెలుసు. గతంలో ఉన్న రచయితలే కాకుండా కొత్త వాళ్లు కూడా పాటలను అల్లి తమ అనుభవాలను జోడించి గాయకులుగాఎదిగిన సందర్భాలు అనేకం. విషయాన్ని అవగాహన జేయించే వక్తలు పోషించిన పాత్ర కీలకమే అయిన దాని శాతం చాలా తక్కువ.కానీ పాట నోటి నుండి కదలాడగానే వేదిక సందడి చేస్తే వేదిక ముందు ఉన్నటువంటి ప్రేక్షకులు ఆబాల గోపాలం తిండి తిప్పలు దాహం కుటుంబాలని మరిచి పాటలోని రసాన్ని గ్రోలడానికి చెవికో సుకున్న సందర్భాలు అనేకం .వ్యాసరచన కున్నటువంటి లక్షణాల మాదిరిగానే పాటలో కూడా మూలాలు, విషయ వివరణ, కారణాలు, పరిష్కారాలు, ప్రస్తుత మన కర్తవ్యాలను హెచ్చరించే ధోరణిలో గాయకుల నుండి ఉబికి వచ్చే పాటలు మనలో చలనాన్ని రేకెత్తించి, కర్తవ్యాన్ని ఉద్భోదించి, ఉద్యమంలో దూకేలా చేస్తాయి. అలాంటి పాత్రలే మనo ఉద్యమాలలో కల్లారా చూసినాము.
భిన్న వాదనలు
*******పని నుండి పాట పుట్టిందని, శ్రమయే పాటకు మూలమని, ఆదివాసీల పరికరాలే పాటకు ప్రేరణ అ ని, ఏడుపు దుఃఖము ఆవేదన ఆక్రోషము ఆనందం కూడా పాట పుట్టుకకు కారణమని, ఆయాసము ని ట్టూర్పు పీడన దోపిడీ కూడా పాటను నిలబెడతాయని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారాలను మూలాలను వెతికి ప్రజలకు సులభంగా అర్థం చేయించే మౌలిక సాధనమే పాట అని భి న్న వాదనలతో అనేకమంది మేధావులు విధ్వాంసులు పాటను నిర్వచించి పాట యొక్క పు ట్టుపూర్వోత్తరాలను ప్రస్తావించిన సందర్భాలు అనేకం. ఈ అంశం పైన ప్రముఖ తత్వవేత్త బిఎస్ రాములు గారు ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని పాట కేంద్రంగా రచించగా పాట పుట్టుకకు ప్రధాన కారణం శ్రమ అని ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ గారు ఒక పాట ద్వారా దాని ప్రాధాన్యతను వివరించిన విషయం అందరు తెలుసుకోవలసివుంది. మరింత లోతుగా పాటను గురించి అధ్యయనం చేయడానికి బిఎస్ రాములు గారి పుస్తకాన్ని మనమందరం చదవడం ద్వారా పాట ప్రాధాన్యతను పాట ఆవశ్యకతను పాట పుట్టుకను పాట యొక్క పాత్రను మరింత లోతుగా పలకడానికి అవకాశం ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఎన్ని వాదనలు ఉన్నప్పటికీ దాని యొక్క సారాంశం మనిషిని ఆలోచింపజేయడం, ప్రేరణ కల్పించడం,కర్తవ్యాన్ని నిర్దేశించడం, సోమరితనాన్ని పారదోలడం, తక్షణ ప్రయోజనాన్ని సొంతం చేసుకోవడమేనని మనకు అర్థమవుతున్నది.
తక్షణ సామాజిక ప్రయోజనం పాటలతోనే సాధ్యం :-
**********
పాట ఉండవలసిన మౌలిక లక్షణాలైనా పల్లవి చరణాలు తాళం లయ ఆరోహణ అవరోహణ క్రమాలు రాగం మనిషిని అటువైపు లాక్కుంటుంది. చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే విధంగా మనిషిని సిద్ధం చేస్తుంది ఆ రకమైనటువంటి కేంద్రీకరణ కేవలం పాట కే సాధ్యం. ఉపన్యాసాలు, కథనాల వంటివి అంత గాఢంగా ఆకర్షించకపోవచ్చు కానీ పాటకు ఉన్నటువంటి ఈ ప్రత్యేకత పరమ ఔషధం వంటిది. వేలాది లక్షలాది మందిని కూడా ఒకచోట కూర్చుండబెట్టి ఆలోచింపచేసే విషయాన్ని అర్థం చేయించే క్రమానికి నటన, నవరసాల పోషణ, ఆహార్యంతో, పాట ఎంతగానో తోడ్పడుతుంది. పరస్పరం చర్చించుకోవడానికి సంప్రదించడానికి తన కర్తవ్యాన్ని గుర్తించడానికి స్థానిక, కాల, విషయ యుక్తమైనటువంటి పాటల జోరు కల్పిస్తుంది ప్రజలలో హుషారు. ఇప్పటికీ అనేకమంది కవులు గాయకులు, వాగ్గేయకారులు జానపద గీతాలను ఆలపించేవాళ్లు విప్లవ గీతాలను వినిపించేవాళ్లు ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా లక్ష సాధన వైపుగా తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఆశువుగా పాటలు రాసి పాడి సమాజాన్ని మెప్పించగలిగినటువంటి వాగ్గేయకారులకు తెలుగు నేలలో కొరత లేదు. సినీ రంగంలోని గాయనీ గాయకులతో పాటు ముఖ్యంగా విప్లవ ప్రజా జీవితంలో వాసికేక్కిన గద్దర్, విమలక్క, జయరాజ్, మాస్టర్ జి, గిద్దె రాంనర్సయ్య, సోమన్న, నల్లగొండ గద్దర్ సుద్దాల అశోక్ తో సహా ప్రస్తావించ లేకపోయిన మరెందరో గాయనీ గాయకులకు వారి కృషికి ఉద్యమ స్ఫూర్తికి అభినందనలు కృతజ్ఞతలు.
సామాజిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, భూ పంపిణీ, ఆర్థిక సమానత్వము, దోపిడీ పీడన వంచన, పెట్టుబడిదారీ వ్యవస్థ, ఆర్థిక దోపిడి,భూస్వామ్య దోపిడీ, వంటి అంశాల పైన
సమయానుకూలంగా వివిధ కాలాలలో పాట పోషించిన పాత్ర గణనీయమైనది. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో " బండి ఎనక బండి గట్టీ పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తవు కొడుకో నైజామ్ సర్కరోడా " అని హెచ్చరించిన పాట కానీ భూస్వామ్య వ్యవస్థలో చితికిపోయిన బాల్యం గురించి సుద్దాల సుద్దాల హనుమంతు గారు రాసిన" పల్లెటూరి పిల్లగాడా పసుల గాచే మొనగాడా" అన్న పాటలు నాటి నుండి నేటి వరకు ఆ వ్యవస్థను మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తున్నవి .
ఆ పాటలకు భిన్నంగా అశ్లీలంగా అర్థరహితంగా సంపాదన స్వార్థం కోసం రాస్తున్నటువంటి నేటి పాటలు ఎన్నో సినిమా రంగంలోనూ ఇతరత్రా దర్శనమిస్తూ పాట యొక్క మౌలిక లక్ష్యాన్ని దెబ్బతీస్తున్న మాట కూడా వాస్తవం. ఆ పాటలు రాస్తున్న వాళ్లు కూడా మన లోని గాయకులే .సామాజిక ప్రయోజనం లేని సంఘానికి విద్రోహం తలపెట్టే అర్థం లేని ఊకదంపుడు పాటలను గాయకులు రచయితలు అందరూ తిరస్కరించాలి, ప్రజలు బహిష్కరించాలి, అలాంటి వాళ్లతో సినిమా ఇతర సీరియల్లకు పాటలు రాయించుకునే వాళ్ళు వారిని వె లివేయాలి అప్పుడు మాత్రమే అర్థవంతమైన సమాజ ఉద్ధరణకు తోడ్పడే పాట దర్శనమిస్తుంది. పాట బతికి అలాంటి పాటలే పది కాలాలపాటు ప్రజల నోళ్ళల్లో నానడమే కాదు ప్రజలకు మేలు చేసే కార్యానికి కొంతవరకైనా పనిచేస్తాయని అంగీకరించడంలో అత్యాశ లేదు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)